Sabarimala pilgrims
-
శబరిమల యాత్రికులకు బీమా.. కంపెనీల ఆసక్తి
శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభించాలన్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రణాళికకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన లభించింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో జరిగిన సమావేశాలు మార్కెట్ పై విలువైన అవగాహన కల్పించాయని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.పోటీ, నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తామని, ఇందులో భాగంగా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించనున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామన్నారు.శబరిమల కొండపై నమోదవుతున్న మరణాల్లో ఎక్కువ శాతం గుండె ఆగిపోవడం, శ్వాసకోశ సమస్యలు వంటి ప్రమాదం కాని కారణాల వల్ల సంభవించినవేనని ఆయన పేర్కొన్నారు. గత సీజన్లోనే దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా యాత్రికులకు ప్రమాద మరణ బీమా కవరేజీని టీడీబీ కల్పిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం ప్రమాదం కాని కారణాల వల్ల సంభవిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని ప్రశాంత్ చెప్పారు.గత యాత్రల సీజన్ వరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలను అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేవారు.గరిష్ట ప్రయోజనాలుశబరిమల భక్తులు వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనం బుక్ చేసేటప్పుడు రూ.10 వరకు వన్ టైమ్ ప్రీమియం చెల్లించి కవరేజీని ఎంచుకునే కొత్త బీమా పథకాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రవేశపెట్టబోతోంది. ఈ కొత్త పథకం కింద సుమారు రూ.5 లక్షల బీమా సౌకర్యంతోపాటు మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. -
శబరిమలకు భక్తుల తాకిడి.. ఒక్కరోజే లక్షమంది దర్శనం
శబరిమల అయ్యప్ప నామ స్మరణతో మార్మోగిపోతోంది. భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో అయ్యప్ప కొండ కిటకిటలాడుతోంది. నిన్న ఒక్కరోజే(ఆదివారం) సుమారు లక్ష మంది అయ్యప్పను దర్శించుకున్నారు. లక్షమంది దర్శనం చేసుకున్నా.. క్యూలైన్ మళ్లీ అలానే కనిపిస్తుండటం శబరిమలలో భక్తుల రద్దీకి నిదర్శనంగా కనబడుతోంది. పంబ నుంచి శబరిమల కొండకు వెళ్లేందుకు 10 గంటల సమయం పడుతుండటంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు ఉన్నా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అన్నదానం, మంచి నీటి సౌకర్యాలతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
అయ్యప్పా.. వచ్చేదెట్లా?
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న భక్తులకు రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అన్ని రైళ్లలో వెయిటింగ్ జాబితానే దర్శనమిస్తోంది. గత రెండేళ్లుగా దర్శనాలు నిలిచిపోయిన దృష్ట్యా ఈసారి నగరం నుంచి లక్షలాది మంది తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. మాలధారులతో పాటు సాధారణ భక్తులు సైతం రైళ్ల కోసం బారులు తీరుతున్నారు. కానీ.. భక్తుల డిమాండ్ మేరకు రైళ్లు లేవు. దక్షిణమధ్య రైల్వే అధికారులు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ అన్నింటిలోనూ ఇప్పటికే బెర్తులు భర్తీ కావడంతో పాటు వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరింది. కొన్నింటిలో బుకింగ్ కూడా అవకాశం లేకుండా ‘రిగ్రేట్’ కనిపిస్తోంది. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది భక్తులు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంది. దక్షిణమధ్యరైల్వే ప్రకటించిన అరకొర రైళ్లు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆలస్యంతో ఇక్కట్లు.. గతంలో ఇలాగే మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో హడావుడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. అవి సైతం విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లిన రైళ్లు పరిమితమే. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పైగా చాలా వరకు ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా ప్రత్యేక రైళ్లలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో భక్తులు స్నానాలు, పూజలు చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. విమాన చార్జీల మోత... రైళ్లలో భారీ డిమాండ్ ఉండడంతో చాలా మంది భక్తులు విమానాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్లే విమానాల్లో సైతం చార్జీలు మోత మోగుతున్నాయి. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు. ఈ చార్జీలు కూడా తరచూ మారిపోతున్నాయి. సంక్రాంతికి కష్టాలే... నగరం నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, బెంగళూర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సుమారు 25 లక్షల మందిప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది. వీరిలో కనీసం 15 లక్షల మంది రైళ్లపైనే ఆధారపడి ఉంటారు. రైళ్లలో అవకాశం లభించకపోవడంతో చాలా మంది సొంత వాహనాలు, ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఎందుకిలా? అయ్యప్ప దర్శనం కోసం నగరానికి చెందిన భక్తులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరికి కూడా అప్పుడే బుక్ అయ్యాయి. భక్తుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు వేయాల్సిన అధికారులు ఆ దిశగా పెద్దగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ నుంచి వెళ్లేవి తక్కువగానే ఉన్నాయి. చివరి క్షణాల్లో హడావుడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్నింటిని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. డిసెంబర్ నుంచి జనవరి వరకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరికి వెళ్లనున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తే భక్తులు తమకు అనుకూలమైన రోజుల్లో శబరికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. -
కేరళలో ఏపీకి చెందిన అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా
-
కేరళలో ఏపీ శబరిమల భక్తుల వాహనం బోల్తా.. ప్రమాదంపై సీఎం జగన్ ఆరా
ఏలూరు రూరల్/సాక్షి, అమరావతి : అయ్యప్ప మాలధారులతో కేరళలోని శబరిమలకు వెళ్లిన ఓ ప్రైవేటు బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. శబరిమల సమీపంలోని పతనంతిట్ట వద్ద మలుపు తిరుగుతుండగా బ్రేక్ ఫెయిలై లోయలో పడింది. ప్రయాణ సమయంలో బస్సులో 46 మంది ఉండగా, వారిలో 17 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఎనిమిదేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొఠారు అబ్బయ్యచౌదరి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కేరళ ప్రభుత్వంతో, అక్కడి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. రెండు బస్సుల్లో ప్రయాణం.. ఈ నెల 15న ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామానికి చెందిన 86 మంది అయ్యప్ప మాలధారులు శబరిమల యాత్రకు రెండు బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. 18న మధ్యాహ్నం శబరిమలకు చేరుకుని దర్శనానంతరం శనివారం ఉ.6.30 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శబరిమల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని పతనంతిట్ట వద్ద బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో డ్రైవర్ బండిని అదుపుచేయలేక లోయలో పడింది. ప్రయాణికులంతా పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. సుమారు 15–20 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు ఒక్కసారిగా పడటంతో ప్రయాణికులంతా చెల్లాచెదురయ్యారు. 17 మంది గాయపడ్డారు. వీరిలో మాదేపల్లికి చెందిన మణికంఠ అనే బాలుడికి పక్కటెముకలు విరిగాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సంఘటన జరిగిన తరువాత అక్కడి పోలీసులు, ఇతర అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల ద్వారా కొట్టాయం మెడికల్ కళాశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సు 40–50 కి.మీ.ల వేగంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. ప్రమాద వార్త తెలియగానే మాదేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. తమవారి క్షేమ సమాచారం కోసం బంధువులు ఎంతో ఆతృతతో ఆరా తీశారు. కేరళ మంత్రితో ఆళ్ల నాని వాకబు సమాచారం తెలియగానే మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జి, స్థానిక కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి క్షేమంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాదేపల్లి పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఆర్డీఓ పెంచల కిషోర్‌తో పాటు క్షతగాత్రుల కుటుంబీకులను పరామర్శించారు. బాధితులను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని వివరించారు. ఇక బ్రేక్ ఫెయిల్ అవడంవల్లే బస్సు ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు వివరించారని వారి బంధువు, మాదేపల్లికి చెందిన శ్రీనివాస్ ‘సాక్షి’కి చెప్పారు. తాను కూడా వారితో పాటే శబరిమలకు వెళ్లానని, వచ్చేటప్పుడు వారికంటే ముందు బయల్దేరి వచ్చేశానన్నారు. కొండ దిగువన పెద్దపెద్ద చెట్లు ఉండడంవల్ల ప్రమాద తీవ్రత తగ్గినట్లు బాధితులు చెప్పారన్నారు. అసలు తిరుగు ప్రయాణంలో బస్సు క్లచ్ ప్లేట్లు పాడయ్యాయని.. మరమ్మతులు చేసుకుని తిరిగి బయలుదేరిన 30 నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగినట్లు వారు చెప్పారన్నారు. క్షతగాత్రులు వీరే.. గాయపడిన వారిలో.. మాదేపల్లి గ్రామానికి చెందిన బత్తిన రాజశేఖర్, చల్లా సురేష్, బత్తిన రాజేష్, తరగళ్ల రాజేష్, పాశం సాయిమణికంఠ, జి.గోపి, కాకరబత్తిన వెంకటేశ్వరరావు, మారేటి దుర్గారావు, పైడిపాతి భాస్కరరావు, గండికోట శ్యామ్, పాండు, సూరినీడు శివ, ప్రసాద గోపి, మారెడ్డి చరణ్, లక్ష్మయ్యతో పాటు ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగేశ్వరరావు, శ్రీను ఉన్నారు. సీఎం జగన్ ఆరా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశం మరోవైపు.. రాష్ట్రానికి చెందిన శబరిమల భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రమాద ఘటనకు దారితీసిన పరిస్థితులు, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతోపాటు గాయపడిన వారందరికీ వైద్యం, తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు. పతనంతిట్ట జిల్లా కలెక్టర్‌తో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎంకు అధికారులు వివరించారు. -
శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం |
-
శబరిమలలో రోడ్డు ప్రమాదం.. కర్నూల్‌కు చెందిన ఇద్దరు మృతి
తిరువనంతపురం: శబరిమల సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. కర్నూల్లోని బుధవారపేటకు చెందిన 11 మంది అయ్యప్ప స్వాములు బుధవారం టెంపోలో శబరిమలకు వెళ్లారు. శబరిమలకు 60 కి.మీ. దూరంలో టెంపో వాహనాన్ని నిలిపి.. టీ తాగడానికి వెళ్లారు. ఇంతలో వెనుక నుంచి మరో వాహనం టెంపోను ఢీ కొట్టి.. భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద గురించి తెలియడంతో బాధితుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు.. -
శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు
-
శబరిమలలో మహిళలను అడ్డగించిన ఆందోళనకారులు
తిరువనంతపురం : శబరిమల ఆలయానికి పోలీస్ భద్రతతో వెళుతున్న ఇద్దరు మహిళలను సోమవారం ఉదయం ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆందోళనకారులు అడ్డగించారు. 50 సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు మహిళలను ఆందోళనకారులు చుట్టుముట్టి ముందుకు వెళ్లకుండా నిరోధించారు. పెద్దసంఖ్యలో నిరసనకారులు గుమికూడటంతో మహిళల భద్రత కోసం మరిన్ని బలగాలను పంపాలని పోలీసులు ఉన్నతాధికారులను కోరినట్టు సమాచారం. కాగా ఆదివారం పదకొండు మంది మహిళా భక్తులతో కూడిన బృందాన్ని తోటి భక్తులు ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసు భద్రత ఉన్నప్పటికీ మహిళా భక్తులు వెనుదిరిగిన సంగతి తెలిసిందే. తాము ఆందోళనకారులను బలవంతంగా చెదరగొట్టలేమని, ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీసే అవకాశం ఉందని పంబలో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ స్పెషల్ ఆఫీసర్ షాజి సుగుణన్ పేర్కొన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం అయ్యప్ప దర్శనానికి వస్తున్న మహిళలను బీజేపీ, ఆరెస్సెస్ సహా పలు హిందూ సంఘాలు, సంస్థల కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డగిస్తుండటంతో ఉద్రిక్తత నెలకొంటోంది. -
భారీగా పెరిగిన శబరిమల ఆదాయం
సాక్షి, శబరిమల : ఈ ఏడాది శబరిమల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన మూడు వారాల్లో అంటే డిసెంబర్ 6 నాటికి రూ.83 కోట్ల ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చిందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇదే గత ఏడాది డిసెంబర్ 6 నాటికి అయ్యప్ప ఆదాయం రూ. 70 కోట్లు అని ఆలయ అధికారులు తెలిపారు. అయ్యప్ప అరవణ ప్రసాదం అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 36.20 కోట్లు వచ్చాయి. ఇదే గత ఏడాది రూ.30.48 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. స్వామివారి హుండీ ద్వారా 29.49 కోట్ల రూపాయాలు రాగా, గత ఏడాది ఇది రూ. 22.80 కోట్లుగా ఉండేది. కేవలం అప్పం ప్రసాదం అమ్మకాల ద్వారా 5.95 కోట్ల రూపాయాలు వచ్చినట్లు ట్రావెన్ కోర్ అధికారులు ప్రకటించారు. -
శబరిమల యాత్రలో విషాదం.. ఇద్దరి మృతి
కోజికోడ్: కేరళలో జరిగిన ఒక రోడ్డుప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప భక్తులతో వస్తున్న వాహనం అదుపు తప్పి లారీని ఢీకొట్టి, అనంతర చెట్టును ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు అక్కడిక్కడే చనిపోగా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఆరుగురు అయ్యప్ప భక్తుల బృందం ఒకవాహనంలో బయలుదేరి వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం శబరిమలై నుంచి తిరిగి వస్తుండగా మల్లాపురం జిల్లా వెల్లిముక్కు దగ్గర మంగళవారం తెల్లవారుఝామున ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులను సతీష్ కుమార్ (49), అనూప్ ( 29)గా గుర్తించిన అధికారులు బంధువులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు.