Sagileti Katha Movie
-
Sagileti Katha Review: ‘సగిలేటి కథ’ మూవీ రివ్యూ
టైటిల్: సగిలేటి కథ నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని ,రాజశేఖర్ అనింగి, రమని, రమేష్, సుదర్శన్ తదితరులు నిర్మాణ సంస్థ: షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలు: దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సమర్పణ: నవదీప్ దర్శకత్వం: రాజశేఖర్ సుడ్మూన్ సంగీతం: జశ్వంత్ పసుపులేటి నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్ విడుదల తేది: అక్టోబర్ 13, 2023 కథేంటంటే.. రాయలసీమలోని సగిలేరు అనే గ్రామంలో 2007 ప్రాంతంలో జరిగే కథ ఇది. ఆ గ్రామ పెద్దలు చౌడప్ప(రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ డాక్టర్ దొరసామి(రమేశ్) మంచి స్నేహితులు. చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం) కువైట్ నుంచి అప్పుడే ఊరికి తిరిగొస్తాడు. తొలి చూపులోనే దొరసామి కూతురు కృష్ణవేణి(విషిక కోట)తో ప్రేమలో పడతాడు. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఊర్లో గంగాలమ్మ జాతర ముగిసిన తర్వాత ఇంట్లో ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటారు. ఓ కారణంగా చౌడప్ప తన స్నేహితుడు దొరసామిని నరికి చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కుమార్, కృష్ణవేణిల ప్రేమ కథ ఎలా ముగిసింది? ఊర్లో గంగాలమ్మ జాతర జరిగిందా లేదా? తండ్రిని చంపిన చౌడప్పపై కృష్ణవేణి ఎలా పగ తీర్చుకుంది? చివరకు కుమార్, కృష్ణవేణి ఒక్కటయ్యారా? లేదా? మధ్యలో రోషం రాజు(నరసింహ ప్రసాద్ పంత గాని) చికెన్ కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సీనియర్ జర్నలిస్టు, రచయిత బత్తుల ప్రసాదరావు రాసిన ‘సగిలేటి కథలు’లోని ‘కూరకి సచ్చినోడు’ అనే కథను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాజశేఖర్ సుడ్మూన్. విలేజ్ నెటివిటితో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గ్రామాల్లో ఉండే ప్రేమ, పగ, ద్వేషాలు.. ఇవన్ని తెరపై చక్కగా చూపించాడు. కథ పరంగా సినిమాలో కొత్తగా ఏం ఉండదు. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. కానీ రోషం రాజు కోడి కూర తినడం కోసం పడే పాట్లు మాత్రం నవ్వులు పూయిస్తాయి. గంగాలమ్మ జాతర నిర్వహించాలని పెద్దలు నిర్ణయించకునే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హీరో, హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిన తీరు రొటీన్‌గా ఉంటుంది. మధ్యలో వచ్చే ఫైట్ సీన్, కోడికి ఎత్తుకెళ్లే సన్నివేశం..అంతా సాగదీతగా అనిపిస్తుంది. చౌడప్ప తన స్నేహితుడిని నరికి చంపిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఆ చంపుకునే సన్నివేశమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇక చికెన్ కోసం రోష రాజు పడే పాట్లు, ఈ నేపథ్యంలో సాగే పాట నవ్వులు పూయిస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే.. చివర్లో వచ్చే ట్విస్ట్ మరో ఎత్తు అని చెప్పాలి. అప్పటి వరకు సోసోగా సాగిన కథ, కొన్ని పాత్రలు.. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. లాజిక్కులు వెతకకుండా చూసేవారికి, విలేజ్ నేటివిటీ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. కుమార్ పాత్రలో రవి మహాదాస్యం చక్కగా ఒదిగిపోయాడు. హీరోగా తనకు ఇది తొలి సినిమా అయినా.. యూట్యూబ్ వీడియోలు చేసిన అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తెరపై చూడడానికి పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. ఇక ఆర్ఎంపీ కూతురు కృష్ణవేణిగా విషిక తనదైన నటనతో మెప్పించింది. రోషం రాజు పాత్రలో పంతగాని నరసింహ ప్రసాద్ పండించిన కామెడీ బాగుంది. మిలిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ టీమ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించారు. సంగీతం విషయానికొస్తే.. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. Follow the Sakshi TV channel on WhatsApp -
'సగిలేటి కథ' నుంచి 'చికెన్ సాంగ్' లాంచ్
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తుంది. తాజాగా ఓ క్రేజీ గీతాన్ని విడుదల చేశారు. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) హీరో నవదీప్ ఆధ్వర్యంలో తెలుగు యంగ్ డైరెక్టర్స్ 'బేబీ' ఫేమ్ సాయి రాజేశ్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్.. ఈ సాంగ్ లాంచ్‌కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని, అలానే ఈ మూవీలో కామెడీ అందరిని నవ్విస్తుందని, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ చికెన్ తినాలనిపిస్తుందని నవదీప్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) -
రీలిజ్కి సిద్ధమైన సగిలేటికథ.. సెన్సార్ పూర్తి
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు.ఈ చిత్రం చాలా న్యాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని చిత్రబృందం పేర్కొంది. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమే 'సగిలేటి కథ'
రవి మహాదాస్యం విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో షేడ్ ఎంటర్టైన్మెంట్ , అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. (ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్) రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ ‘రధన్’ చేతుల మీదుగా సాంగ్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సాంగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కొనసాగుతుండగా.. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!) -
ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది: రామ్‌గోపాల్ వర్మ
‘‘సగిలేటి కథ’ సినిమా ట్రైలర్ నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ‘ఏదో జరిగే..’ పాటని అందంగా తీశారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. రవి మహాదాస్యం, విషికా లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. నటుడు నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. జశ్వంత్ పసుపులేటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఏదో జరిగే..’ వీడియో సాంగ్‌ని రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తి వర్మగారే’’ అన్నారు దేవీప్రసాద్ బలివాడ. ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ సుద్మూన్. ‘‘ఏదో జరిగే..’ పాట అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అశోక్ మిట్టపల్లి. సి స్పేస్ కో ఫౌండర్ పవన్ మాట్లాడారు. -
'సగిలేటి కథ' అందరికి నచ్చుతుంది
కథ బాగుంటే చిన్నా-పెద్ద అనే తేడా లేకుండా ఆ చిత్రానికి బ్రహ్మరథం పడతారు తెలుగు ప్రేక్షకులు. ఈ మధ్య విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘సామజవరగమనా’, ‘బేబీ’ చిత్రాలే అందుకు మంచి ఉదాహరణలు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలైన భారీ విజయం సాధించాయి.‘సగిలేటి కథ’ చిత్రం కూడా కచ్చితంగా అందరికి నచ్చుతుందని ధైర్యంగా చెబుతోంది చిత్రబృందం. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి 'రాజశేఖర్ సుద్మూన్' దర్శకత్వం వహించారు. అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ప్రస్తుతం, ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికే 1.5 మిలియన్ల వ్యూస్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. త్వరలోనే ఒక మంచి లవ్ సాంగ్ తో ప్రేక్షకులని అలరించబోతున్నామని వెల్లడించింది. ట్రైలర్ కంటే, మూవీ ఇంకా బాగా ఆకట్టుకుంటుందని ధైర్యంగా చెబుతున్నారు. సెప్టెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.