River water Allocation
-
కృష్ణా జలాల పునఃపంపిణీ చట్టవిరుద్ధం
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులతో సమానమని చట్టంలో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేసింది. నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్ ఒకసారి ఉత్తర్వులు జారీ చేశాక పునఃపంపిణీ కుదరదంటూ 1956 చట్టానికి 20 02లో సవరణ చేయడాన్ని ప్రస్తావించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ 2 కేటా యించిన జలాలను విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం కాకుండా అంత ర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రా ల మధ్య పంపిణీ చేయాలన్న తెలంగాణ సర్కార్ ప్రతిపాదనపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను వ్యక్తిగతంగా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు గురువారం లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► ఐఎస్ఆర్డబ్ల్యూఆర్డీ 1956 సెక్షన్ 3 ప్రకారం 1969లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ – 1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 1976 మే 31న అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల్లో అప్పటికే పూర్తయిన వాటికి ప్రాజెక్టుల వారీగా 749.16 టీఎంసీలను కేటాయించింది. జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీలు కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. ► కృష్ణా జలాల పునఃపంపిణీకి సెక్షన్ 3 ప్రకారం 2004లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ–2.. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదు. కేడబ్ల్యూడీటీ–1 తీర్పును పునఃసమీక్షించటం చట్టవిరుద్ధం కావ డం వల్లే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 75 శాతం నీటి లభ్యత కంటే ఎక్కువగా ఉన్న మిగులు జలాలనే కేడబ్ల్యూడీటీ–2 పంపిణీ చే సింది. మిగులు జలాలను పంపిణీ చేస్తూ కేడబ్ల్యూడీటీ–2 కేంద్రానికి ఇచ్చిన నివేదికను సవా ల్ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ కేడబ్ల్యూడీటీ–2 నివేదికను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ► గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్న ప్రకారం కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తెలంగాణ గత నెల 9న ఉపసంహరించుకుంది. సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు లేఖ రాసింది. ► 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన జలాలను కేడబ్ల్యూడీటీ–2 కొనసాగించింది. ఎందుకంటే వాటిని పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధం. -
కృష్ణ.. కృష్ణా.. ఏమిటీ 'నిర్లిప్తత'!
కృష్ణా జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) విఫలమవుతోందని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యను కేంద్ర జల్ శక్తి శాఖ, కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీకి) నివేదించడం లేదా జాయింట్ కమిటీ ఏర్పాటు చేయడంతో తన బాధ్యత పూర్తయిందనే రీతిలో బోర్డు వ్యవహరిస్తోందని విశ్లేషిస్తున్నారు. సమస్యపై అధ్యయనం చేసి.. పరిష్కారం కోసం సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికనూ అమలు చేయడంలోనూ బోర్డు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతి ఎటూ తేల్చని సమస్యలివీ.. సమస్య 1 చిన్న నీటి పారుదల విభాగంలో తెలంగాణ అధికంగా కృష్ణా నీటిని వినియోగించుకుంటోంది. చిన్న నీటిపారుదల విభాగంలో చెరువులు, కుంటలు, చిన్నతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా ఎత్తిపోతల కింద 89.90 టీఎంసీల కంటే తెలంగాణ సర్కార్ అధికంగా వాడుకుంటోందని, ఈ లెక్క తేల్చాలని కృష్ణా బోర్డును ఏపీ జల వనరుల శాఖ అధికారులు కోరారు. దీనిని తెలంగాణ నీటి పారుదల అధికారులు వ్యతిరేకించారు. దాంతో రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులు, బోర్డు అధికారులతో సంయుక్త కమిటీ (జాయింట్ కమిటీ)ని నియమించి తెలంగాణ వాడుకుంటున్న నీటి లెక్క తేలుస్తామని 2017లో బోర్డు స్పష్టం చేసింది. ఆరు నెలలు కాదు.. నాలుగేళ్లు గడిచాయి. ఇప్పటికీ ఆ లెక్క తేల్చలేదు. సమస్య 2 హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే కోటా కింద పరిగణించాలని తెలంగాణ 2016లో కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోందని పేర్కొంది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కృష్ణా బోర్డు కోరింది. ఇప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. సమస్య 3 నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 40 శాతం మేర ఉన్నాయని తెలంగాణ సర్కార్ చేసిన వాదనను ఏపీ ఖండించింది. ప్రవాహ నష్టాలు 27 శాతానికి మించవని 2019లో స్పష్టం చేసింది. ప్రవాహ నష్టాలను తేల్చేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆరు నెలల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని కృష్ణా బోర్డు పేర్కొంది. దాదాపు రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రవాహ నష్టాలను తేల్చలేదు. సమస్య 4 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను వాడుకోలేకపోయామని.. వాటిని 2020–21లో వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ సర్కార్ కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 తీర్పులో క్లాజ్–8 ప్రకారం ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని.. వాడుకోకుండా మిగిలిపోయిన జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశాన్ని సీడబ్ల్యూసీ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. సీడబ్ల్యూసీ ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ నివేదిక ఇచ్చింది. వాడుకోకుండా మిగిలిపోయిన నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని.. వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కానీ.. సీడబ్ల్యూసీ నివేదికను అమలు చేయడంలో కృష్ణా బోర్డు జాప్యం చేస్తోంది. దాంతో.. 2020–21లో తమ కోటాలో వాడుకోకుండా మిగిలిపోయిన నీటిని 2021–22లో వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని తెలంగాణ సర్కార్ మళ్లీ పాత పల్లవి అందుకోవడం గమనార్హం. సమస్య 5 కృష్ణా నదికి 2019–20లో ఎన్నడూ లేని రీతిలో భారీ ఎత్తున వరద ప్రవాహం వచ్చింది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తేసి.. వరద జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో 44 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం మళ్లించింది. ఆ సమయంలో వాటిని మళ్లించకపోతే సముద్రంలో కలిసేవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సముద్రంలో వరద జలాలు కలుస్తున్న సమయంలో ఇరు రాష్ట్రాలు మళ్లించిన జలాలను.. ఆ రాష్ట్రాల కోటా కింద లెక్కించకూడదని కృష్ణా బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. దాంతో.. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ సమస్య పరిష్కారానికి మార్గనిర్దేశం చేయాలని సీడబ్ల్యూసీని కోరింది. దీనిపై సీడబ్ల్యూసీ ఇప్పటిదాకా నివేదిక ఇవ్వకపోవడంతో.. ఆ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. -
కృష్ణ... కృష్ణా..!
* నదీ జలాల కేటాయింపులో అన్యాయాన్ని పట్టించుకోని కేంద్రం * పంపకాల్లో అసమానతలను సవరించాలన్న రాష్ట్ర విజ్ఞప్తి బుట్టదాఖలు! * లేఖ రాసి ఏడాది అయినా స్పందన శూన్యం * ఫిర్యాదును సంవత్సరంలోపు పరిష్కరించాలని చెబుతున్న చట్టం * కేంద్రం తీరును తప్పుపడుతూ మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని సవరించాలన్న రాష్ట్ర విజ్ఞప్తి బుట్టదాఖలవుతోంది. కృష్ణా నీటిని వినియోగించుకుంటున్న రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కార మార్గాన్ని వెతకాల్సిన కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నదీ జలాలను మళ్లీ కేటాయించాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం ఏడాది కిందట కేంద్రానికి విన్నవించుకున్నా ఇంతవరకూ ఉలుకూపలుకూ లేదు. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం.. ఏ రాష్ట్రమైనా ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా పరిష్కారం చూపాలి. లేని పక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. దీంతో మళ్లీ తెలంగాణ నీటి పారుదల శాఖ తమ వినతులపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఘాటుగా లేఖ రాసింది. కేటాయింపుల్లో అన్యాయం ఇదీ.. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే గతేడాది జూలై 14న కేంద్రానికి టీ సర్కార్ లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఈ లేఖలో వివరించిం ది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5% ఉన్నా నీటి కేటాయింపులు మొత్తం కేటాయింపుల్లో 35% మాత్రమే ఉన్నాయని తెలిపింది. తెలంగాణ ఆయకట్టు ప్రాంతం 62.5% లెక్కలోకి తీసుకుంటే ఈ కేటాయిం పులు సరిపోవని, ఏపీ పరివాహకం 31.5%, ఆయకట్టు 37.5% ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపినట్లు వివరించింది. మొత్తం జలాల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీటినే కేటాయించారు. పరివాహక ప్రాంతం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో ప్రభుత్వం పేర్కొంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి కేటాయింపులు జరిపారని, గతంలోని ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్కు, రాయలసీమలోని సుంకేశులకు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా.. ఆర్డీఎస్కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించారని పేర్కొంది. ట్రిబ్యునల్ ముందు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదని తెలిపింది. ఇకనైనా స్పందించండి... రాష్ట్రం చేసిన అభ్యర్థనపై అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం సెక్షన్(4) ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించా ల్సి ఉన్నా.. స్పందన లేకపోవడంతో రెండ్రోజుల కిందట రాష్ట్రప్రభుత్వం మరోసారి ఘాటుగా లేఖ రాసింది. ‘‘రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి) ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు కేటాయింపులు ఎలా జరపాలన్నది బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను, ప్రాజెక్టుల నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచారణ చేయాలని కేంద్రం సూచన చేయకుంటే ట్రిబ్యునల్ రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తుంది?’’ అని కేంద్రానికి రాసిన లేఖలోనిలదీసింది. ఇప్పటికైనా స్పందన తెలపాలని కోరింది.