కృష్ణ... కృష్ణా..!
* నదీ జలాల కేటాయింపులో అన్యాయాన్ని పట్టించుకోని కేంద్రం
* పంపకాల్లో అసమానతలను సవరించాలన్న రాష్ట్ర విజ్ఞప్తి బుట్టదాఖలు!
* లేఖ రాసి ఏడాది అయినా స్పందన శూన్యం
* ఫిర్యాదును సంవత్సరంలోపు పరిష్కరించాలని చెబుతున్న చట్టం
* కేంద్రం తీరును తప్పుపడుతూ మరోసారి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పంపిణీలో జరిగిన అన్యాయాన్ని సవరించాలన్న రాష్ట్ర విజ్ఞప్తి బుట్టదాఖలవుతోంది. కృష్ణా నీటిని వినియోగించుకుంటున్న రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కార మార్గాన్ని వెతకాల్సిన కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నదీ జలాలను మళ్లీ కేటాయించాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం ఏడాది కిందట కేంద్రానికి విన్నవించుకున్నా ఇంతవరకూ ఉలుకూపలుకూ లేదు.
అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం.. ఏ రాష్ట్రమైనా ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా పరిష్కారం చూపాలి. లేని పక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. దీంతో మళ్లీ తెలంగాణ నీటి పారుదల శాఖ తమ వినతులపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఘాటుగా లేఖ రాసింది.
కేటాయింపుల్లో అన్యాయం ఇదీ..
తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే గతేడాది జూలై 14న కేంద్రానికి టీ సర్కార్ లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఈ లేఖలో వివరించిం ది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5% ఉన్నా నీటి కేటాయింపులు మొత్తం కేటాయింపుల్లో 35% మాత్రమే ఉన్నాయని తెలిపింది. తెలంగాణ ఆయకట్టు ప్రాంతం 62.5% లెక్కలోకి తీసుకుంటే ఈ కేటాయిం పులు సరిపోవని, ఏపీ పరివాహకం 31.5%, ఆయకట్టు 37.5% ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపినట్లు వివరించింది.
మొత్తం జలాల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీటినే కేటాయించారు. పరివాహక ప్రాంతం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో ప్రభుత్వం పేర్కొంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి కేటాయింపులు జరిపారని, గతంలోని ఒప్పందాల మేరకు తెలంగాణలోని ఆర్డీఎస్‌కు, రాయలసీమలోని సుంకేశులకు సమాన కేటాయింపులు జరపాల్సి ఉన్నా.. ఆర్డీఎస్‌కు 12 టీఎంసీలు కేటాయించి, సుంకేశులకు 39 టీఎంసీలు కేటాయించారని పేర్కొంది. ట్రిబ్యునల్ ముందు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటిని కేటాయించాలని విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోలేదని తెలిపింది.
ఇకనైనా స్పందించండి...
రాష్ట్రం చేసిన అభ్యర్థనపై అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం సెక్షన్(4) ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించా ల్సి ఉన్నా.. స్పందన లేకపోవడంతో రెండ్రోజుల కిందట రాష్ట్రప్రభుత్వం మరోసారి ఘాటుగా లేఖ రాసింది. ‘‘రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి) ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు కేటాయింపులు ఎలా జరపాలన్నది బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది.
రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను, ప్రాజెక్టుల నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకొని విచారణ చేయాలని కేంద్రం సూచన చేయకుంటే ట్రిబ్యునల్ రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తుంది?’’ అని కేంద్రానికి రాసిన లేఖలోనిలదీసింది. ఇప్పటికైనా స్పందన తెలపాలని కోరింది.