Rock bands
-
మనోళ్లు కి'రాక్'
మ్యూజిక్ అంటే ఎగిరి గంతేయాల్సిందే.. పార్టీ, ఈవెంట్ ఏదైనా మ్యూజిక్ లేనిదే మజాయే లేదు. ఎప్పటికప్పుడు మనలో జోష్ నింపేందుకు అన్ని మెట్రో నగరాల్లో పలు రాక్ మ్యూజిక్ టీమ్‌లు ఉన్నాయి. మన నగరంలోనూ రాక్ బృందాల సందడి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఇవి తరచూ మంచి ప్రతిభ కనబరుస్తున్నా..జాతీయస్థాయిలో అదరగొట్టేవి అరుదే.. ఈ నేపథ్యంలో ఎనర్జీ డ్రింక్రెడ్బుల్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీలకు నగరానికి చెందిన ఓ రాక్ బ్యాండ్ ఎంపికై... సిటీ రాక్‌లో మరోసారి కేక పుట్టించింది. ఈ పోటీల్లో మనం గెలుపొందితే... నేషనల్ లెవల్లో హైదరాబాద్ రాక్ బృందం తళుక్మనడం ఖాయం. సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా రెడ్‌బుల్ స్పాట్లైట్ పేరిట నిర్వహిస్తున్న రాక్ కాంటెస్ట్‌లో విభిన్న నగరాలకు చెందిన బ్యాండ్స్ ఎంపికవుతాయి. అవన్నీ జాతీయస్థాయిలో పోటీపడతాయి. ముంబై, ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై, కోల్‌కతా, గౌహతి, గోవా, పుణె, హైదరాబాద్... ప్రస్తుత పోటీల్లో ఈ తొమ్మిది నగరాలకు చెందిన టీమ్స్ గెలుపొందాయి. ఓటింగ్ షురూ... ఈ తొమ్మిది మంది ఫైనలిస్ట్‌లలో ప్రతి విజేతా... తమ తమ నగరాల్లోని స్టూడియోల్లో ఒక పాట చొప్పున రికార్డు చేశారు. అలా రికార్డు చేసిన పాటల్ని ఆన్లైన్లో ఉంచారు. ప్రస్తుతం ఈ పాటలను రాక్ ప్రియులు వింటూ వారికి ఓటేస్తున్నారు. ఓటింగ్ పీరియడ్ ముగిశాక... న్యాయనిర్ణేతల బృందం పరిశీలించి అనంతరం ఎక్కువ ఓట్లు వచ్చిన బ్యాండ్‌ను ఎంపిక చేస్తారు. ఈ బృందంలో మ్యూజిక్ జర్నలిస్ట్‌లు అమిత్ గుర్బాక్సాని, ఓఎమ్ఎల్/ఎన్‌హెచ్–7 వీకెండర్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ దేబయాన్ దేబ్, అనురాగ్ టాగట్, ఆర్టిస్ట్ మేనేజర్ అనుఅన్నా జార్జ్, థింక్ ట్యాంక్ ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు నిఖిల్ ఉడుపా... తదితరులున్నారు. విజేతకు పూర్తిస్థాయిఆల్బమ్కు అవకాశం... తుది పోటీలో గెలిచిన టీమ్‌కు ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ రూపకల్పనకు అవకాశం ఇస్తారు. ప్రొఫెషనల్ స్టూడియోలో మొత్తం వ్యయమంతా సంస్థ భరించి ఈ ఆల్బమ్ రూపొందించి దేశవ్యాప్తంగా విడుదల చేస్తుంది. ‘రాక్’ కుర్రోళ్లు... వీరే... ఈ ఫైనలిస్ట్‌లలో నగరానికి చెందిన స్వోర్డ్ (సోల్ఫుల్లీ వర్షిపింగ్ అవర్ రీడీమర్ డైలీ) బ్యాండ్ టీమ్ కూడా ఉంది. గత మార్చి 25న బిట్స్పిలానీలో 13 బ్యాండ్ల మధ్య జరిగిన రాక్ యుద్ధంలో నగరం నుంచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది స్వోర్డ్. రెండేళ్ల క్రితం ఐదుగురు యువకుల బృందం ఓ వైవిధ్యభరితమైన బ్యాండ్‌కు రూపకల్పన చేయాలనుకుని సీనియర్ బ్యాండ్ రివైవల్ నుంచి పొందిన స్ఫూర్తితో స్వోర్డ్కు ప్రాణం పోశారు. ఇప్పటిదాకా చాలా వరకూ కవర్ బ్యాండ్ (ఇతరుల పాటల్ని మాత్రమే ప్లే చేసే మ్యూజిక్ బృందం)గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సొంతంగా రాసి, బాణీలు కట్టి పాడే దశలో ఉన్నారు. వీరు గత 2014లో జరిగిన సింటిల్లాషంజ్ బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ పోటీల్లో 2వ ప్రైజ్‌ను, బెస్ట్ కీబోర్డిస్ట్, బెస్ట్బేసిస్ట్ అవార్డ్‌లను సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్ పోటీల్లో గెలుపొందారు. ఈ బృందంలో రవితేజ, శామ్యూల్, నవీన్, రాజీవ్, నిశ్చల్ ఉన్నారు. ఓటేస్తే... మీటేస్తారు... ఇప్పటివరకూ జరిగిన ఓటింగ్‌లో... మన సిటీ రాక్ బృందం ముందంజలో ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో సంగీత ప్రియులు సహకరిస్తే... తమ గెలుపు సులువు అవుతుందని స్వోర్డ్ బృందం అంటోంది... మరి వీరి అభ్యర్థన ‘విందామా’? సిటీ రాక్ టీమ్‌ని గెలిపిద్దామా? ఓటేసేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశం ఉంది. ఓటేయాలనుకున్నవారు లాగిన్ కావాల్సిన చిరునామా.. www.redbull.in/spotlight , Facebook: www.facebook.com/redbull -
బాటిల్ ఆఫ్ బ్యాండ్స్..
నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్మాల్లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది. -
సాఫ్ట్ రాక్స్
సిటీకి రాక్ బ్యాండ్స్ కొత్త కాదు. తొలుత మ్యూజిక్ కంపెనీలకు, ఆడియో వ్యాపారం చేసేవారికి పరిమితమైన ఈ బ్యాండ్స్ నిదానంగా తమ పరిధిని విస్తరించుకున్నాయి. విభిన్న రంగాలకు చెందిన వారిని సైతం మమేకం చేసుకుంటూ కాలేజీ క్యాంపస్‌లలోనూ సందడి చేయడం మొదలు పెట్టాయి. అదే క్రమంలో లేటెస్ట్గా సాఫ్ట్వేర్ కంపెనీలను అల్లుకుపోతున్నాయి. రాక్ సరిగమల్లో వారికున్న పనితనాన్ని చూపిస్తూ.. పని ఒత్తిడికి చెక్ పెడుతున్నారు టెకీలు. ఊపే.. ఊరట.. ‘రాక్ మ్యూజిక్‌లో ‘ఊపు’ ఎక్కువ. ఉద్యోగరీత్యా శారీరక శ్రమ తక్కువుండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాక్ అంటే ‘షేక్’ అయిపోవడానికి కారణం అదే’ అంటున్నారు స్లెడ్జ్ బ్యాండ్ నిర్వాహకులు అంజానీ. పబ్స్, కేఫ్‌లలో నిర్వహించే రాక్ బ్యాండ్ ప్రదర్శనలకు క్యూ కట్టే వారిలో ఐటీ ఉద్యోగులే ముందుంటారనేది నగర మెరిగిన సత్యమే. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల్లో నిర్వహించే పలు ఈవెంట్లలో కూడా దేశ విదేశాలకు చెందిన బ్యాండ్లు వెల్లువెత్తడమూ సిటీకి అనుభ వమే. అయితే సాక్షాత్తూ ఐటీ సిబ్బందే రాక్ బృందాలుగా మారడం మాత్రం ఇటీవలే మొదలైంది. ‘కంపెనీలలో నిర్వహించే రకరకాల ఈవెంట్ల సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ వెలుగు చూస్తోంది. గాయకులు, రచయితలు, గిటారిస్ట్‌లు.. తమలోనూ ఉన్నారని ఈ కంప్యూటర్ యోధులు నిరూపించుకుంటున్నారు. వీళ్లంతా కలిసి ఒక బృందంగా ఏర్పడాలనే ఆలోచనకు రూపమే రాక్ బ్యాండ్’ అని సాఫ్ట్‌టెక్ కంపెనీకి చెందిన చారు చెప్పారు. మేం ఇద్దరం... మాకిద్దరు... ఇదేదో ఫ్యామిలీ ప్లానింగ్ స్లోగన్ అనుకోవద్దు. రాక్ బ్యాండ్ ప్లానింగ్ తీస్తున్న రాగం. తొలుత ఇద్దరిలో పుడుతున్న ఆలోచనే మరో ఇద్దరిని చేర్చుకుని పూర్తిస్థాయి బ్యాండ్‌గా మారుతోంది. ‘బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం నలుగురు సభ్యులు తప్పనిసరి’ అని అల్టర్ ఇగోజ్ బ్యాండ్ సృష్టికర్త విజయ్ చెప్పారు. తదనంతరం మరో ఇద్దరు, ముగ్గురు చేరినా పర్లేదు. ‘మా కంపెనీలో ఇన్‌హౌస్ ఈవెంట్ సందర్భంగా ప్రదీప్ దామోదరం, అజయ్‌లు మంచి గిటారిస్ట్లని అర్థమైంది. ఆకృతి కొమ్ముల, భూదేవ్ కాకటిలు మంచి సింగర్స్ అని తెలిసింది. అప్పుడే బ్యాండ్ ఫార్మేషన్ ఐడియా వచ్చింది’ అని ఫ్యాక్ట్‌సెట్ రాక్ బ్యాండ్ బృంద సభ్యులు వివరించారు. డ్రమ్స్లో ప్రావీణ్యం ఉన్న నితిన్ సూత్రావె వీరికి జత కలవడంతో ఇక బృందానికి ఫుల్ షేప్ వచ్చేసింది. ‘లాస్ట్ టైమ్ కంపెనీ ఆన్యువల్ ఈవెంట్లో మా బ్యాండ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి సూపర్బ్ అప్లాజ్ వచ్చింది’ అంటూ వికాస్ ఆనందం వ్యక్తం చేశాడు. గిటారిస్ట్‌గా ఈ జట్టులో చేరిన వికాస్.. పని విరామ సమయంలో తాము సాధన చేస్తామని చెప్పాడు. ప్రస్తుతం సిటీలో ఉన్న డెలాయిట్, కాగ్నిజెంట్, వెల్స్ఫ్రాగో వంటి పలు కంపెనీల ఉద్యోగులు కూడా రాక్ బ్యాండ్స్‌కు రూపుకట్టారు. కంపెనీకి నేమ్.. ఎంప్లాయీకి ఫేమ్.. ఉభయ కుశలోపరి కావడంతో ఈ రాక్ బ్యాండ్స్‌ను కంపెనీ యాజమాన్యాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. సిటీలో ఇతర రాక్ బ్యాండ్స్లాగే కంపెనీ ఉద్యోగులు ఏర్పాటు చేస్తున్న బ్యాండ్స్‌కు ప్రత్యేకంగా పేర్లున్నా, ఎక్కువగా కంపెనీల పేర్లతోనే ఇవి నడుస్తున్నాయి. డెల్లాయిట్ ఉద్యోగులు ‘డి-స్ట్రింగ్స్’ పేరుతో, ఫ్యాక్ట్‌సెట్ స్టాఫ్ ‘సంయుక్త్’ పేరుతో బ్యాండ్స్ నిర్వహిస్తున్నారు. అయితే వీటిని డెల్లాయిట్ బ్యాండ్, ఫ్యాక్ట్‌సెట్ బ్యాండ్ అనే వ్యవహరిస్తున్నారు. కంపెనీల అంతర్గతంగా, ఇతర కంపెనీల మధ్య కూడా రాక్ గమకాల సమరాలు సాగుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన బ్యాండ్స్ ఇన్ హౌస్ లేదా కంపెనీల ఆధ్వర్యంలోని కార్యక్రమాలకే ఎక్కువగా పరిమితం అవుతున్నాయి. టాలెంట్‌ను పెంచుకుంటూ.. వినోదం పంచే మరిన్ని రాక్ బ్యాండ్స్ టెకీల సారథ్యంలో రానున్నాయి. సో... గెట్ రెడీ టు రాక్... -
రాక్ స్క్రిప్ట్
మనకు రాక్ బ్యాండ్స్ కొత్త కాదు. టీనేజ్ స్పీడ్‌తో రాక్ గ్రూప్‌ను తయారు చేసుకోవడం, ఉద్యోగంతోనో.. బిజినెస్‌తోనో కెరీర్ ముడిపడ్డాక బ్యాండ్‌కు శుభం కార్డు వేయడం సిటీలోని మ్యూజిక్ లవర్స్‌కు తెలిసిన రాక్ బృందాల రాత. అయితే దీన్ని తిరగరాస్తోంది ‘స్క్రిప్ట్’. ఎనిమిదేళ్లుగా అంతకంతకూ పుంజుకుంటున్న ఈ రాక్ టీమ్.. త్వరలోనే రెండో ఆల్బమ్ విడుదలకు సిద్ధమవుతోంది. సిటీలో ఏళ్ల తరబడి ఒక బ్యాండ్ బజాయించడం విశేషమే. ‘మాది థ్రాష్ మెటల్ బ్యాండ్’ అని చెప్పాడు అబ్బాస్ రజ్వీ. థ్రాష్ మెటల్‌ను మెలొడీస్‌తో మేళవించిన ఒక వైవిధ్యభరిత సంగీత సంరంభమే తమ బృంద విశిష్టత. ఎనిమిదేళ్ల క్రితం తనతో పాటుగా రాజీవ్ (డ్రమ్స్), అఖిల్ (ఎక్స్-గిటారిస్ట్), రమ్య (ఎక్స్-గిటారిస్ట్), సినిక్(వోకలిస్ట్)లు కలసి రూపకల్పన చేసిన ‘స్క్రిప్ట్’ ఇప్పుడు దేశవ్యాప్తంగా మ్యూజిక్ మస్తీ చేస్తోంది. ‘నిజానికి మేం ఎంటరైన టైమ్‌లో మెటల్ స్టైల్ ఆల్మోస్ట్ డెత్ స్టేజ్‌లో ఉంది. అయితే కొన్ని మార్పు చేర్పులతో మేం తిరిగి దానికి సిటీలో లైఫ్ ఇచ్చాం’ అని అంటారు అబ్బాస్. తొలిదశలో పాంటెరా, డెత్ వంటి బ్యాండ్స్‌కు చెందిన ఆల్బమ్స్‌ను ప్లే చేసిన స్క్రిప్ట్.. ఆ తర్వాత తమకంటూ స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకుంది. 2010లో ఫస్ట్ సీడీ.. సిటీలో తమ బ్యాండ్‌కి ఒక క్రేజ్ ఏర్పడిన తర్వాత దాన్ని కంట్రీవైజ్గా తీసుకెళ్లడానికి ఈ బ్యాండ్ నాలుగేళ్ల కిందట ఫస్ట్ సీడీ రిలీజ్ చేసింది. ‘డిస్కార్డ్’ పేరుతో రిలీజ్ చేసిన ఈ సీడీకి మ్యూజిక్ సర్కిల్లో మంచి పేరు రావడంతో.. స్క్రిప్ట్ బ్యాండ్ వెనుదిరిగి చూసుకోలేదు. డిస్కార్డ్ టూర్ పేరుతో ఈ బ్యాండ్ జంటనగరాల్లోనూ ముంబైని చుట్టేసింది. దుబాయ్‌లో ‘ప్రీచింగ్ వెనమ్ టూర్’, నార్వేలో పబ్ రాక్ ఫెస్ట్, చెన్నైలో మెటలై జ్డ్ ఫెస్ట్, పుణేలో మెటాక్లిస్మ్, ఫ్రాన్స్‌లో డెక్కన్ రాక్, ఢిల్లీలోని డబ్ల్యూఆర్ఎమ్ఈ ఫెస్టివల్.. ఇలా దేశవిదేశాల్లో షోస్ నిర్వహిస్తూ హైదరాబాద్ రాక్‌కు ఓ ఐడెంటిటీని తీసుకొస్తోంది. రాక్సీన్కు ఫ్యూచర్ సూపర్బ్.. ఓ ఫైనాన్షియల్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి రాక్ సీన్లో డ్రమ్స్ మోగిస్తున్న సుజుకి నాయుడు, డెల్లో జాబ్లకు గుడ్‌బై చెప్పి గిటారిస్ట్స్గా మారిన కూకట్పల్లి వాసి రవి, సైనిక్‌పురి నివాసి జోయెల్, ముంబైలో ఉంటూ షోస్ ఉన్నప్పుడు మాత్రం గొంతు సవరించుకునే టీసీఈ ఉద్యోగి సినిక్, బేస్ గిటారిస్ట్, సౌండ్ ఇంజనీర్‌గా వ్యవహరించే అబ్బాస్ రజ్వీలు స్క్రిప్ట్ వేదికగా సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు సిటీలో రాక్ బ్యాండ్స్ పెర్ఫార్మెన్స్కు సరైన వేదిక ఉండేది కాదని, ఇప్పుడు కేవలం రాక్ ప్రదర్శనల కోసమే ‘హార్డ్ రాక్ కేఫ్’, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బార్, కెఫె డే లెట్టె వంటివి ఏర్పాటవడం, దాదాపు ప్రతి రెస్టారెంట్, క్లబ్‌లలో రాక్ మ్యూజిక్ కంపల్సరీగా మారడం సిటీ రాక్‌కు ఇస్తున్న ఇంపార్టెన్స్‌కు నిదర్శనమంటోందీ టీమ్. ఈ ఏడాది చివర్లో తమ రెండో ఆల్బమ్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ఈ రాక్ గ్రూప్‌కి ఆల్ ద బెస్ట్. - ఎస్.సత్యబాబు