డిగ్గి గో బ్యాక్ అంటూ దిగ్విజయ్కు నిరసనల స్వాగతం
హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్కు హైదరాబాద్లో సమైక్యవాదుల నుంచి నిరసనల స్వాగతం లభించింది. గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయనకు సమైక్యవాదులు నిరసన తెలిపారు. సమైక్యవాదులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి డిగ్గి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దిగ్విజయ్ను అడ్డుకునేందుకు వస్తున్న సమైక్యవాదులను తెలంగాణ వాదులు అడ్డుకోవటంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక దిగ్విజయ్ సింగ్తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేయనున్నారు. విభజన బిల్లుపై శాసనసభలో చర్చను సజావుగా ముగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. అందులో భాగంగానే దిగ్విజయ్ రాష్ట్రానికి విచ్చేసినట్లు తెలుస్తోంది. విభజన బిల్లుపై చర్చ సాఫీగా, సజావుగా ముగింపచేసి ఎక్కువమంది మద్దతు పలికేలా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో ఆయన మంతనాలు చేయనున్నారు. ఇటీవలి అనారోగ్యానికి గురైన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను దిగ్విజయ్ సింగ్ పరామర్శించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను వారిద్దరు సమీక్షించినట్లు తెలుస్తోంది.