Suresh Bhaiyyaji Joshi
-
ఢిల్లీ ఘర్షణలపై స్పందించిన ఆరెస్సెస్
నాగ్‌పూర్ : దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక ఘటనలపై ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి స్పందించారు. ఢిల్లీలో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయని నిర్ధారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జోషి మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికి లేదని తెలిపారు. ఢిల్లీ హింసాత్మక ఘటనలు చెలరేగిన ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే శాంతిని నెలకొల్పాలన్నారు. కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో దాదాపు 34 మంది మృతిచెందగా, 200 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతిగా ఉన్న అధికారాలను వినియోగించి రాజ ధర్మాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. చదవండి : ఢిల్లీ అల్లర్లు: ‘ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’ ఢిల్లీ హింస: అమిత్ షాపై మండిపడ్డ సోనియా -
సంఘ్‌ను బూచిగా చూపే కుట్ర
ఇది హిందూ ధర్మానికే అవమానం: భయ్యాజీ జోషి రాంచి: దాద్రీ ఘటనతోపాటు.. ‘అసహనం’ వివాదంలో తమ సంస్థను బూచిగా చూపెట్టేందుకు కొన్ని వర్గాలు కంకణం కట్టుకున్నాయని ఆరెస్సెస్ ఆరోపించింది. హిందూ సంస్కృతిని, సంస్థలపై దుష్ర్పచారం చేయటం ద్వారా లాభం పొందాలని కొందరు చేస్తున్న ప్రయత్నం సరికాదని.. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి తెలిపారు. ‘గతంలోనూ ఇలాగే సంఘంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ, జరిగిన ఘటనలపై లోతుగా విశ్లేషించినపుడు.. ఆరెస్సెస్ నిర్దోషిగా తేలింది. ఇప్పుడు కూడా అంతే. అనిశ్చితి సృష్టించి దీనికి.. ఆరెస్సెసే కారణమంటూ అర్థరహిత విమర్శలు చేయటం సరికాదు. ఇది హిందూ ధర్మానికే అవమానం’ అని ఆయన తెలిపారు. సమాజంలో చిచ్చు పెట్టే దాద్రి వంటి ఘటనలను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. కోటా వ్యవస్థలో మార్పుల విషయంలో రిజర్వేషన్లను సమీక్షించాలనే ఆలోచననూ వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన వర్గాలు కోలుకునేంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జోషి తెలిపారు. ఈ విషయంపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చూపించారన్నారు. దేశానికి, సమాజానికి సంఘ్ ఏం చేసిందో అర్థం చేసుకోవాలని సూచించారు.