RPF police
-
పెళ్లి చూపులకు వెళ్లి.. కటకటాలపాలై..
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ ఉద్యోగం రాకపోవడంతో నకిలీ ఎస్ఐగా అవతారం ఎత్తిన యువతిని నార్కెట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐనని చెప్పుకుని శంకర్‌పల్లిలో విధులకు సైతం మాళవిక హాజరైంది. ఎస్ఐ డ్రెస్‌లో పెళ్లి సంబంధానికి కూడా వెళ్లింది. అప్పుడే అసలు గుట్టు రట్టయ్యింది. జరిగింది ఇదీ.. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలీసు కావాలనేది ఆమె కోరిక. అందుకోసం 2018లో జరిగిన ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ రాసింది. కంటి చూపు సరిగా లేకపోవడం ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ అవతారమెత్తిన మాళవిక విధులకు వెళ్తున్నట్టు ఏడాది పాటు కుటుంబ సభ్యులను నమ్మించింది. పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫాంలో వెళ్లి చివరికి జైలుపాలైంది. అబ్బాయి తరఫు బంధువులు ఆర్పీఎఫ్లో అధికారులను ఆరా తీయగా ఆమె అసలు గుట్టు బట్టబయలైంది. ఎల్బీ నగర్‌లోని ఆర్పీఎఫ్ పోలీసులు ధరించే యూనిఫాం కొనుగోలు చేసింది. రైల్వే ఎస్సైగా నల్గొండ లో విధులు నిర్వహిస్తున్నట్లు దాదాపు ఏడాది పాటు ప్రజలను నమ్మించి మోసాలకు తెరతీసింది. దేవాలయాలకు వెళ్లి, ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసేది. వెంటనే అప్రమత్తమైన నల్గొండ ఆర్పీఎఫ్ సిబ్బంది మాళవికను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ప్రణీత్‌రావు విచారణలో వెలుగులోకి సంచలనాలు -
జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్ర: జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు(ఆర్పీఎఫ్) చెందిన పోలీసు తన వద్దనున్న తుపాకీతో ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఏఎస్సై సహా నలుగురు మృత్యువాతపడ్డారు. జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం ఉదయం 5 గంటలకు పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు తెగబడిన వ్యక్తిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బోరివలి స్టేషన్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: చిన్నారుల అక్రమ రవాణాలో యూపీ టాప్ VIDEO | Railway Protection Force (RPF) jawan opens firing inside Jaipur-Mumbai train killing four people: Official. The jawan has been arrested and brought to Borivali Police Station. pic.twitter.com/86cFwbt3cq — Press Trust of India (@PTI_News) July 31, 2023 -
ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం ఓ వ్యక్తి ఎక్స్ట్రాలకు పోయాడు. తానేదో పెద్ద తోపుననే ఫీలింగ్‌లో ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే కారు డ్రైవింగ్ చేశాడు. దీంతో, రైల్వేపోలీసులకు చిక్కడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆగ్రాలోని కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లో ఓ రైలు ఆగి ఉంది. ప్రయాణీకులందరూ రైలులో ఎక్కారు. మరికొందరు ప్యాసింజర్లు వారి కావాల్సిన రైలు కోసం వేచి చూస్తుండగా.. ఇంతలో ఓ కారు(ఎంజీ కారు) సర్రున రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఇదేంట్రా బాబు అనుకునేలోపే డ్రైవర్ ఎంచక్కా.. ప్లాట్ఫ్లామ్ మీద డ్రైవింగ్ చేస్తూ ముందుకెళ్లాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆయన డ్రైవింగ్ చేస్తుండగా వీడియో తీశాడు. ఇదేంటబ్బా.. రైల్లు వెళ్లాల్సిన చోట కారు ఏంటని అందరూ అనుకుంటుండగా.. డ్రైవర్ కారును యూటర్న్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. అయితే, ఇదంతా ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్ కోసం తీసినట్టి తెలిసింది. దీంతో, వారంతా అవాక్కయ్యారు. ఈ విషయం కాస్తా రైల్వే పోలీసులకు తెలియడంతో ఈ ఘటనపై రైల్వే యాక్ట్్ 159, 147 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, కారు డ్రైవర్‌ను జగదీష్‌పురా ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్‌గా గుర్తించారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. RPF Agra cantt has booked Sunil Kumar of Jagdispura area for driving SUV at railway station platform in order to create #Instagram #reel. Accused has been booked under railway act 159, 147. https://t.co/X2no22lLQZ pic.twitter.com/VnMiE8B6ip — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) March 15, 2023 -
మద్యం మత్తులోనే వందేభారత్ రైలుపై దాడి
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): నిర్వహణ పనుల నిమిత్తం విశాఖకు వచ్చి.. బుధవారం కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లు వేసిన నిందితులను స్థానిక పోలీసులు, జీఆర్పీ పోలీసుల సహకారంతో రైల్వే భద్రతా దళం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం కంచరపాలెం రైల్వే గేటు వద్ద మద్యం మత్తులో ఉన్న శంకర్, చందు, రాజు అనే వ్యక్తులు కొత్త రైలు వెళ్లడం గమనించి రాళ్లతో దాడి చేశారు. గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ ముగ్గురినీ వెంబడించగా శంకర్ చెప్పును వదిలేసి పారిపోయాడు. రైల్వే పోలీసులకు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ స్థానిక పోలీసులకు ఆదేశించగా.. వెస్ట్ ఏసీపీ, కంచరపాలెం సీఐ, టాస్క్‌ఫోర్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులు ముగ్గురినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ పాత కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌లో వందేభారత్ రైలును వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి గురువారం తనిఖీ చేశారు. రైలులో ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఆన్‌బోర్డ్ టెక్నీషియన్స్‌తో డీఆర్ఎం మాట్లాడారు. బుధవారం రాత్రి ఈ రైలును కోచ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్న సమయంలో కంచరపాలెం వద్ద ఆకతాయిల వల్ల దెబ్బతిన్న పగిలిన కోచ్‌ల అద్దాలను పరిశీలించారు. పాక్షికంగా పగిలిన అద్దాలను న్యూకోచింగ్ కేర్ సెంటర్లో మార్చారు. గురువారం రాత్రికే ఈ రైలును సికింద్రాబాద్ పంపించేందుకు వాల్తేర్ డివిజన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) మనోజ్‌కుమార్ సాహూ, సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ సీహెచ్ రఘువీర్, సీనియర్ కోచింగ్ డిపో ఆఫీసర్ మోనిష్ బ్రహ్మ, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్కే పాత్ర పాల్గొన్నారు. -
అక్క స్ఫూర్తి, అన్న ఆశయం కోసం..
ఖానాపురం: అక్క బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్.. అన్న కూడా ఆర్మీలో చేరేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు.. ఆ అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని తాను నెరవేర్చాలనుకుని శిక్షణ పొందాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించాడు. రాత పరీక్ష పూర్తయితే ఆర్మీలో చేరడమే ఆలస్యమని అనుకున్నాడు. కానీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్ (21) కథ ఇది. దబ్బీర్‌పేటకు చెందిన దామెర కుమారస్వామి–పూలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో రాకేశ్ చిన్నవాడు. బీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రాకేశ్ సోదరి రాణి, సోదరుడు రాంరాజ్ సైన్యంలో చేరేందుకు చాలాకాలం ప్రయత్నించారు. 2016 లో రాణి బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్‌గా ఎం పికై పశ్చిమబెంగాల్లో పనిచేస్తున్నారు. అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్న రాకేశ్.. రెండేళ్ల క్రితం బాపట్లలో ఆర్మీ ఉద్యోగ శిక్షణ పొందాడు. 2021లో హకీంపేటలో జరిగిన రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని రాత పరీక్షకు అర్హత సాధించాడు. హకీంపేటలో అర్హత సాధించినవారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో.. ఆందోళన కార్యక్రమం గు రించి తెలిసి స్నేహితులతో కలిసి సికింద్రాబాద్‌కు వచ్చా డు. రైల్వేస్టేషన్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. నేడు దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు! రాకేశ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని తమకు చూపకుండానే మార్చురీకి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగగా.. శనివారం ఉదయం అప్పగిస్తామని పోలీసులు సర్దిచెప్పారు. రాకేశ్ మృతదేహానికి శనివారం దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు జరుగుతాయని పోలీసువర్గాలు తెలిపాయి. మోదీ నా కొడుకును చంపాడు నా కొడుకు పట్టుదలతో చదువుకుంటున్నాడు. ఉద్యోగం సాధిస్తాడనే నమ్మకం ఉండేది. కానీ నా బిడ్డను కేంద్రం పొట్టన పెట్టుకుంది. నరేంద్ర మోదీ నా కొడుకును చంపాడు. ఉద్యోగం రాకున్నా కష్టపడి సాదుకునేవాడిని. నా కొడుకును కనుమరుగు చేశారు. మాకు న్యాయం కావాలి. అంతవరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోం.. – దామెర కుమారస్వామి, రాకేశ్ తండ్రి ప్రాణం పోయినా పోరాటం ఆగదు ఛాతీలో పిల్లెట్ గాయంతో యువకుడి వీడియో వైరల్ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ‘‘2021లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రన్నింగ్, ఫిజికల్, మెడికల్ టెస్ట్‌ల్లో పాసయ్యాను. రెండేళ్లవుతున్నా రాతపరీక్ష నిర్వహించలేదు. ఇప్పుడు అగ్నిపథ్ అంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ధర్నా చేస్టుంటే కాల్చారు. ప్రాణం పోయినా మా పోరాటం ఆగదు. ఒకవేళ నేను చనిపోతే పోలీసులు, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కారణం..’’.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడిన లక్కం వినయ్ (20) బాధ ఇది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన వినయ్‌కు ఛాతీపై కుడి భాగంలో పిల్లెట్ తగిలి తీవ్ర గాయమైంది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ సిబ్బంది వినయ్‌తో మాట్లాడుతూ వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వినయ్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స చేశామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. -
Viral Video: రెప్పపాటు ఘటన.. కొంచెం ఆలస్యం అయితే యువకుడి ప్రాణం పోయేది..
సాక్షి, వరంగల్: రన్నింగ్ రైలులో నుంచి దిగుతూ కిందపడిపోయిన ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం 1లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ టీఎస్ఆర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రం జహనాబాద్‌కు చెందిన ప్రధూమ్‌కుమార్(22) వరంగల్‌లోని బాలాజీ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వరంగల్ నుంచి సూరత్ వెళ్లుటకు టికెట్ తీసుకుని నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్లాట్‌ఫాం నంబర్ 1లో వేచియున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 6.30 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం 1నకు వచ్చింది. హడావిడిగా అది ఏ రైలో తెలుసుకోకుండా ప్రధూమ్‌కుమార్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అది కదిలి స్పీడుగా వెళ్తున్న క్రమంలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కాదని తెలుసుకుని వెంటనే దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్లాట్‌ఫాం, రైలు బోగీల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశంలో పడబోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న వరంగల్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎంవీ రావు, హోంగార్డు ఆమిరిశెట్టి మహేష్‌లు గమనించి వెంటనే అప్రమత్తమై ప్రధూమ్‌కుమార్‌ను పట్టుకుని బయటకు లాగారు. దాంతో ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు. ఇదంతా రెప్పపాటు సమయంలో జరిగింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రయాణికులు, అధికారులు అభినందించారు. Today, on 08.02.2022, Sri M.V.Rao, ASI/RPF/WL and homeguard rescued a man who was falling from a running train at Warangal Railway station. Great job sir, Jaihind... pic.twitter.com/FtIZdGX2T7 — Rebal Ravi (@RebalRavi4) February 8, 2022 -
‘శభాష్’.. సాహసవీరుడు బబ్లూ
కదులుతున్న రైలు నుంచి ఇద్దరు మహిళలు ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూకారు. అందులో ఒకరు వేగంగా నడుస్తున్న రైలు కింద పడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ చిరుతలా వేగంగా వచ్చి ఆమెను పక్కకు లాగాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. సంత్రాగచ్చి-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ పురులియా స్టేషన్ గుండా వెళ్తున్న క్రమంలో ఓ పురుషుడు, తర్వాత ఇద్దరు మహిళలు ప్లాట్‌ఫామ్‌పై దూకేశారు. దీంతో ఓ మహిళ రైలు కిందపడే సమయంలో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ బబ్లూ కుమార్ పరుగుత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో RPF Adra Division ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాహసం చేసి మహిళను కాపాడిన సబ్ ఇన్స్పెక్టర్ బబ్లూ కుమార్‌పై రైల్వే అధికారులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #Lifesavingact On 29.11.21 SI/Bablu Kumar of RPF Post Purulia saved the life of a lady passenger while she was trying to de-board & almost come in the gap between train & platform in running train no 22857 at Purulia station.@RPF_INDIA @sanjay_chander @zscrrpfser@ADRARAIL pic.twitter.com/qC5eHeDu45 — RPF Adra Division (@rpfserada) November 30, 2021 -
వైరల్: రైలు కోసం వేచి చూసి పట్టాలపై పడుకున్నాడు
-
వైరల్: రైలు కోసం వేచి చూసి పట్టాలపై పడుకున్నాడు
ముంబై: ఒక్క క్షణం ఆలస్యమైనా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆయుశ్శు గట్టిగా ఉండటంతో వెంట్రుక వాసిలో గండం తప్పి ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లి అకాల మరణాన్ని తట్టుకోలేని ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముంబైలోని వీరార్ రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫామ్ మీద నిలబడి రైలు కోసం ఎదురు చూశాడు. తీరా, రైలు దగ్గరకు రాగానే పట్టాల మీదకు వెళ్ళి పడుకున్నాడు. ఈ ఘటనతో అక్కడున్న ప్రయాణికులు భయపడిపోయారు. అయితే, ఆర్పీఫ్ సిబ్బంది మాత్రం సకాలంలో స్పందించి బాధితుడిని పట్టాల మీద నుంచి పక్కకు తప్పించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. కాగా, ఆత్మహత్యకు కారణామేంటని పోలీసులు విచారించగా, తన తల్లి అకాల మరణాన్ని తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడ్డానని తెలిపాడు. అయితే నెటిజన్లు మాత్రం ఆర్పీఎఫ్ పోలీసులు చూపిన తెగువను ప్రశంసిస్తున్నారు. చదవండి: ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’... -
దారుణం: మైనర్‌పై అత్యాచారం చేసిన ఏఎస్సై
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఆర్పీఎఫ్ ఏఎస్సై లల్లూ సెబాస్టియన్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి నిలదీయడంతో విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏఎస్సై లల్లూ సెబాస్టియన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?) -
సోనూసూద్‌ను అడ్డుకున్న పోలీసులు
ముంబై: లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకుంటూ వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు నటుడు సోనూ సూద్. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని, భవిష్యత్తులోనూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. ఉత్తర ప్రదేశ్‌కు శ్రామిక్ రైలులో వెళ్లనున్న వలస కార్మికులను కలిసేందుకు నటుడు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అతడిని స్టేషన్‌లోనికి పంపించకుండా బయటే ఆపివేశారు. దీంతో ముంబై పోలీసుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. (బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ ) దీనిపై స్పందించిన ముంబై పోలీసులు నటుడిని అడ్డుకున్నది తాము కాదని, రైల్వే పోలీసులు (ఆర్పీఎఫ్ బలగాలు) అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా నటుడి సాయాన్ని ఉటంకిస్తూ అతను బీజేపీకి కొమ్ము కాస్తున్నాడని, కరోనా కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడంటూ 'సామ్నా' ఎడిటోరియల్ వేదికగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం సోనూసూద్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్యా ఠాక్రేతో భేటీ అయి రాజకీయ విమర్శలకు చెక్ పెట్టాడు. (విమర్శలకు చెక్: సీఎంతో భేటీ) -
ఒక్క నిమిషంలో చచ్చి బతికాడు..!
గాంధీనగర్: రైలు, బస్సు అనే కాదు ఏ వాహనం అయినా కదులుతుండగా ఎక్కడం ప్రమాదం. దీని గురించి ఎంత చెప్పినా.. జనాలు మాత్రం చెవికెక్కించుకోరు. సర్కస్ ఫీట్లు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి గుజరాత్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తన ట్విటర్లో షేర్ చేసింది. వివరాలు.. పేరు తెలియని ఓ ప్రయాణికుడు ఆశ్రం ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడం కోసం ప్లాట్‌ఫాం మీదకు వస్తున్నాడు. ఇంతలో రైలు కదలడం ప్రారంభించింది. దాంతో సదరు వ్యక్తి గబగబా పరిగెత్తుకు వెళ్లి మూవింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి బోగిలోకి కాలు పెట్టాడో లేదో వెంటనే తలుపులు మూసుకుపోయాయి. దాంతో పట్టు కోల్పోయి పట్టాల మీద పడబోతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అతడిని పైకి లేపి.. బోగిలోకి నెట్టి ప్రమాదం నుంచి కాపాడారు. సెకన్ల వ్యవధిలో ఆ వ్యక్తి మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. A passenger tried to board moving 12915 Ashram Exp. at Ahmedabad Station but he slipped and was about to fall in between platform & train. He was promptly pushed back into the coach by the RPF staff. HOWEVER FIT AND SMART YOU ARE, PL. DONT TRY TO ENTRAIN/DETRAIN A MOVING TRAIN pic.twitter.com/TwIgK95ZIs — Ministry of Railways (@RailMinIndia) September 24, 2019 ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఈ సంఘటనతో అతనికి బుద్ధి వచ్చి ఉంటుంది. మళ్లీ జన్మలో ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని నిర్ణయించుకుని ఉంటాడు’.. ‘ఇది కాకపోతే మరో రైలు.. కానీ ఈ జీవితం ముగిస్తే.. మరోటి లేదు. అలాంటిది ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇంత రిస్క్ చేయడం అవసరమా’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. -
ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసు
తిరువొత్తియూరు: సెంట్రల్‌రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కిన సమయంలో అదుపు తప్పి కింద పడిన మహిళను కాపాడిన రైల్వే పోలీసు(ఆర్పీఎఫ్)ను అధికారులు అభినందించారు. చెన్నై మేడవాక్కంకు చెందిన సంపత్‌కుమార్. ఇతని భార్య ప్రియ (28), తల్లితో కలిసి కోవై వెళ్లడానికి గురువారం రాత్రి చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. వీరు 6వ ప్లాట్ఫారం వద్దకు వస్తున్నారు. అప్పుడు కోవైకు వెళ్లడానికి వారు రిజర్వేషన్ చేసుకున్న ఆలపుళా ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫాం నుంచి కదులుతోంది. ఇది చూసిన ప్రియ, తల్లితో కలిసి పరిగెత్తి వెళ్లి రైలు ఎక్కడానికి ప్రయత్నించింది. ప్రియ అదుపు తప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడిబోయింది. గమనించిన రైల్వే భద్రతా పోలీసు పాండియరాజన్ అక్కడికి వెళ్లి కింద పడిన మహిళను కాపాడాడు. ఘటనలో ప్రియకు స్పల్ప గాయాలయ్యాయి. రైల్వే పోలీసుల పాండియరాజన్‌కు ప్రియ, ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు పాండియరాజన్‌ను అభినందించారు. -
తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుపతికి..
గుంటూరు, నడికుడి(దాచేపల్లి): నడికుడి రైల్వేస్టేషన్ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు చిన్నారులను ఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు చెప్పకుండా నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి వెళ్లేందుకు ఎక్కిన ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి స్టేషన్లో దిగారు. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వైకే. రావు చిన్నారులను విచారణ చేయగా ఇంట్లో చెప్పకుండా తాము తిరుపతి వెళ్లేందుకు రైలులో వచ్చామని చెప్పారు. బీబీనగర్‌కు చెందిన షేక్ ఖాదర్‌బాషా కుమారుడు ఖలీల్, కె. స్వామి కుమారుడు శ్రీకాంత్ తొమ్మిదో తరగతి చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి వెళ్లకుండా నేరుగా సికింద్రాబాద్ వెళ్లి తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు విచారణలో తేలింది. ఇద్దరు చిన్నారులను స్టేషన్లో ఉంచి సమాచారాన్ని తల్లిదండ్రులకు అందించారు. సీఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ ఖలీల్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ వైకే. రావు చిన్నారులను తల్లిదండ్రులకు బుధవారం అప్పగించారు. కానిస్టేబుల్ వైకే. రావును సీఐ, ఎస్ఐ అభినందించారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు
► నల్లబెల్లం, గంజాయి స్వాధీనం సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం రైల్వేపోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్తీ సారాకు ఉపయోగించే 1500 కిలోల నల్లబెల్లం(27 సంచులు), 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన బీరు సునీల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైళ్ల బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలులో నల్లబెల్లం, గంజాయిని గమనించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణ నర్సాపూర్, చెన్నై, మచిలీపట్నం, సింహపురి, నారయణాద్రి, గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో లేడీస్ కోచ్, లగేజీ కోచ్‌లలో ప్రయాణిస్తున్న 300 మందిని పట్టుకుని కేసులు నమోదుచేశారు. అరెస్టు చేసిన వారని కోర్టుకు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
మట్టెవా(వరంగల్ జిల్లా): ఆర్ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాజు(52) గుండెపోటుతో మృతిచెందాడు. మహారాష్ట్రలోని బల్లార్ష నుంచి స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. రైల్వే అధికారులు పెద్దపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా కేంద్రంలోని పెరకవాడ. రాజు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించి... విచారిస్తున్నారు. ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు రాత్రి వరకు కొనసాగుతాయని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ ఎస్ జే జనార్దన్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు. వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ సిమీ ఉగ్రవాది వికార్తోపాటు అతడి గ్యాంగ్‌లోని నలుగురు సభ్యులు హతమైన సంగతి తెలిసిందే. అంతకుముందు నల్గొండ జల్లాలో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో మరణించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జానకీపురం, అలేరు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు.