పాతకాలం పద్యమైతే, వర్తమానం వచన కవిత
నన్నయ విశ్వవిద్యాయంలో వచన కవితాశతావధాన సదస్సు
పాల్గొన్న పలువురు సాహితీమూర్తులు
రాజమహేంద్రవరం కల్చరల్ :
వచన కవిత్వం రాస్తావా –వందేళ్లు ముందుంటావ్, పద్య కవిత్వం రాస్తావా, వెయ్యేళ్లు వెనక ఉంటావ్ అని పొట్టి శ్రీరాములు తెలుగు సాహిత్యపీఠం ఆచార్యుడు ఎండ్లూరి సుధాకర్ అన్నారు. మంగళవారం నన్నయ విశ్వవిద్యాలయం, ఆదిత్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలి ప్రసాద్ ఆధ్వర్యంలో వచన కవితా శతావధానానికి ముందు వచన కవితా పరిణామంపై జరిగిన సదస్సులో ఎండ్లూరి సుధాకర్ ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ‘పాతకాలం పద్యమైతే, వర్తమానం వచన కవిత’ అన్న కందుర్తి ఆంజనేయులు పలుకులను ఉటంకించారు. ‘నా వచన కవితలనే దుడ్డుకర్రతో, పద్యాల నడుముల్ విరగతంతాను’ అన్న పఠాభి పలుకులను వివరిస్తూ, వాల్మీకి అయినా, వరవరరావు అయినా, కవిత్వానికి సామాజిక స్పృహ ఉండాలన్నారు. నాటి కవులు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు, శ్రీరంగంనారాయణబాబు, పఠాభి, సూర్యారావు బహద్దూర్ తదితరులు వచన కవిత అవసరాన్ని గుర్తించారు, సామాన్యునికి చేరువ కావడానికి వచన కవిత ఉత్తమ పరికరంగా భావించారన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశ్రీ ‘శ్మశానాల వంటి నిఘంటువులను’ ఛందస్సుల సర్పపరిష్వంగాలను’ నిరసించాడని ఎండ్లూరి వివరించారు. ప్రముఖ గజల్ కవి రెంటాల శ్రీవేంకటేశ్వరరావు మాట్లాడుతూ భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహంలో తనను గురించి ‘శతలేఖినీ పద్యసంధాన ధురీణుడినని’ చెప్పుకున్నాడని అన్నారు. పింగళి సూరన రచించిన ‘రాఘవ పాండవీయము’ రామాయణ భారతాలను కలిపి చెప్పిన ద్వ్యర్ధికావ్యమని, ప్రతి పద్యానికి రామాయణ పరంగా, భారత పరంగా భావాన్ని చెప్పుకోవచ్చన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఎస్.టేకి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనవచ్చుగాని, మాజీ గురువు అనకూడదన్నారు. వర్సిటీ ఉపకులపతి ముత్యాలనాయుడు మాట్లాడుతూ సాహిత్యంలో నూతనత్వం అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. పిఠాపురం రాజా వెంకట మహీపతి రామరత్నాకరరావు, వర్సిటీ రిజిస్ట్రార్ కె.రమేష్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ వర్మ, ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి వచనకవితా శతావధాని ర్యాలి ప్రసాద్ ప్రసంగించారు. ముత్యాలనాయుడు జ్యోతిప్రజ్వలనతో సభ ప్రారంభమైంది.