సాఫ్ట్ రాక్స్ | soft rocks | Sakshi
Sakshi News home page

సాఫ్ట్ రాక్స్

Published Wed, Jan 21 2015 11:19 PM | Last Updated on Mon, Oct 22 2018 7:57 PM

సాఫ్ట్ రాక్స్ - Sakshi

సాఫ్ట్ రాక్స్

సిటీకి రాక్ బ్యాండ్స్ కొత్త కాదు. తొలుత మ్యూజిక్ కంపెనీలకు, ఆడియో వ్యాపారం చేసేవారికి పరిమితమైన ఈ బ్యాండ్స్ నిదానంగా తమ పరిధిని విస్తరించుకున్నాయి. విభిన్న రంగాలకు చెందిన వారిని సైతం మమేకం చేసుకుంటూ కాలేజీ క్యాంపస్‌లలోనూ సందడి చేయడం మొదలు పెట్టాయి. అదే క్రమంలో లేటెస్ట్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీలను అల్లుకుపోతున్నాయి. రాక్ సరిగమల్లో వారికున్న పనితనాన్ని చూపిస్తూ.. పని ఒత్తిడికి చెక్
పెడుతున్నారు టెకీలు.
 
ఊపే.. ఊరట..
‘రాక్ మ్యూజిక్‌లో ‘ఊపు’ ఎక్కువ. ఉద్యోగరీత్యా శారీరక శ్రమ తక్కువుండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాక్ అంటే ‘షేక్’ అయిపోవడానికి కారణం అదే’ అంటున్నారు స్లెడ్జ్ బ్యాండ్ నిర్వాహకులు అంజానీ.  పబ్స్, కేఫ్‌లలో నిర్వహించే రాక్ బ్యాండ్ ప్రదర్శనలకు క్యూ కట్టే వారిలో ఐటీ ఉద్యోగులే ముందుంటారనేది నగర మెరిగిన సత్యమే.

అలాగే సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో నిర్వహించే పలు ఈవెంట్లలో కూడా దేశ విదేశాలకు చెందిన బ్యాండ్‌లు వెల్లువెత్తడమూ సిటీకి అనుభ వమే. అయితే సాక్షాత్తూ ఐటీ సిబ్బందే రాక్ బృందాలుగా మారడం మాత్రం ఇటీవలే మొదలైంది. ‘కంపెనీలలో నిర్వహించే రకరకాల ఈవెంట్ల సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ వెలుగు చూస్తోంది. గాయకులు, రచయితలు,
 
గిటారిస్ట్‌లు.. తమలోనూ ఉన్నారని ఈ కంప్యూటర్ యోధులు నిరూపించుకుంటున్నారు. వీళ్లంతా కలిసి ఒక బృందంగా ఏర్పడాలనే ఆలోచనకు రూపమే రాక్ బ్యాండ్’ అని సాఫ్ట్‌టెక్ కంపెనీకి చెందిన చారు చెప్పారు.
 
మేం ఇద్దరం... మాకిద్దరు...
ఇదేదో ఫ్యామిలీ ప్లానింగ్ స్లోగన్ అనుకోవద్దు. రాక్ బ్యాండ్ ప్లానింగ్ తీస్తున్న రాగం. తొలుత ఇద్దరిలో పుడుతున్న ఆలోచనే మరో ఇద్దరిని చేర్చుకుని పూర్తిస్థాయి బ్యాండ్‌గా మారుతోంది. ‘బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం నలుగురు సభ్యులు తప్పనిసరి’ అని అల్టర్ ఇగోజ్ బ్యాండ్ సృష్టికర్త విజయ్ చెప్పారు. తదనంతరం మరో ఇద్దరు, ముగ్గురు చేరినా పర్లేదు. ‘మా కంపెనీలో ఇన్‌హౌస్ ఈవెంట్ సందర్భంగా ప్రదీప్ దామోదరం, అజయ్‌లు మంచి గిటారిస్ట్‌లని అర్థమైంది.

ఆకృతి కొమ్ముల, భూదేవ్ కాకటిలు మంచి సింగర్స్ అని తెలిసింది. అప్పుడే బ్యాండ్ ఫార్మేషన్ ఐడియా వచ్చింది’ అని ఫ్యాక్ట్‌సెట్ రాక్ బ్యాండ్ బృంద సభ్యులు వివరించారు. డ్రమ్స్‌లో ప్రావీణ్యం ఉన్న నితిన్ సూత్రావె వీరికి జత కలవడంతో ఇక బృందానికి ఫుల్ షేప్ వచ్చేసింది. ‘లాస్ట్ టైమ్ కంపెనీ ఆన్యువల్ ఈవెంట్లో మా బ్యాండ్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌కి సూపర్బ్ అప్లాజ్ వచ్చింది’ అంటూ వికాస్ ఆనందం వ్యక్తం చేశాడు. గిటారిస్ట్‌గా ఈ జట్టులో చేరిన వికాస్.. పని విరామ సమయంలో తాము సాధన చేస్తామని చెప్పాడు. ప్రస్తుతం సిటీలో ఉన్న డెలాయిట్, కాగ్నిజెంట్, వెల్స్‌ఫ్రాగో వంటి పలు కంపెనీల ఉద్యోగులు కూడా రాక్ బ్యాండ్స్‌కు రూపుకట్టారు.
 
కంపెనీకి నేమ్.. ఎంప్లాయీకి ఫేమ్..
ఉభయ కుశలోపరి కావడంతో ఈ రాక్ బ్యాండ్స్‌ను కంపెనీ యాజమాన్యాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. సిటీలో ఇతర రాక్ బ్యాండ్స్‌లాగే కంపెనీ ఉద్యోగులు ఏర్పాటు చేస్తున్న బ్యాండ్స్‌కు ప్రత్యేకంగా పేర్లున్నా, ఎక్కువగా కంపెనీల పేర్లతోనే ఇవి నడుస్తున్నాయి. డెల్లాయిట్ ఉద్యోగులు ‘డి-స్ట్రింగ్స్’ పేరుతో, ఫ్యాక్ట్‌సెట్ స్టాఫ్ ‘సంయుక్త్’ పేరుతో బ్యాండ్స్ నిర్వహిస్తున్నారు.

అయితే వీటిని డెల్లాయిట్ బ్యాండ్, ఫ్యాక్ట్‌సెట్ బ్యాండ్ అనే వ్యవహరిస్తున్నారు. కంపెనీల అంతర్గతంగా, ఇతర కంపెనీల మధ్య కూడా రాక్ గమకాల సమరాలు సాగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చెందిన బ్యాండ్స్ ఇన్ హౌస్ లేదా కంపెనీల ఆధ్వర్యంలోని కార్యక్రమాలకే  ఎక్కువగా పరిమితం అవుతున్నాయి.  టాలెంట్‌ను పెంచుకుంటూ.. వినోదం పంచే మరిన్ని రాక్ బ్యాండ్స్ టెకీల సారథ్యంలో రానున్నాయి. సో... గెట్ రెడీ టు రాక్...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement