సంఘ్‌ను బూచిగా చూపే కుట్ర
ఇది హిందూ ధర్మానికే అవమానం: భయ్యాజీ జోషి
రాంచి: దాద్రీ ఘటనతోపాటు.. ‘అసహనం’ వివాదంలో తమ సంస్థను బూచిగా చూపెట్టేందుకు కొన్ని వర్గాలు కంకణం కట్టుకున్నాయని ఆరెస్సెస్ ఆరోపించింది. హిందూ సంస్కృతిని, సంస్థలపై దుష్ర్పచారం చేయటం ద్వారా లాభం పొందాలని కొందరు చేస్తున్న ప్రయత్నం సరికాదని.. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి తెలిపారు. ‘గతంలోనూ ఇలాగే సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ, జరిగిన ఘటనలపై లోతుగా విశ్లేషించినపుడు.. ఆరెస్సెస్ నిర్దోషిగా తేలింది. ఇప్పుడు కూడా అంతే. అనిశ్చితి సృష్టించి దీనికి.. ఆరెస్సెసే కారణమంటూ అర్థరహిత విమర్శలు చేయటం సరికాదు. ఇది హిందూ ధర్మానికే అవమానం’ అని ఆయన తెలిపారు.
సమాజంలో చిచ్చు పెట్టే దాద్రి వంటి ఘటనలను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. కోటా వ్యవస్థలో మార్పుల విషయంలో రిజర్వేషన్లను సమీక్షించాలనే ఆలోచననూ వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాలు కోలుకునేంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జోషి తెలిపారు. ఈ విషయంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారన్నారు. దేశానికి, సమాజానికి సంఘ్ ఏం చేసిందో అర్థం చేసుకోవాలని సూచించారు.