సురేశ్ భయ్యాజీ జోషి(ఫైల్ ఫొటో)
నాగ్‌పూర్ : దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక ఘటనలపై ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ సురేశ్ భయ్యాజీ జోషి స్పందించారు. ఢిల్లీలో శాంతియుత పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయని నిర్ధారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జోషి మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికి లేదని తెలిపారు. ఢిల్లీ హింసాత్మక ఘటనలు చెలరేగిన ప్రాంతాల్లో ప్రభుత్వం తక్షణమే శాంతిని నెలకొల్పాలన్నారు. కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో దాదాపు 34 మంది మృతిచెందగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
మరోవైపు ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతిగా ఉన్న అధికారాలను వినియోగించి రాజ ధర్మాన్ని నిర్వర్తించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment