వాళ్ల వద్ద ఏకే 47లు, జీపీఎస్: ఎస్పీ
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడి చేసిన ఉగ్రవాదులను ఆ దాడికి ముందే చూసిన ఏకైక వ్యక్తి.. గురుదాస్‌పూర్ జిల్లా ఎస్పీ సల్వీందర్ సింగ్. ముందురోజే ఉగ్రవాదులు ఆయనమీద దాడిచేసి, ఆయన కారు లాక్కుని అందులోనే పఠాన్‌కోట్ వరకు వెళ్లారు. తొలుత ఎవరో దోపిడీ దొంగల పని అనుకున్నా.. తర్వాత మాత్రం వాళ్లే ఉగ్రవాదులని తెలిసింది. ఎస్పీ సల్వీందర్ సింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ఉన్నట్టుండి తమ కారుకు అడ్డంగా కొందరు రావడంతో కారు ఆపామని, నలుగురైదుగురు వ్యక్తులు తన వద్దకు వచ్చారని ఆయన చెప్పారు. వెనక్కి జరగమని గట్టిగా చెప్పారన్నారు. వాళ్లు మిలటరీ జాకెట్లు వేసుకుని ఉన్నా.. టెర్రరిస్టులేనని అర్థం అయ్యిందన్నారు. ఉర్దూలో మాట్లాడుతూ తమను బాగా వెనకసీటు వద్దకు పంపేసి.. తమ ముఖాలను కూడా కిందకు వంచేశారన్నారు. పైకి చూసినా, ఏమైనా మాట్లాడినా కాల్చిపారేస్తామని బెదిరించినట్లు తెలిపారు. వాళ్ల వద్ద ఏకే-47 తుపాకులు ఉన్నాయని, జీపీఎస్ పరికరాలు కూడా ఉండటంతో పఠాన్‌కోట్ దారి తనను అడగలేదని తెలిపారు.
వాళ్లు ఉర్దూ, హిందీ, పంజాబీ భాషల్లో మాట్లాడారని, తన మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారని అన్నారు. తన కళ్లకు గంతలు కట్టేశారని, దాంతో తర్వాత వాళ్లు ఏ ఫోన్లో మాట్లాడారో, ఏం జరిగిందో చూడలేకపోయానని అన్నారు. వాళ్లు తమ కమాండర్‌తో మాట్లాడినట్లు అర్థమైందని, సలాం, ఆలేకుం సలాం అన్నారని సల్వీందర్ చెప్పారు. అయితే.. వాళ్లకు తాను జిల్లా ఎస్పీనని తెలియదని కూడా ఆయన తెలిపారు.