డబుల్ యాక్షన్..
నేడు కవలల దినోత్సవం
రాముడు-భీముడు..., గంగ-మంగ.., లవ-కుశ...హలోబ్రదర్.... ఇలా డబుల్‌యాక్షన్ సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. సినిమాల్లో కొత్తగా అనిపించినా అలాంటి మనుషులు నిజజీవితంలో తారసపడితే కొద్ది సేపు ఆగి చూస్తాం. కొందరు కలవలల్లో ముఖకవలికలు, తలకట్టు, ప్రవర్తన, మానసిక భావాలు ఒకేలా ఉంటాయి. ఒక్కోసారి తల్లిదండ్రులు సైతం గుర్తుపట్టలేక తికమకపడిపోతుంటారు. బంధువులు సైతం వారిని గుర్తుపట్టలేక అవస్థలు పడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. నేడు కవలల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - మూసాపేట
నిజ జీవితంలోనూ రామలక్ష్మణులే..
కూకట్ పల్లిలో నివాసం ఉంటన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామారావు-లక్ష్మణ్‌రావు అన్నదమ్ములు (కవలలు). చిన్నప్పట్నుంచి ఒకే చోట పెరిగిన వీరి మనస్తత్వాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. స్కూల్లో వీరిలో ఎవరిని కొట్టినా మరొకరు ఏడ్చేవారు. ఒకే బెంచీలో కూర్చోవడటంతో ఉపాధ్యాయులు సైతం ఎవరు తప్పు చేస్తున్నారో గుర్తు పట్టలేకపోయేవారు. వృత్తులు వేరైనా వేతనాలు కూడా ఒక్కటే. నిజజీవితంలోనూ రామలక్ష్మణుల్లాగానే పెరిగారు. ఏ పండుగ వచ్చిన ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకోవాల్సిందే. పెళ్లిలయినా ఇప్పటికీ ఇదే ఆనవాయితీ పాటిస్తున్నారు. అంతేకాదు వీరి భార్యలు కూడా కవలలే కావడం మరో విశేషం.
-రామరావు, లక్ష్మణ్‌రావు, కవలలు.
సేమ్‌టు సేమ్..
హైదర్‌నగర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి, సుభాషిణి దంపతుల కుమార్తెలు సాయిప్రియ-సాయిప్రితీ ( కవలలు) మనుషులు వేరైనా మనస్తత్వాలు ఒక్కటే. వారు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఏ పండుగ వచ్చినా ఇద్దరికీ ఒకే రకమైన డ్రెస్సులు కొన్నాల్సిందే. వీరికి జ్వరాలు కూడా వారం రోజుల వ్యవధిలోనే వస్తుంటాయని తల్లిదండ్రులు తెలిపారు.
- సాయిప్రియ, సాయిప్రితీ. కవలలు.
రోజూ చూసేవాళ్లే పొరబడతారు
మమ్మల్ని బంధువులు, స్నేహితులే కాదు..రోజూ చూసే ఇరుగుపొరుగు కూడా పొరపాటు పడుతుంటారు. ఒక్కోసారి స్నేహితులు, టీచర్లు మా అంతట మేముగా పేర్లు చెప్పేవరకు గుర్తు పట్టలేరు. మా బుగ్గలపై పేర్లు రాయించి మరీ పరీక్షలకు అనుమతిస్తారు. కునాల్ చేసే అల్లరికి నన్ను..నేను చేసే చిలిపి పనులకు కునాల్‌ను పాయింటవుట్ చేయడం సరదాగా ఉంటుంది. - కుశాల్ రాజు
కవలలు అపురూపం
ఎవరికైనా పిల్లలు ప్రతిరూపం..అదే కవలలు పుడితే అపురూపం. ఎక్కడైనా ఒకేలా ఉన్న ఇద్దరిని చూస్తేనే థ్రిల్ ఫీలవుతాం..అదే వారు మన కళ్లముందే తిరుగుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇది దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.
- కాంచనపల్లి రాజేంద్ర రాజు( తండ్రి)
ఎక్కడికెళ్లినా ప్రత్యేకమే..
మేము ఇద్దరం ఒకేలా ఉన్నందున ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తారు. అందరూ మమ్మల్ని ఆశ్చర్యంగా, ప్రత్యేకంగా చూడడం మాకు అనందంగా ఉంటుంది.
- కునాల్ రాజు, 8వ తరగతి, ఒయాసిస్ హైస్కూల్