RSS General Secretary
-
మతం మారితే బహిరంగపరచాలి
ధార్వాడ్: మత మార్పిడుల్ని నిరోధించాలని, ఒకవేళ ఎవరైనా మతం మారితే బహిరంగంగా వెల్లడించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయపడింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఏ రాష్ట్రమైనా తీసుకువస్తే తాము స్వాగతిస్తామని స్పష్టం చేసింది. అఖిల భారతీయ కార్యకారి మండల్ (ఏబీకేఎం) మూడు రోజుల సమావేశం ముగిసిన అనంతరం ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే శనివారం మీడియాతో మాట్లాడారు. మతమార్పిడుల్ని నిరోధించాలన్నదే ఆరెస్సెస్ విధానమన్నారు. ఒకవేళ ఎవరైనా మతం మార్చుకుంటే దానిని బహిరంగంగా వ్యక్తపరచాలని డిమాండ్ చేశారు. మతం మారిన తర్వాత కూడా బయటపెట్టకపోతే వారు రెండు రకాలుగా లబ్ధిని పొందుతున్నారని అన్నారు. బలవంతపు మత మార్పిడుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని అన్నారు. అందుకే మత మార్పిడి నిరోధక చట్టాన్ని మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. బలవంతగా మత మార్పిడిని ఆరెస్సెసే కాదు మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు పదికి పైగా రాష్ట్రాలు మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. -
అయోధ్యపై ఏకాభిప్రాయం కష్టమే!
నాగ్‌పూర్: అయోధ్యలో రామమందిర నిర్మాణంపై ఏకాభిప్రాయం కష్టమని.. అయినా రామమందిర నిర్మాణం జరిగితీరుతుందని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి పేర్కొన్నారు. ఏకాభిప్రాయం ద్వారానే మందిర నిర్మాణం జరగాలని ఆరెస్సెస్ మొదటినుంచీ ఆశించిందని.. కానీ ఇదేమంత సులభం కాదని ఆయన స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నిర్ణయించిన స్థలంలోనే రామమందిర నిర్మాణం జరిగితీరుతుంది. నిర్మాణానికి అనుకూలంగానే కోర్టు తీర్పు ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. కోర్టు నిర్ణయం తర్వాతే మందిర నిర్మాణం మొదలవుతుంది’ అని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ప్రయత్నాల్ని స్వాగతిస్తున్నామన్నారు. కర్ణాటకలో లింగాయత్‌లకు మైనారిటీ హోదా డిమాండ్‌తో విభేదిస్తున్నట్లు చెప్పారు. -
సంఘ్‌ను బూచిగా చూపే కుట్ర
ఇది హిందూ ధర్మానికే అవమానం: భయ్యాజీ జోషి రాంచి: దాద్రీ ఘటనతోపాటు.. ‘అసహనం’ వివాదంలో తమ సంస్థను బూచిగా చూపెట్టేందుకు కొన్ని వర్గాలు కంకణం కట్టుకున్నాయని ఆరెస్సెస్ ఆరోపించింది. హిందూ సంస్కృతిని, సంస్థలపై దుష్ర్పచారం చేయటం ద్వారా లాభం పొందాలని కొందరు చేస్తున్న ప్రయత్నం సరికాదని.. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి తెలిపారు. ‘గతంలోనూ ఇలాగే సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ, జరిగిన ఘటనలపై లోతుగా విశ్లేషించినపుడు.. ఆరెస్సెస్ నిర్దోషిగా తేలింది. ఇప్పుడు కూడా అంతే. అనిశ్చితి సృష్టించి దీనికి.. ఆరెస్సెసే కారణమంటూ అర్థరహిత విమర్శలు చేయటం సరికాదు. ఇది హిందూ ధర్మానికే అవమానం’ అని ఆయన తెలిపారు. సమాజంలో చిచ్చు పెట్టే దాద్రి వంటి ఘటనలను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. కోటా వ్యవస్థలో మార్పుల విషయంలో రిజర్వేషన్లను సమీక్షించాలనే ఆలోచననూ వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాలు కోలుకునేంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జోషి తెలిపారు. ఈ విషయంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారన్నారు. దేశానికి, సమాజానికి సంఘ్ ఏం చేసిందో అర్థం చేసుకోవాలని సూచించారు.