same price
-
ఒకే ధరకు పెట్రోల్, డీజిల్ !
న్యూఢిల్లీ: కార్లు, గూడ్స్ వాహనాలుకాని ఇతర వాహనాల విషయంలో డీజిల్, పెట్రోల్‌లకు ఒకే ధరను నిర్ణయించేందుకు వీలుందా? అని తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజిల్ వాహనాల ద్వారా కాలుష్యం పెరిగిపోతోందంటూ పర్యావరణ, కాలుష్య నియంత్రణ సంస్థ (ఈపీసీఏ) వెల్లడించిన నేపథ్యంలో సుప్రీం స్పందించింది. ఇతర భారీ వాహనాలు కాకుండా ప్రైవేటు వాహనాలు, క్యాబ్‌లకు ఒకే ధరలో పెట్రోల్, డీజిల్ అమ్మడంపై వివరాలివ్వాలని ధర్మాసనం సూచించింది. ‘పెట్రోల్, డీజిల్‌లకు ఒకే ధర తీసుకోవాలంటూ పెట్రోల్ పంపులకు ఆదేశాలివ్వగలరా?’ అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో కోర్టుకు అమికస్ క్యూరీగా ఉన్న న్యాయవాది అపరాజితా సింగ్ వాదిస్తూ.. విపరీతమైన కాలుష్యానికి డీజిల్ వాహనాలే కారణమని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కస్టమర్లకు ఐడియా తీపికబురు
న్యూఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు శుభవార్త. టెలికం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐడియా 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లన్నింటికి కూడా ఒకే ధరల్లో డేటా ప్లాన్స్‌ను విక్రయించనుంది. మార్చి ఆఖరు నుంచి ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రారంభించనుంది. ‘1జీబీ అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్స్‌ను 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు సమాన ధరల్లో విక్రయించాలని నిర్ణయించాం. డేటా ప్లాన్స్ ధరల్లో నెట్‌వర్క్‌ను బట్టి మార్పు ఉండదు. 2017, మార్చి 31నుంచి దీనిని అమలుచేస్తున్నాం’ అని ఐడియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌లకు వేర్వేరుగా ఐడియా డేటా ప్లానింగ్స్ ధరలు ఉంటాయి. అయితే, రిలయన్స్ జియో అందిస్తున్న 4జీ మొబైల్ డేటా సర్వీసు ఐడియా 2జీకి ఇచ్చే ధరకంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జియో నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తాజాగా తన నిర్ణయాన్ని ఐడియా మార్చుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.