ప్రొఫెసర్ సాంబరెడ్డికి నాటా సత్కారం
ఫిలడెల్పియా : ప్రొఫెసర్ దూదిపాల సాంబ రెడ్డిని నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఘనంగా సత్కరించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన నాటా మెగా కన్వెన్షన్లో నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్సాగర్రెడ్డి, వైద్యరంగంలో డా. సాంబరెడ్డి చేసిన సేవలను కొనియాడి శాలువాతో సత్కరించారు.
వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో డా. సాంబ రెడ్డి జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో ఆరు బంగారు పతకాలతో పట్ట భద్రులయ్యారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లింకా రికార్డు సృష్టించారు. అయన కనిపెట్టిన ఎన్నో ఫార్మసిటికల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి. డా. సాంబ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్ర ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధిచెందిన శాస్త్ర సంస్థలైన ఏఏఏఎస్ (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ సైన్స్), ఏఏపీఎస్ (అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ), ఏఈఎస్ (అమెరికన్ ఎపిలెప్సీ సొసైటీ ) నుంచి "ఫెల్లో" (శాశ్వత సభ్యత్వము) అనే అతి కొద్దీ శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్ట మొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్ రంగాల్లో 180 పేపర్స్, డజన్ కు పైగా మెడికల్ పుస్తకాలు రచించిన ఆయన ఇంటెర్నేషనల్ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు. ఆయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బులపై అధ్యాయనం చేస్తున్నారు. ఫీట్స్ వ్యాధికి ఓ మెడిసిన్ కూడా కనిపెట్టారు. మెదడులోని ఉత్ప్రేరకాలు, సరఫరా వ్యవస్థ విధానంలో ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్మూలనం కోసం 'న్యూరో కోడ్' కనిపెట్టి చరిత్ర సృష్టించారు. మెదడు దెబ్బల నుంచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త 'ఏపిజెనెటిక్' చికిత్స విధానాన్నిఇటీవలే ప్రకటించారు. ఈ మెడికల్ విధానాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది న్యూరోలాజికల్ రోగులకు ఉపయోగపడుతున్నాయి.