RNA virus
-
మోల్నుపిరావిర్ వైరస్‌ను ఏమార్చి, హతమారుస్తుంది.. ఇంతకూ ఆ పేరెలా వచ్చింది?
కల్లోల కరోనా సోకకుండా టీకాలు చాలావరకు అడ్డుకుంటాయి. కానీ కరోనా సోకిన వారికి నిర్ధిష్టమైన వైద్యం పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులో ఉన్న వివిధ రకాల ఔషధాల కాంబినేషన్లను, యాంటీ వైరల్ మందులను వాడి కరోనా రోగులను కాపాడే యత్నాలు జరుగుతున్నాయి. తాజాగా కరోనా సోకిన వారి చికిత్స కోసం ఫైజర్, మెర్క్ సంస్థలు మాత్రలు తయారుచేశాయి. మెర్క్ తయారీ మోల్నుపిరావిర్ మాత్ర (‘EIDD 2801’’) కు భారత్‌లో తాజాగా అనుమతులు లభించాయి. కరోనాకు కళ్లెం వేయడంలో ఇది ఉపయోగపడుతుందని, కరోనా వల్ల ఆస్పత్రి పాలవకుండా చాలావరకు కాపాడుతుందని కంపెనీ చెబుతోంది. భారత్‌లో దీన్ని సిప్లా తదితర సంస్థలతో కూడిన కన్సార్టియం వేర్వేరు పేర్లతో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో కొత్త మాత్ర కథా కమామీషు చూద్దాం.. ఎవరికి మంచిది? ఎవరికి వద్దు? కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి దీన్ని వాడే వీలు లేదు. కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఇవి బాగా ముదిరి మరింత అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్న(హైరిస్కు) వ్యక్తులకు మాత్రమే డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఉదాహరణకు వృద్దులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి కరోనా సోకితే వీటిని సిఫార్సు చేస్తారు. ఇక 18 ఏళ్లలోపు పిల్లలకు ఈ మందు వాడకూడదు. ఇది వారిలో ఎముకల వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే గర్భిణులకు కూడా దీన్ని సిఫార్సు చేయరు. వీరికి ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిపాలై చికిత్స పొందేవారికి దీని వాడకం కూడదు. ఎప్పుడు ఆరంభించాలి? కరోనా పాజిటివ్ వచ్చాక లక్షణాలు బయటపడుతున్న ఐదురోజుల్లోపు దీని వాడకం ఆరంభించాలి. దగ్గు, తలనొప్పి, జ్వరం, వాసన లేకపోవడం, నొప్పుల్లాంటి సంకేతాలు కరోనా తొలిరోజుల్లో ఉంటాయి. ఈ దశలోనే వీటని డాక్టర్ సిఫార్సుతో వాడాల్సి ఉంటుంది. ఎంత డోసేజ్? ఈ మాత్రలు 200 ఎంజీ రూపంలో లభిస్తాయి. ప్రతి 12 గంటలకు ఒకసారి నాలుగు మాత్రల చొప్పున ఐదు రోజుల పాటు తీసుకోవడంతో కోర్సు పూర్తవుతుంది. అంటే మొత్తం కోర్సులో 40 క్యాప్సుల్స్ (ఐదు రోజులు– రోజుకు 8 మాత్రలు) వాడాల్సి ఉంటుంది. వరుసగా ఐదు రోజులకు మించి దీన్ని వాడకూడదని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ సహా దాదాపు అన్ని కోవిడ్ వేరియంట్లపై ఇది ప్రభావం చూపగలదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉన్నాయి? కరోనా లక్షణాలు బయటపడ్డవారు (ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోనివారు) ఆస్పత్రి పాలయ్యే రిస్కును, చనిపోయే ప్రమాదాన్ని ఈ మందు వాడకంతో దాదాపు 30– 50 శాతం తగ్గించవచ్చని క్లినికల్ డేటా ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. దీన్ని కేవలం కరోనా సోకిన తర్వాత మాత్రమే వాడాలని, టీకాలకు బదులు దీన్ని తీసుకుంటే సరిపోతుందని భావించవద్దని నిపుణుల హెచ్చరిక. ప్రతికూలతలు ఈ మాత్ర వాడకానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడంపై పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేమీ మ్యాజిక్ పిల్ కాదని, దీనివల్ల జరిగే మేలు పరిమితమని ప్రొఫెసర్ విలియం షాఫ్నర్ హెచ్చరించారు. దీని వాడకం వల్ల కొన్నిసార్లు డయేరియా, వికారం, వాంతులు, తలతిరగడం వంటి ప్రతికూలతలు కనిపించవచ్చు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లో దీన్ని 18 ఏళ్లు లోపువారికి, గర్భిణులకు, ఆస్పత్రిపాలైనవారికి వాడకూడదు. ఈ ఔషధానికి వైరస్ కణాల్లో ఉత్పరివర్తనాలను ప్రేరేపించే శక్తి ఉంది. ఈ శక్తి మానవ కణాలపై కూడా చూపే ప్రమాదం ఉందని, దీనివల్ల మానవ కణాల్లో అనవసర మార్పులు వచ్చి క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు ఉన్నాయి. కానీ దీన్ని నిరూపించే శాస్త్రీయ ఆధారాల్లేవు. ఏ దేశాల్లో అనుమతించారు? ఇప్పటివరకు ఈ ఔషధానికి యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, భారత్‌లో అనుమతి లభించింది. ధ్వంస రచన... ► ఉత్పరివర్తనాల్లో ఈ మందు కలగజేసే మార్పులతో వైరస్‌లోని మొత్తం మ్యుటేషన్ ప్రక్రియ తప్పులతడకగా మారడాన్ని ‘‘ఎర్రర్ కెటాస్ట్రోఫ్’’ లేదా ‘‘లీథల్ మ్యుటాజెనిసిస్’’ అంటా రు. ఈ విధ్వంసం కారణంగా అతిధేయి శరీరంలో వైరల్ లోడు క్రమంగా తగ్గిపోతుంది. ► సాధారణంగా రెమిడెసివిర్ లాంటి యాంటీ వైరల్ మందులు సదరు వైరస్‌లో పత్రికృతి (రిప్లికేషన్) ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా దాని వ్యాప్తిని నివారిస్తాయి. టీకాలు అతిధేయి శరీరంలో యాంటీబాడీ రెస్పాన్స్‌ను పెంచడం ద్వారా వైరస్‌ను అడ్డుకుంటాయి. వీటితో పోలిస్తే మోల్నుపిరావిర్ పనిచేసే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ► ఇది వైరస్ రిప్లికేషన్ ప్రక్రియలో అవసరపడే ఎంజైములను తప్పుదోవ పట్టిస్తుంది. దీంతో వైరస్ కణాల్లో తప్పుడు ఉత్పరివర్తనాలు ఆరంభమవుతాయి. వీటివల్ల రోగి శరీరంలో వైరస్ సంఖ్య పెరగడం ఆగిపోతుంది, ప్రతికృతి చెందిన వైరస్లు బతికినా అవి బలహీనంగా ఉండి వెంటనే నశించిపోవడం జరుగుతుంది. ► సింపుల్‌గా చెప్పాలంటే ఒక యంత్రంలో కీలక భాగాన్ని మారిస్తే దాని పనితీరు పూర్తిగా ధ్వం సమైనట్లే ఈ ఔషధం వైరస్‌పై పనిచేస్తుంది. ► శాస్త్రీయ భాషలో చెప్పుకుంటే ఈ ఔషధం వైరస్‌లోని ఆర్‌డీఆర్‌ఏ (ఆర్ఎన్ఏ డైరెక్టెడ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్) ఎంజైమ్‌ను ప్రేరేపించి వైరల్ ఆర్ఎన్ఏలో పలు తప్పుడు మ్యుటేషన్లను కలిగిస్తుంది. ► ఆర్ఎన్ఏ నిర్మాణంలో అడినైన్, గ్వానైన్, యురాసిల్ (యురిడిన్), సైటోసిన్ అవసరమవుతాయి. వీటిని ఆర్ఎన్ఏ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. ► మోల్న్యుపిరావిర్కు ఈ బిల్డింగ్ బ్లాక్స్‌లోని సైటిడిన్ (ఎన్‌హెచ్‌సీ– టీపీ) లేదా యురిడిన్ లాగా కనిపించే శక్తి ఉంది. దీంతో ఆర్‌డీఆర్‌ఏ ఎంజైమ్ దీన్ని వైరస్ ఆర్ఎన్ఏలో నిజమైన సైటిడిన్ లేదా యురిడిన్ బదులు ప్రవేశపెడుతుంది. ► వైరస్ రిప్లికేషన్‌ను ప్రూఫ్ రీడింగ్ చేసే ఎక్సో న్యూక్లియేజ్ ఎంజైమ్‌లు కూడా ఈ తప్పును గ్రహించలేవు. దీంతో నిజమైన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్న ఆర్ఎన్ఏ బదులు మోల్నుపిరావిర్ ఉన్న ఆర్ఎన్ఏ ఉత్పత్తి అవుతుంది. ► ఇలా మారిన ఆర్ఎన్ఏ పలు తప్పుడు ఉత్పరివర్తనాలకు కారణమై పైన చెప్పుకున్న ఎర్రర్ కెటాస్ట్రోఫ్కు దారి తీస్తుంది. ఆ పేరే ఎందుకంటే.. అవెంజర్స్ సినిమాలు చూసినవారికి అందులో థోర్ పాత్ర, ఆ హీరో చేతిలోని శక్తులున్న ఆయుధం.. సుత్తి గుర్తుండే ఉంటాయి. ఈ సుత్తికి మొల్నిర్ అని పేరు. అలాగే యాంటీ వైరల్ మందులకు చివర ‘అవిర్’ అంత్య ప్రత్యయం (సఫిక్స్) పెడతారు. కోవిడ్ వేరియంట్లపై థోర్ ఆయుధం లాగా విరుచుకుపడుతుందన్న ఉద్దేశంతో కొత్త మాత్రకు మోల్నుపిరావిర్ అని పేరు పెట్టినట్లు మెర్క్ కంపెనీ ఆర్ అండ్ డి అధిపతి డీన్ లీ చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
జన్యువు మొనపైనే మన ఆరోగ్యం..
మొట్టమొదటి మానవ జన్యురాశి 20 సంవత్సరాల అత్యద్భుతమైన శాస్త్రీయ పురోగతి ఫలితంగా సంభవించింది. ఇప్పుడు లభిస్తున్న అత్యంత భారీ స్థాయి జన్యు పరివర్తనల డేటా అనేది మానవుల్లోని అత్యంత సంక్లిష్టమైన వ్యాధులకు మూలాలను ఛేదించగలదని నేను కచ్చితంగా చెప్పగలను. ఆల్ ఆఫ్ అజ్ వంటి భారీ స్థాయి జనాభా అధ్యయనాలు, అతి పెద్ద డేటా ప్రాజెక్టులకు నిజంగానే ధన్యవాదాలు చెప్పాలి. వీటి ఫలితంగానే మన ఆరోగ్యాన్ని మన వ్యక్తిగత జన్యు క్రమం ఎలా తీర్చిదిద్దుతోందన్న చిరకాల చిక్కు ప్రశ్నకు పరిశోధకులకు సమాధానం లభిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. మానవ జన్యురాశికి సంబంధించిన మొట్టమొదటి ముసాయిదా 20 ఏళ్ల క్రితం అంటే 2001లో ప్రచురితమైంది. దాదాపుగా మూడేళ్ల సమయం తీసుకున్న మానవ జన్యురాశి క్రోడీకరణకు 500 మిలియన్ డాలర్ల ఖర్చయింది. చరిత్రలో తొలిసారిగా చేపట్టిన ఈ హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్టు మానవ ప్రాణిని జీవపరంగా నిర్వచించే 300 కోట్ల డీఎన్ఏ బేస్‌ల జతలను లేదా డీఎన్ఏ కోడ్ అక్షరాలను ఒక్కటొక్కటిగా అధ్యయన చేయడానికి శాస్త్రజ్ఞులను అనుమతించింది. ప్రస్తుతం నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో పోస్ట్ డాక్టొరల్ ఫెలోగా పనిచేస్తున్న నాలాంటి కొత్త తరం పరిశోధకులకు.. కేన్సర్ చికిత్సల కోసం కొత్త లక్ష్యాలను గుర్తించడానికి, మానవుల రోగనిరోధక వ్యవస్థలకు చెందిన విస్తృత ప్రయోజనాలను నిర్దేశించడానికి, ఈ హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్టు అనుమతిస్తోంది. అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్‌ని మీరు ఉపయోగిస్తున్న విధంగా మానవ జన్యురాశిని మొత్తంగా ఎవరైనా నిర్దేశించగలిగేలా ఒక వెబ్ పేజిని కూడా ఈ బృహత్ ప్రాజెక్టు రూపొందిస్తుంది. ఒక ఏక వ్యక్తికి సంబంధించినది కాకుండా, కొంతమంది వ్యక్తులకు ప్రాతినిధ్యం వహించే జన్యురాశి ప్రస్తావనను రూపొందించడానికి ప్రయత్నించేందుకోసం పేరు తెలీని కొద్దిమంది దాతల నుంచి మొట్టమొదటి సంపూర్ణ జన్యురాశిని ఉత్పాదించడం జరిగింది. అయితే ప్రపంచంలోని మానవ జనాభా వైవిధ్యతను ఒడిసిపట్టే ప్రక్రియలో ఇది చాలా పరిమితమైనది. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకలా ఉండరు. రెండు జన్యురాశిలు కూడా ఒకేలా ఉండవు. మానవజాతి సకల వైవిధ్యతలను అర్థం చేసుకోవాలని పరిశోధకులు కోరుకుంటే, దానికి కోటానుకోట్ల సంపూర్ణ జన్యురాశుల క్రమ పరంపర అవసరమవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టు ఒకటి నడుస్తోంది. ప్రజలలోని జీవ పరివర్తన సంపదే ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ విశిష్టమైనవారిగా మలుస్తోంది. అయితే జన్యుపరమైన మార్పులు అనేక అవ్యవస్థలకు లేదా వ్యాధులకు కారణమవుతుంటాయి. ఇతరుల కంటే కొంతమంది వ్యక్తుల బృందాలు నిర్దిష్ట వ్యాధులకు గురయ్యేందుకు ఇవి కారణమవుతాయి. మానవ జన్యురాశి క్రోడీకరణ ప్రాజెక్టు మొదలైన సమయంలో, పరిశోధకులు.. ఎలుకలు, తేనెటీగలు, మధుశిలీంద్రాలు, కొన్ని మొక్కల అంగనిర్మాణానికి సంబంధించిన సంపూర్ణ క్రమ జన్యురాశిని కూడా పరిశోధకులు అనుక్రమణం చేయగలిగారు. ఈ తొలి జన్యురాశిని ఉత్పత్తి చేయడానికి చేసిన భారీ ప్రయత్నం జన్యురాశి అధ్యయనానికి అవసరమైన టెక్నాలజీలో విప్లవానికి దారితీసింది. సంపూర్ణ మానవ జన్యురాశి వరుసక్రమాన్ని పేర్చేందుకు అనేక సంవత్సరాల సమయం తీసుకుని, వందలాది కోట్ల డాలర్ల ఖర్చు అయినప్పటికీ, ఈ సాంకేతిక ముందంజను మాత్రం అభినంచాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ పనికి కొన్ని రోజుల సమయం మాత్రమే సరిపోతుంది. పైగా దీనికి కొన్ని వేల డాలర్ల ఖర్చు మాత్రమే అవుతోంది. జన్యురాశి క్రమాన్ని పేర్చడం అనేది ‘నేను’ లేక ‘వారసత్వం’ వంటి జన్యు రూపాల సర్వీసులకు చాలా భిన్నమైంది. ఈ జన్యురూపాలనేవి ఒక వ్యక్తి జన్యురాశిలో అతి చిన్న స్థానాల్లోనే కనిపిస్తుంటాయి. సాంకేతికరంగంలో ముందంజలనేవి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వ్యక్తుల సంపూర్ణ జన్యురాశుల క్రమాన్ని పేర్చడానికి శాస్త్రజ్ఞులను అనుమతించాయి. జెనోమ్ అగ్రిగేషన్ కన్సోర్టియా వంటి సంస్థలు చెల్లాచెదరుగా ఉన్న డేటాను సేకరించి, ఆర్గనైజ్ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతవరకూ, ఈ గ్రూప్ సంస్థ మానవ జన్యురాసి వైవిధ్యతకు చెందిన అపారమైన సమాచారాన్ని ప్రదర్శించేటటువంటి దాదాపు 1,50,000 జన్యురాశులను సేకరించగలిగింది. ఈ సమూహంలోనే వ్యక్తుల జన్యురాశులలోని 24.1 కోట్ల వ్యత్యాసాలను పరిశోధకులు కనుగొన్నారు. ఈ జన్యురూపాలలో చాలావరకు అరుదైనవి, ఒక వ్యక్తిపై ఇవి ఏ ప్రభావాన్నీ చూపబోవు. అయితే, ఈ జన్యురూపాలలో దాగి ఉన్నవి అతి ముఖ్యమైన భౌతిక, వైద్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటున్నాయి. ఉదాహరణకు యాష్కెనాజి యూదులు వంటి కొన్ని బృందాలకు చెందిన మహిళలల్లోని బిఆర్సీఏ1 జన్యువు.. అండాశయ, బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమవుతోంది. ఈ జీన్స్ లోని ఇతర జన్యురూపాలు కొంతమంది నైజీరియన్ మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వల్ల సాధారణం కంటే మించి అధిక మరణాలకు దారి తీస్తున్నాయి. ఒక నియంత్రిత గ్రూప్‌తో, విస్తృత ప్రజా బృందాల జన్యురాశిలను పోల్చి చూసే జన్యుపరమైన అసోసియేషన్ ద్వారా జనాభాపరమైన జన్యురూపాల రకాలను పరిశోధకులు ఉత్తమంగా గుర్తించగలరు. అయితే వ్యాధులు చాలా సంక్లిష్టమైనవి. ఒక వ్యక్తి జీవన శైలి, లక్షణాలు, జీవన ప్రారంభం అనేవి చాలా వ్యత్యాసంతో ఉంటాయి. పైగా అనేక వ్యాధులపై జన్యుప్రభావాన్ని ప్రత్యేకంగా గుర్తించి వర్గీకరించడం చాలా కష్టమైన పని. ఈ ప్రభావాలలో చాలావాటిని వెలికితీయాలంటే ప్రస్తుత జన్యు పరిశోధనల ఉత్పాదక శక్తి చాలా తక్కువగా ఉంటోంది. ఎందుకంటే ఇప్పటికీ జన్యురాశికి చెందిన డేటా తగినంతగా లేకపోవడమే కారణం. సంక్లిష్ట వ్యాధుల జన్యుక్రమాన్ని, ప్రత్యేకించి వేరువేరు జాతుల, తెగలకు సంబంధించిన జన్యువ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి కావలసిన విస్తారమైన డేటా సమస్య ఎదురవుతోంది. పరిశోధకులకు ఇప్పుడు మరింత డేటా అవసరం. పది లక్షల జన్యురాశులు మరింత డేటా అవసరాన్ని అధిగమించడానికి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్.. మనందరమూ (ఆల్ ఆఫ్ అజ్) అనే ప్రోగ్రాంని ప్రారంభించింది. పదేళ్ల కాలంలో అమెరికాలోని పదిలక్షలమంది ప్రజలకంటే ఎక్కువమందిపై సర్వేలు, వారు ధరించిన దుస్తుల నుంచి సేకరించిన జన్యు సమాచారం, వైద్య రికార్డులు, ఆరోగ్య అలవాట్లు వంటి సమాచారాన్ని సేకరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే ఆరోగ్యపరమైన వ్యత్యాసాలను అధ్యయనం చేయడానికి వెలుగులోకి రాని మైనారిటీ గ్రూప్‌లనుంచి మరింత సమాచారాన్ని సేకరించాలని కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆల్ ఆఫ్ అజ్ ప్రాజెక్టును ప్రజా నమోదుకోసం 2018లో బహిరంగపర్చారు. నేటివరకు 2,70,000 మంది ప్రజలు తమ శాంపిల్స్ ఇచ్చి తోడ్పడ్డారు. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి భాగస్వాములను నియమించుకోవడాన్ని ఈ ప్రాజెక్టు కొనసాగిస్తోంది. అనేక అకడెమిక్ ప్రయోగశాలలు, ప్రైవేట్ కంపెనీలు ఈ ప్రయత్నంలో పాల్గొంటున్నాయి. ఈ మహా ప్రయత్నం వివిధ రంగాల శాస్త్రజ్ఞులకు లబ్ధి చేకూరుస్తుంది. ఉదాహరణకు, ఒక న్యూరో సైంటిస్టు మానసిక కుంగుబాటుతో ముడిపడి ఉన్న జన్యు రూపాలకోసం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించవచ్చు. కేన్సర్ నిపుణుడు జాతి నేపథ్యం ప్రభావాన్ని అన్వేషిస్తూనే చర్మ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల జన్యురూపాల కోసం ఈ ప్రాజెక్టులో శోధించవచ్చు. పది లక్షల జన్యురాశులు, వాటితో ముడిపడి ఉన్న వ్యక్తుల ఆరోగ్యం, జీవనశైలికి చెందిన సమాచారం అసాధారణమైన డేటా సంపదను అందిస్తుంది. ఇది వ్యక్తులలోనే కాకుండా, విభిన్న ప్రజా బృందాలలో ఉన్న వ్యాధులపై జన్యు రూపాల ప్రభావాన్ని కనుగొనడానికి పరిశోధకులకు చక్కగా అనుమతిస్తుంది. మానవ జన్యురాశిపై అగోచర విషయం ప్రస్తుతం అధ్యయనం చేయడానికి చాలా కష్టంగా ఉన్న మానవ జన్యురాసిలోని వివిధ భాగాలను తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు శాస్త్రజ్ఞులను అనుమతిస్తుంది. ఇంతవరకు జరిగిన జన్యు పరిశోధనలలో చాలావరకు ప్రొటీన్ల సంకేత నిర్మాణాన్ని వెలికితీసే జెనోమ్ భాగాలపైనే జరుగుతూ వచ్చాయి. కానీ ఇది మొత్తం మానవ జన్యురాశిలో 1.5 శాతానికి మాత్రమే వర్తిస్తుంది. నా పరిశోధన ప్రధానంగా ఆర్‌ఎన్‌ఎ పై దృష్టి సారించింది. ఇది వ్యక్తి డీఎన్ఏలో ఎన్కోడ్ చేసిన సందేశాలను ప్రొటీన్లుగా మారుస్తుంది. అయితే 98.5 శాతం మానవ జన్యురాశి నుంచి వస్తూ కూడా ప్రొటీన్లను రూపొందించలేని ఆర్ఎన్ఏలు తమకు తాముగా వేల సంఖ్యలో విధులను కలిగి ఉంటాయి. కోడ్ చేయని ఈ ఆర్ఎన్ఏలలో కొన్ని.. మహిళల్లో కేన్సర్‌ను వ్యాప్తి చేయడం, అండదశలో అభివృద్ధి చేయడం లేదా ఎక్స్ క్రోమోజోమ్ని నియంత్రించడం వంటి వాటిని ప్రాసెస్ చేయడంలో పాలుపంచుకుంటాయి. కోడ్ చేయని ఆర్ఎన్ఏలు తమ పనులు చేసుకునేలా అనుమతించే సంకటమైన మడతను జన్యు పరివర్తనను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై నా అధ్యయనం ప్రత్యేకించి కొనసాగుతుంది. ఆల్ ఆఫ్ అజ్ ప్రాజెక్టు మానవ జన్యురాశికి చెందిన కోడింగ్, నాన్ కోడింగ్ భాగాలన్నింటిని కలిగి ఉంటున్నందున, నా పనికి సంబంధించి అది ఒక అతిపెద్ద సముచితమైన డేటా బేస్‌గా ఉపయోగపడనుంది. పైగా ఇది ఈ మార్మికమైన ఆర్ఎన్ఏలపై సరికొత్త వెలుగును ప్రసరిస్తుందని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటి మానవ జన్యురాశి 20 సంవత్సరాల అత్యద్భుతమైన శాస్త్రీయ పురోగతి ఫలితంగా సంభవించింది. ఇప్పుడు లభిస్తున్న అత్యంత భారీ స్థాయి జన్యు పరివర్తనల డేటా అనేది మానవుల్లోని అత్యంత సంక్లిష్టమైన వ్యాధులకు మూలాలను ఛేదించగలదని నేను కచ్చితంగా చెప్పగలను. ఆల్ ఆఫ్ అజ్ వంటి భారీ స్థాయి జనాభా అధ్యయనాలు, అతి పెద్ద డేటా ప్రాజెక్టులకు నిజంగానే ధన్యవాదాలు చెప్పాలి. వీటి ఫలితంగానే మన ఆరోగ్యాన్ని మన వ్యక్తిగత జన్యుక్రమం ఎలా తీర్చిదిద్దుతోందన్న చిరకాల చిక్కు ప్రశ్నకు పరిశోధకులకు సమాధానం లభిస్తుందని నా విశ్వాసం. వ్యాసకర్త: జేవియర్ బోఫిల్ డి రాస్ రీసెర్చ్ ఫెలో, ఆర్ఎన్ఏ బయాలజీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, అమెరికా -
అంతా బాగున్నా..
వైరస్ జీర్ణ వ్యవస్థలోకి చేరే వరకు దాని లక్షణాలేవీ బయటపడవు. అంతా బాగుంది కదాని అనుకునేలోపు.. శరీరంలో వైరస్ ఆర్ఎన్ఏ హైజాక్ చేసిన కణాలతో రోగ నిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. అది.. సైటోకైన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. అవి.. వైరస్ బారినపడ్డ కణాలను గుర్తించి నాశనం చే యడం మొదలుపెడతాయి. దీంతో జ్వరం వస్తుంది. ఆహారం తీసుకుంటే వామిటింగ్ సెన్సేషనల్ కలుగుతుంది. గంటల వ్యవధి లో ఛాతీ పట్టేసిన అనుభూతి.. పొడి దగ్గు మొదలై ఎంతకీ ఆగదు. కరోనా వైరస్ బారినపడ్డ వారిలో 80 శాతం మంది తేలికపాటి జలుబు లక్షణాలే కలిగి ఉండటం, సుమారు 13 శాతం మందిలో లక్షణాల తీవ్రత ఎక్కు వగా, 5 శాతం మందిలో విషమంగా ఉన్నట్టు పరిశోధనలు బలపరుస్తున్నాయి. -
జన్యుపదార్థం హైజాక్...
వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ మన కణంలోని జన్యు పదార్థాన్ని హైజాక్ చేయడంతో సమస్య మొదలవుతుంది. శరీర వ్యవస్థ మానవ ప్రొటీన్లకు బదులుగా వైరస్ తాలూకు ప్రొటీన్లు తయారు చేయడం మొదలుపెడుతుంది. ఇది కాస్తా వైరస్ ఆర్ఎన్ఏల సంఖ్య పెరిగేందుకు కారణమవుతుంది. మరికొన్ని ఇతర వైరస్ ప్రొటీన్లు కణాలను నిర్వీ ర్యం చేస్తాయి. కణాలు శరీరానికి అవసరమైన పనులు కాకుండా.. వైరస్‌కు కావాల్సిన పనులు చేయడంలో బిజీ అయిపోతాయి. వైరస్ ఆర్ఎన్ఏ సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ అవి కణం బయటకు వచ్చేసి మరిన్ని కణాలను ఆక్రమించేస్తాయి. ఊపిరితిత్తులు, గొంతు, నోరు మొత్తం వైరస్‌లతో నిండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క రోజులో లక్షల రెట్లు పెరిగిపోయే వైరస్ రక్తం ద్వారా జీర్ణ వ్యవస్థలోకి చేరుతుంది. -
స్వైన్‌ఫ్లూ నిర్ధారణలో ఆర్ఎన్ఏ దోహదం
శ్రీకాకుళం : స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వ న్యూఢిల్లీ సౌజన్యంతో 'కెపాసిటీ బిల్డింగ్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ’ అనే అంశంపై 5 రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మూడో రోజు జీవ అణువు అయిన ఆర్ఎన్ఏను ఆధునిక పద్ధతి ద్వారా విద్యార్థులకు ప్రయోగాలు చేశారు. ఆధునిక సమాజంలో ఆహార ఉత్పత్తులు, క్యాన్సర్ వంటి వ్యాధులు నయం చేయడంలో యాంటీసెన్స్ ఆర్ఎన్ఏ సాంకేతిక శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కుళ్లని టమోటాలను ఉత్పత్తి చేయడంలో ఈ సాంకేతిక శాస్త్రం దోహదపడుతుందని తెలిపారు. ఆర్ఎన్ఏను వేరు చేయడం వల్ల మధుమేహాన్ని నయం చేసే ఇన్సులిన్‌ను తక్కువ ధరకే సరఫరా చేయడానికి సాధ్యపడిందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణలోనూ ఆర్ఎన్ఏ వేరుచేయడం ఉపయోగపడుతుందని జీవసాంకేతిక శాస్త్ర విభాగాధిపతి ఎం.ప్రదీప్, అధ్యాపకుడు డి.లక్షు్మనాయుడు తెలిపారు. కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.