మ్యూజిక్ అంటే ఎగిరి గంతేయాల్సిందే.. పార్టీ, ఈవెంట్ ఏదైనా మ్యూజిక్ లేనిదే మజాయే లేదు. ఎప్పటికప్పుడు మనలో జోష్ నింపేందుకు అన్ని మెట్రో నగరాల్లో పలు రాక్ మ్యూజిక్ టీమ్‌లు ఉన్నాయి. మన నగరంలోనూ రాక్ బృందాల సందడి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఇవి తరచూ మంచి ప్రతిభ కనబరుస్తున్నా..జాతీయస్థాయిలో అదరగొట్టేవి అరుదే.. ఈ నేపథ్యంలో ఎనర్జీ డ్రింక్‌రెడ్‌బుల్ నిర్వహిస్తున్న జాతీయస్థాయి పోటీలకు నగరానికి చెందిన ఓ రాక్ బ్యాండ్ ఎంపికై... సిటీ రాక్‌లో మరోసారి కేక పుట్టించింది. ఈ పోటీల్లో మనం గెలుపొందితే... నేషనల్ లెవల్లో హైదరాబాద్ రాక్ బృందం తళుక్‌మనడం ఖాయం.
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా రెడ్‌బుల్ స్పాట్‌లైట్ పేరిట నిర్వహిస్తున్న రాక్ కాంటెస్ట్‌లో విభిన్న నగరాలకు చెందిన బ్యాండ్స్ ఎంపికవుతాయి. అవన్నీ జాతీయస్థాయిలో పోటీపడతాయి. ముంబై, ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై, కోల్‌కతా, గౌహతి, గోవా, పుణె, హైదరాబాద్... ప్రస్తుత పోటీల్లో ఈ తొమ్మిది నగరాలకు చెందిన టీమ్స్ గెలుపొందాయి.
ఓటింగ్ షురూ...
ఈ తొమ్మిది మంది ఫైనలిస్ట్‌లలో ప్రతి విజేతా... తమ తమ నగరాల్లోని స్టూడియోల్లో ఒక పాట చొప్పున రికార్డు చేశారు. అలా రికార్డు చేసిన పాటల్ని ఆన్‌లైన్‌లో ఉంచారు. ప్రస్తుతం ఈ పాటలను రాక్ ప్రియులు వింటూ వారికి ఓటేస్తున్నారు. ఓటింగ్ పీరియడ్ ముగిశాక... న్యాయనిర్ణేతల బృందం పరిశీలించి అనంతరం ఎక్కువ ఓట్లు వచ్చిన బ్యాండ్‌ను ఎంపిక చేస్తారు. ఈ బృందంలో మ్యూజిక్ జర్నలిస్ట్‌లు అమిత్ గుర్బాక్సాని, ఓఎమ్‌ఎల్/ఎన్‌హెచ్–7 వీకెండర్ హెడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ దేబయాన్ దేబ్, అనురాగ్ టాగట్, ఆర్టిస్ట్ మేనేజర్ అనుఅన్నా జార్జ్, థింక్ ట్యాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వాహకులు నిఖిల్ ఉడుపా... తదితరులున్నారు.
విజేతకు పూర్తిస్థాయిఆల్బమ్‌కు అవకాశం...
తుది పోటీలో గెలిచిన టీమ్‌కు ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ రూపకల్పనకు అవకాశం ఇస్తారు. ప్రొఫెషనల్ స్టూడియోలో మొత్తం వ్యయమంతా సంస్థ భరించి ఈ ఆల్బమ్ రూపొందించి దేశవ్యాప్తంగా విడుదల చేస్తుంది.
‘రాక్’ కుర్రోళ్లు... వీరే...
ఈ ఫైనలిస్ట్‌లలో నగరానికి చెందిన స్వోర్డ్ (సోల్‌ఫుల్లీ వర్షిపింగ్ అవర్ రీడీమర్ డైలీ) బ్యాండ్ టీమ్ కూడా ఉంది. గత మార్చి 25న బిట్స్‌పిలానీలో 13 బ్యాండ్‌ల మధ్య జరిగిన రాక్ యుద్ధంలో నగరం నుంచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది స్వోర్డ్. రెండేళ్ల క్రితం ఐదుగురు యువకుల బృందం ఓ వైవిధ్యభరితమైన బ్యాండ్‌కు రూపకల్పన చేయాలనుకుని సీనియర్ బ్యాండ్ రివైవల్ నుంచి పొందిన స్ఫూర్తితో స్వోర్డ్‌కు ప్రాణం పోశారు. ఇప్పటిదాకా చాలా వరకూ కవర్ బ్యాండ్ (ఇతరుల పాటల్ని మాత్రమే ప్లే చేసే మ్యూజిక్ బృందం)గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం సొంతంగా రాసి, బాణీలు కట్టి పాడే దశలో ఉన్నారు. వీరు గత 2014లో జరిగిన సింటిల్లాషంజ్ బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ పోటీల్లో 2వ ప్రైజ్‌ను, బెస్ట్ కీబోర్డిస్ట్, బెస్ట్‌బేసిస్ట్ అవార్డ్‌లను సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్ పోటీల్లో గెలుపొందారు. ఈ బృందంలో రవితేజ, శామ్యూల్, నవీన్, రాజీవ్, నిశ్చల్ ఉన్నారు.
ఓటేస్తే... మీటేస్తారు...
ఇప్పటివరకూ జరిగిన ఓటింగ్‌లో... మన సిటీ రాక్ బృందం ముందంజలో ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో సంగీత ప్రియులు సహకరిస్తే... తమ గెలుపు సులువు అవుతుందని స్వోర్డ్ బృందం అంటోంది... మరి వీరి అభ్యర్థన ‘విందామా’? సిటీ రాక్ టీమ్‌ని గెలిపిద్దామా? ఓటేసేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశం ఉంది.
ఓటేయాలనుకున్నవారు లాగిన్ కావాల్సిన చిరునామా.. www.redbull.in/spotlight , Facebook: www.facebook.com/redbull
Comments
Please login to add a commentAdd a comment