చచ్చిపోతున్నా వదలకుండా.. దోచుకున్నారు!
గుర్తుతెలియని వాహనం ఢీకొని విపరీతంగా రక్తస్రావం అవుతున్న ఓ వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. అతడిని దోచుకున్న దారుణ ఘటన ఢిల్లీ సుభాష్‌నగర్‌లో చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన మతిబూల్ అనే రిక్షా కార్మికుడు వాహనం ఢీకొన్న తర్వాత గంటన్నర పాటు అలాగే రక్తం కారుతూ రోడ్డుమీద పడి ఉన్నాడు. అతడిని రక్షించడానికి ఎవరూ రాలేదు. అతడి మొబైల్ ఫోన్ దూరంగా పడి ఉంది. కాసేపటికి అటువైపుగా వెళ్లిన మరో రిక్షా కార్మికుడు.. అతడిని కాపాడే ప్రయత్నం చేయకపోగా మొబైల్ ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు.
తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, పోలీసులకు 7 గంటలకు గానీ తెలియలేదు. పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే రక్తస్రావం అధికంగా కావడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. పగటిపూట ఈ-రిక్షా నడుపుకొంటూ, రాత్రిళ్లు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తాడని అతడి జేబులోఉన్న పత్రాల ద్వారా తెలిసింది. అతడిని ఢీకొట్టిన టెంపో డ్రైవర్ కిందకు దిగి చూసి, ఏమీ చేయకుండా మళ్లీ వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజి ద్వారా తెలిసింది.