ఫెడరల్ బ్యాంక్ నికర లాభాలు ఢమాల్
ముంబై : ఐసీఐసీఐ నిరాశజనకమైన ఫలితాల అనంతరం మరో ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు ఫెడరల్ బ్యాంకు సైతం నికర లాభాలను కోల్పోయింది. సోమవారం ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఫెడరల్ బ్యాంకు నికర లాభాలు 96 శాతం పడిపోయి, రూ.10.26 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఈ లాభాలు రూ.280.53 కోట్లగా ఉన్నాయి. అయితే జనవరి-మార్చి క్వార్టర్లో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.2,214.28 కోట్ల నుంచి రూ.2,253.38 కోట్లకు పెరిగిందని కంపెనీ రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
2014-15లో రూ.39.78 కోట్లగా ఉన్న ప్రొవిజన్స్(బ్యాంకు కలిగిఉన్న రుణాలు) కంపెనీ బ్యాలెన్స్ షీటు ప్రకారం రూ.388.64 కోట్లకు పెరిగాయని తెలిపింది. 2015-16లో రూ. 2 ముఖ విలువగా ఉన్న ప్రతి ఈక్విటీ షేర్ కు రూ.0.70 డివిడెంట్ ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. ఈ నిరాశజనకమైన ఫలితాలతో ఫెడరల్ బ్యాంకు షేర్లు స్టాక్ మార్కెట్లో నష్టాలను చవిచూస్తున్నాయి.