'మగవాళ్లు గర్భం ధరిస్తే ఎలా ఉంటుంది?'.. ఓటీటీలో చూసేయండి!
బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ రియాన్, రూపా కొడువాయుర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మించారు. ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మతనం బాధ్యతను ఒక అబ్బాయి తీసుకుంటే ఎలా ఉంటుందనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ధారణంగా మహిళలు గర్భం దాలుస్తుంటారు. ఒకవేళ అది మగాడికి వస్తే పరిస్థితి ఏంటి? చివరకు ఏమైంది అనే స్టోరీతో తీసిన మూవీనే 'మిస్టర్ ప్రెగ్నెంట్'. డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించారు.
అసలు కథేంటంటే..
గౌతమ్(సోహైల్) ఓ ఫేమస్ టాటూ ఆర్టిస్ట్. చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటాడు. గౌతమ్ అంటే మహి(రూపా కొడవాయుర్)కి చాలా ఇష్టం. కాలేజీ డేస్ నుంచి అతన్ని ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. ఓ సారి ఫుల్‌గా తాగి ఉన్న గౌతమ్‌ని దగ్గరకి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మహి. పెళ్లి చేసుకుందాం అని కోరుతుంది. దానికి ఒప్పుకున్న గౌతమ్.. పిల్లలు వద్దనుకుంటేనే పెళ్లి చేసుకుందామని కండీషన్ పెడతాడు. అయితే ఇదంతా గౌతమ్ మద్యంమత్తులో చెప్తాడు. కానీ మహి మాత్రం గౌతమ్ కోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. విషయం తెలుసుకున్న గౌతమ్.. మహికి తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని పెళ్లికి ఓకే చెబుతాడు. మహి పేరెంట్స్ మాత్రం పెళ్లికి అంగీకరించరు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వచ్చి గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుంది. కొన్నాళ్లపాటు ఎంతో అనోన్యంగా వీరి జీవితం సాగుతుంది. పిల్లలే వద్దనుకున్న గౌతమ్‌కి పెద్ద షాక్ తగులుతుంది. మహి గర్భం దాల్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గౌతమ్ ఎందుకు గర్భం మోయాల్సి వచ్చింది? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓ మగాడు ప్రెగ్నెంట్ అయితే సమాజం అతన్ని ఎలా చూసింది? చివరకు అతని డెలివరీ సాఫీగా సాగిందా లేదా? అనేదే మిగతా కథ.