వేటుకు వేళాయే...!
నిబంధనలు ఉల్లంఘించి వేసవి సెలవుల్లోనూ ఇంటర్ తరగతులు
వందకుపైగా ప్రైవేటు కళాశాలలకు షాకాజ్ నోటీసులు
సిటీబ్యూరో: నిబంధనలను ఉల్లంఘించి తరగతులు కొనసాగిస్తున్న ప్రైవేటు జూనియర్ కళాశాలలపై వేటుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం సెలవులు ప్రకటించినా.. పట్టించుకోకుండా పాఠాలు బోధిస్తున్న యాజమాన్యాలపై అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. ఇంటర్ బోర్డు మార్చి 29 నుంచి మే 31 వరకు అన్ని మేనేజ్మెంట్ ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలకు సెలవులు ప్రకటించింది. సెలవుల్లో తరగతులు నిర్వహించినా, ఎంట్రెన్స్ టెస్ట్‌లకు శిక్షణలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొన్ని ప్రైవేటు కళాశాలలు బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటీ, జిప్మర్ ప్రవేశ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని కళాశాలలు మరో అడుగు ముందుకేసి.. విద్యార్థులకు అప్పుడే ద్వితీయ సంవత్సరం పాఠాలను బోధిస్తుండటంతో తనిఖీలకు వెళ్లిన అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గుర్తింపు రద్దు..?
నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న కళాశాలలపై జంట జిల్లాల ఆర్ఐఓ కార్యాలయాలకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాశాలలతోపాటు ఓ మోస్తరు స్థాయి కాలేజీలు కూడా తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆయా కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటివరకు జంట జిల్లాలో వందకు పైగా కళాశాలలకు నోటీసులు అందజేయడం విశేషం. శ్రీచైతన్య, నారాయణ, శ్రీగాయత్రి, ఎన్ఆర్ఐ, గౌతం తదితర కళాశాలలు నిబంధనలు ఉల్లంఘించిన జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 40, రంగారెడ్డి జిల్లాలో 70 కళాశాలల్లో విద్యార్థులను బయటికి పంపించి నోటీసులు జారీ చేసిన అధికారులు కళాశాలల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి బోర్డుకు నివేదిక అందజేశారు. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చాక.. చర్యలు చేపడతామని అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. సెలవులు పూర్తయ్యే వరకు దాడులు కొనసాగుతాయని వారు పేర్కొంటున్నారు.
భిన్న వాదనలు...
సెలవుల్లో తరగతుల నిర్వహణపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులే స్వయంగా తమ పిల్లలను తరగతులకు పంపుతున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పేర్కొం టున్నాయి. అలాంటప్పుడు వారికి బోధించాల్సిన బాధ్యత తమపై ఉందని చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్‌తోపాటు ఎంసెట్, ఏఐఈఈఈ, జిప్మర్ ప్రవేశ పరీక్షలకు ఏడాదంతా ఆయా కళాశాలలు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకుగాను తల్లిదండ్రులు రూ.లక్షల్లో ఫీజులను చెల్లించారు. మరి కొన్ని రోజుల్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నందున, కీలక సమయంలో కళాశాలలు బంద్ చేస్తే తమ పిల్లలు నష్టపోతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అధికారుల తనిఖీల నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహించేందుకు ధైర్యం చేయట్లేదని సమాచారం.