ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఏలూరు (సెంట్రల్) : స్థానిక సెయింట్ థెరిస్సా డిగ్రీ మహిళా కళాశాలలో మంగళవారం యువజనోత్సవాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి అనేక మంది విద్యార్థినీవిద్యార్థులు హాజరయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సినీ దర్శకుడు మహేంద్ర చక్రవర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన సంభవామి అనే ఏకాంకిక నాటిక విశేషంగా ఆకట్టుకుంది.
త్వరలో 2 లక్షల మందికి వృత్తి శిక్షణ : మంత్రి సుజాత
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వచ్చే జనవరిలో జిల్లాలోని 2 లక్షల మంది యువతకు 12 వృత్తుల్లో వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే జిల్లాకు చెందిన 50 మంది యువతకు ఆర్మీలో ఉద్యోగావకాశాలు లభించడం హర్షణీయమని అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి జిల్లాకు చెందిన 10 మంది యువత ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ మరుగున పడిపోతున్న కళలను పైకి తీసుకువచ్చేందుకు యువజన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ యువత కోసం జిల్లాలో యువజన భవన్ నిర్మించనున్నామని చెప్పారు. యువతకు వివిధ రంగాలలో శిక్షణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ యువజనోత్సవాల్లో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపికైన అభ్యర్థులకు ప్రయాణ, భోజన, వసతి సదుపాయాలన్నీ ఉచితంగా కల్పిస్తామన్నారు. ఏకాంకిక నాటికలో పాల్గొన్న విద్యార్థినులను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. సెట్వెల్ సీఈవో శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.మెర్సి, కల్చరల్ కో ఆర్డినేటర్ బ్రహ్మేశ్వరి పాల్గొన్నారు.