సరైన సమయమనేది ఉండదు!
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అత్యుత్తమమని మ్యూచువల్ ఫండ్ దిగ్గజం డీఎస్పీ బ్లాక్‌రాక్ వైస్ ప్రెసిడెంట్ (ఇన్వెస్ట్మెంట్స్) రోహిత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులకు సరైన సమయమంటూ ఏదీ ఉండదని, ఒకవేళ ఉన్నా అది ఏ నిపుణుడికీ తెలియదని స్పష్టంగా చెప్పారు. ఇన్ఫ్రా రంగాన్ని తీసుకుంటే స్వల్పకాలిక దృష్టితో కాకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికనే ఇన్వెస్ట్ చేయాలని స్పష్టంచేశారు. బ్యాంకులన్నీ తమ ఎన్పీఏలను ప్రక్షాళన చేస్తున్నాయి కనక బ్యాంకింగ్ రంగం మున్ముందు ఆశావహంగా ఉంటుందని తెలియజేశారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోహిత్ సింఘానియా పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ...
డీఎస్పీ బ్లాక్‌రాక్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ సింఘానియా
≈ మార్కెట్లలో పెట్టుబడికి సిప్ విధానమే బెస్ట్
≈ దీర్ఘకాలిక దృష్టితోనైతే ఇన్ఫ్రాలో పెట్టొచ్చు
≈ బ్యాంకింగ్‌పై ఇన్వెస్టర్లు ఆశావ హంగా ఉన్నారు
≈ సిమెంటు, ప్లాస్టిక్స్, సిరామిక్ రంగాలూ మంచివే
≈ ఫండ్స్‌పై జీఎస్టీ ప్రతికూల ప్రభావం ఉండదు
ఈ మధ్య మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు రికార్డు స్థాయికి పెరిగాయి. కారణమేంటి?
గతంలో లెక్కల్లో కనిపించని డబ్బు పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్‌లోకి ప్రవహించేది. కానీ కొన్నాళ్లుగా రియల్టీ రంగం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. దీంతో అందులో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు అంతగా ఇష్టపడటం లేదు. మరోవంక బంగారమూ తగ్గింది. దీంతో దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులిచ్చే సాధనాల్లో ఇన్వెస్టర్లకు ఈక్విటీలు మాత్రమే మిగిలాయి. గతంలో వంద రూపాయల్లో అరవై రూపాయలు రియల్ ఎస్టేట్‌లోకి, ఇరవై ఈక్విటీ.. ఇరవై పసిడిలోకి పెట్టుబడులుగా వెళ్లగా.. ప్రస్తుతం ఈక్విటీ ల వాటా ఎనభైకి పెరిగింది. ఇక రియల్టీలో పెట్టుబడులకు సంబంధించి ఓ ఇల్లు కొనాలంటే కనీసం ముప్ఫై, నలభై లక్షలు పెట్టాలి. కానీ ఫండ్స్‌లో 500, రూ.1,000 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతోంది కనకే నిధులు వస్తున్నాయి. ఇన్వెస్టర్ల సంఖ్య, అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లలో (సిప్) పెట్టుబడులు పెరుగుతున్నాయి.
ఇన్ఫ్రా రంగం బాగా దెబ్బతింది కదా? ఎప్పుడు కోలుకుంటుంది? దీన్లో పెట్టుబడి పెట్టొచ్చా?
పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నప్పుడు బాగా లేని కంపెనీలు కూడా బ్రహ్మాండంగా ఉన్నట్లు అనిపిస్తాయి. అలాగే పరిస్థితులు బాగాలేనపుడు మంచి కంపెనీలు కూడా చెడ్డ కంపెనీలుగా కనిపించొచ్చు. కాబట్టి సరైన సంస్థను ఎంచుకోవడంలోనే ఉంటుందంతా. బ్యాలెన్స్ షీట్, కంపెనీ పనితీరు, మేనేజ్మెంట్ మొదలైనవన్నీ చూశాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇన్ఫ్రాలో ఒకటి రెండు సంస్థల పరిస్థితి సరిగ్గా లేనంత మాత్రాన మొత్తం మౌలిక రంగం అంతా కూడా బాగాలేదనటానికి వీల్లేదు. ఇన్ఫ్రాలో పెట్టే పెట్టుబడులు మూణ్నెల్లు, ఆర్నెల్లలో రాబడులివ్వాలంటే అసాధ్యం. కనీసం రెండు మూడేళ్ల వ్యవధైనా ఉండాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మా ఫండ్‌లోకి గణనీయంగానే నిధులొచ్చాయి. భారత్ వృద్ధికి ఇన్ఫ్రా ఎదగడం కీలకమని గుర్తించడం మొదలుపెట్టారు. సానుకూల విషయమేమిటంటే.. పెట్టుబడులు తరలివెళ్లిపోవడం ఆగింది.
మరి బ్యాంకింగ్ షేర్లు ఎలా ఉన్నాయి? ఈ మధ్య ప్రభుత్వ బ్యాంకులూ పెరిగాయి కదా?
గత రెండు మూడేళ్లుగా ఏం జరుగుతోందో ఒకసారి సమీక్షించుకోవాలి. మొండిబకాయిలకు సంబంధించి గతంతో పోలిస్తే ఇపుడెలా ఉంది? పరిస్థితులేమైనా మెరుగుపడ్డాయా? భవిష్యత్‌లో మరింతగా తగ్గే అవకాశాలున్నాయా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఎన్పీఏలు వేల కోట్ల నుంచి వందల కోట్లలోకి తగ్గుతున్నాయా లేక లక్షల కోట్లలోకి వెడుతున్నాయా అన్నది కూడా చూడాలి. మొండి బకాయిలు అధికంగా ఉన్న రంగాలు కూడా మెరుగుపడటం మొదలుపెడితే ఎకానమీ వృద్ధి చాలా బాగుంటుంది. క్రమంగా మొండిబకాయిల భారం కూడా తగ్గడం మొదలవుతుంది. తద్వారా బ్యాంకింగ్ రంగం సైతం మెరుగుపడగలదు. ఎకానమీకి బ్యాంకింగ్ అనేది వెన్నెముక. ఇది బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఈ ధోరణితోనే బ్యాంకింగ్‌పై మార్కెట్ వర్గాలు ఆశావహ ధోరణి కనపరుస్తున్నాయి.
ఇతర రంగాల్లో ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలంగా ఉన్నవేంటి? ఇపుడు ఏవైతే బెటర్?
సిమెంటు, సెరామిక్, ప్లాస్టిక్స్ ఉత్పత్తి తదితర తయారీ రంగ కంపెనీలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. అలాగే గ్యాస్ ధరలు తగ్గుతుండటం, ప్రజల ఇంధన వినియోగ ధోరణులు మారుతుండటం వంటి పరిణామాల దరిమిలా ఆయిల్ అండ్ గ్యాస్, గ్యాస్ పైప్‌లైన్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక వినియోగదారుల అభిరుచులపై ఆధారపడి ఉన్న ఆటోమొబైల్స్ తదితర రంగాలను కూడా పరిశీలించవచ్చు.
జీఎస్టీ ప్రభావంతో ఫండ్స్ మరింత ఖరీదవుతాయా?
సేవా పన్ను విధించే రంగాలన్నింటిపైనా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) ప్రభావం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌పై మాత్రమే కాదు. ఈక్విటీల్లో కూడా ఎంతో కొంత రాబడి రావాలనే ఇన్వెస్ట్ చేస్తాం. పన్నులు, చార్జీల వంటి వాటి గురించి సందేహిస్తూ పెట్టుబడులను మానేస్తారని నేనైతే అనుకోవటం లేదు. కాబట్టి జీఎస్టీ అమల్లోకి వచ్చినా ఫండ్స్‌లో పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావమేమీ ఉండకపోవచ్చు.
మార్కెట్లలో సంస్కరణలు తెస్తున్నారు. ఫెడ్ రేట్లపై ఇంకా అనిశ్చితే ఉంది? ఆర్బీఐకి కొత్త గవర్నరొచ్చారు. ఇవన్నీ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు?
స్థూలంగా చూస్తే సంస్కరణలనేవి ఎకానమీ వృద్ధికి సానుకూలమే. అయితే, ఏవైనా సరే రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవు. దేనికైనా కాస్త సమయం పడుతుంది. జీఎస్టీ అనేది కొన్ని రంగాలకు సానుకూలం కావొచ్చు.. మరికొన్నింటికి ప్రతికూలం కావొ చ్చు. కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. పారదర్శకత పెరుగుతోంది. వ్యవస్థాగతంగా ఇవి సానుకూలాంశాలే. ఇక మార్కెట్లు సాధారణంగానే వివిధ పరిణామాలపై స్పందిస్తుంటాయి. బ్రెగ్జిట్ అనంతరం ఏం జరిగిందో చూశాం. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు, లిక్విడిటీ మొదలైనవన్నీ పటిష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, రాజన్ నిష్ర్కమించడం తదితర పరిణామాల ప్రభావం దేశీ మార్కెట్లపై పెద్దగా ఉండకపోవచ్చు.
మార్కెట్లు బాగా పెరిగి ఉన్నాయి. పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా?
నిజం చెప్పాలంటే పెట్టుబడులకు సరైన సమయమంటూ ఏదీ ఉండదు. కొనడానికైనా, అమ్మడానికైనా అలాంటి టైమింగ్ ఎవ్వరికీ తెలియదు. కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) లాంటివి మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్కి ఉత్తమమని నేను చెబుతా. మార్కెట్లు ఓ అయిదు శాతం తగ్గగానే కరెక్షన్ వచ్చేస్తోందని, అయిదు శాతం పెరగ్గానే అంతా బాగైపోయిందని అనుకోవడానికి ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి.