కస్సుబస్సు..
ఆర్టీఏ వర్సెస్ ప్రైవేటు ఆపరేటర్లు
పట్టుబిగిస్తున్న రవాణా శాఖ అధికారులు
సడలించకుంటే పర్మిట్లకు ససేమిరా అంటున్న ఆపరేటర్లు
జిల్లాలో ఇప్పటికే 228 బస్సులపై కేసులు
65 బస్సులు తిప్పలేమంటూ ఆపరేటర్ల స్టాపేజీ నోటీసులు
ప్రభుత్వ ఆదాయంపై నీలినీడలు
నిబంధనలను గాలికొదిలి రోడ్లపై పరుగులు తీస్తున్న ప్రైవేటు బస్సులకు రవాణా శాఖ అధికారుల తనిఖీలు బ్రేకులు వేస్తున్నాయి. ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు పట్టు బిగిస్తుండటంతో ప్రైవేటు ఆపరేటర్లు కస్సుబుస్సులాడుతున్నారు. ఇలాగైతే ఆర్టీఏ అధికారులు దారికొచ్చేలా లేరని భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యూహరచన చేశారు.
సాక్షి, మచిలీపట్నం : పాలెం వద్ద అక్టోబర్ 30న జరిగిన దుర్ఘటనలో ప్రైవేటు ఓల్వో బస్సు ప్రయాణికులు 45 మంది సజీవదహనమవడంతో చలనం వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ అప్పటినుంచి ప్రైవేటు బస్సులపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసం వసూలు చేస్తోంది. ఇదంతా ఆరంభశూరత్వమే అనుకున్నా రానురానూ అధికారులు పట్టు బిగించడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇబ్బందుల్లో పడ్డారు. రాష్ట్ర, జాతీయ పర్మిట్ ఉన్న బస్సులు జిల్లాలో 222 ఉండగా, వాటినే నిబంధనలకు విరుద్ధంగా మళ్లీమళ్లీ తిప్పుతుండటంతో తనిఖీల్లో భాగంగా 228 కేసులు నమోదు చేశారు.
నిబంధనలివీ...
స్టేజి క్యారేజ్ (ఏ ప్రాంతంలోనైనా బస్సు ఎక్కించుకునే) అనుమతి ఆర్టీసీ బస్సులకు మాత్రమే ఉంది. ప్రైవేటు బస్సులకు కాంట్రాక్ట్ క్యారేజ్ (ఒక చోట నుంచి మరొకచోటకి) మాత్రమే అనుమతిస్తారు.
ప్రైవేటు బస్సులో వెళ్లేవారంతా ఒకేచోట ఎక్కి మరోచోట మాత్రమే దిగాలి.
ప్రయాణికుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్ల వివరాలతో పాటు, బస్సు పర్మిట్, ఇన్సూరెన్స్, డ్రైవర్ డ్రైవింగ్ లెసైన్స్ తదితరాలన్నీ కచ్చితంగా ఉండాలి.
ఈ నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై కేసులు నమోదవుతున్నాయి. విజయవాడ అడ్డరోడ్డు, గరికిపాడు, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు బస్సుల తనిఖీలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు.
క్వార్టర్ పర్మిట్‌కు ఎసరు..
జిల్లాలో స్టేట్ పర్మిట్ ఉన్నవి 177, ఆలిండియా పర్మిట్ తీసుకున్నవి 45 బస్సులు ఉన్నాయి.
ఆర్టీఏ అధికారుల దాడుల నేపథ్యంలో 65 బస్సులు తిప్పలేమని ప్రైవేటు ఆపరేటర్లు స్టాపేజ్ నోటీసులు ఇచ్చారు.
దీంతో క్వార్టర్ పర్మిట్ రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
జిల్లాలో పర్మిట్లు ఎందుకు చెల్లించలేదని మరో 25 బస్సులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో 222 బస్సులకు ఈ నెలలో రావాల్సిన పర్మిట్ ఆదాయం మొత్తం సుమారు 2 కోట్ల 54 లక్షల రూపాయల్లో చాలావరకు గండిపడే అవకాశముంది.
స్టేట్ పర్మిట్ బస్సులో ఒక్కో సీటుకు రూ.2,625, నేషనల్ బస్సులో ఒక్కో సీటుకు రూ.3,625 చొప్పున చెల్లించాల్సి ఉంది.
ఈ లెక్కన ఒక్కో బస్సుకు స్టేట్ పర్మిట్‌కు రూ.1.05 లక్షలు, నేషనల్ పర్మిట్‌కు రూ.1.45 లక్షలు మూడు నెలలకు చెల్లించాల్సి ఉంటుంది.
డిసెంబర్ వరకు మూడు నెలల కాలపరిమితి ముగియగా, జనవరి నెలాఖరులోగా తిరిగి పర్మిట్ మొత్తాలు చెల్లించాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆదాయంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రైవేటు బస్సులకు పర్మిట్ల చెల్లింపులో జాప్యం జరగడంతో వాటి వసూళ్లకు వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రత్యేక కార్యాచరణ చేపడతామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే...
ప్రైవేటు ఆపరేటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే కేసులు నమోదు చేస్తాం. వాస్తవానికి ఆర్టీసీ బస్సులకు మాత్రమే స్టేజ్ క్యారేజ్‌గా అనుమతి ఉంది. ప్రైవేటు బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్‌లు మాత్రమే వెళ్లాలి. వ్యక్తులుగా టిక్కెట్టు తీసుకుని ప్రయాణించేవారు ఆర్టీసీలోనే రాకపోకలు సాగించాలి. కాంట్రాక్టుకు మాట్లాడుకుంటే ప్రైవేటు బస్సులు ఉపయోగించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారేజ్‌లుగా నడిపే ప్రైవేటు బస్సులపై కేసులు కడతాం. క్వార్టర్ పర్మిట్ తీసుకోని బస్సులకు నోటీసులు ఇస్తున్నాం.
- శివలింగయ్య, డీటీసీ