ఆర్బీఐ తప్పులో కాలేసిందా?
ముంబై: డీమానిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లో డిపాజిట్లు కచ్చితమైన లెక్క ఎంత ? పెద్దనోట్ల తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం నగదుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం రూ.11.5 లక్షల కోట్లు జమ అయింది. అయితే ఈ గణాంకాలపై ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ అనుమానం వ్యక్తం చేసింది. బహుశా డబుల్ కౌంట్ అయి వుంటుందనే అభిప్రాయపడింది. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్లు , విత్ డ్రా కరెన్సీ తో పాటు , ముఖ్యంగా కొత్త నోట్లు, చెలామణీలో ఉన్ననోట్లను కలిపి డబుల్ లెక్కింపు జరిగి ఉంటుందనే అనుమానాలను లేవనెత్తింది. దీంతో ఏ లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక మార్కెట్ వర్గాలు అయెమయంలో పడిపోయాయి.
కచ్చితమైన గణాంకాలు ప్రకటించకపో్యినప్పటికీ , దీనిపై ఎస్ బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కొంత వివరణ ఇచ్చారు. ఆర్బీఐ ప్రకటనపై వ్యాఖ్యానించిడానికి నిరాకరించిన ఆమె డబుల్ లెక్కింపు అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తమతో ఉన్న పోస్ట్ ఆఫీస్, కో ఆపరేటివ్ ఖాతాల్లో ఇప్పటికే కొత్త నోట్ల డిపాజిట్లు ప్రారంభమైందన్నారు. 10-15 శాతం డబుల్ లెక్కింపు జరిగివుంటుందని ఎస్బీఐ పరిశోధనా విభాగం అంచనావేసినట్టుతెలిపారు. నవంబర్ 10 నాటికి ఎస్బీఐ మొత్తం డిపాజిట్లు విలువ రూ 3.5 లక్షల కోట్లకు చేరింది.
కాగా రివ్యూ పాలసీ సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ మొత్తం డిపాజిట్ల విలువ రూ 11.5 లక్షల కోట్ల దాటిందని చెప్పారు. అధిక విలువ కలిగిన బ్యాంకు నోట్లద్వారా రూ 14.95 లక్షల కోట్ల డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు తిరిగి వస్తుందని ఊహాగానాలకు దారి తీసిందని పేర్కొన్నారు. నల్లధనం వెలికితీత కోసం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం హడావిడిగా చేసింది కాదనీ, వివరణాత్మక చర్చల తర్వాత మాత్రమే జరిగిందని చెప్పారు.అలాగే వివిధ తరహా నోట్లను ఇప్పటికే రూ.3.81లక్షల కోట్ల విలువైన నోట్లను అందించామనీ, ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ గత మూడు సంవత్సరాల్లో సరఫరా చేసినదాని కంటే ఇది ఎక్కువని చెప్పారు.