ప్రముఖ గాయని పెళ్లి చేసుకుంది!
'హల్లో రాక్‌స్టార్' అంటూ మహేశ్‌బాబు సినిమా 'వన్'లో పాటతో దుమ్మురేపిన ప్రముఖ సింగర్ నేహా భాసిన్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. తన ప్రేమికుడైన సంగీత దర్శకుడు సమీర్ ఉద్దిన్‌ను ఇటలీలోని టస్కేనీలో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లుగా పరిచయమున్న ఈ ఇద్దరు బంధుమిత్రుల సమక్షంలో గత నెల 23న వివాహం చేసుకున్నారు.
‘సమీర్ నాకు టీనేజర్‌గా ఉన్పప్పటి నుంచి తెలుసు కానీ, అప్పట్లో మేం కనెక్ట్ కాలేదు. సంగీతం మా ఇద్దరిని ఒక్కటి చేసింది. గత నాలుగేళ్లుగా మా మధ్య స్నేహం కొనసాగుతోంది’ అని నేహా భాసిన్ తెలిపింది. ’తేరా మేరా’ రొమాంటిక్ పాట రికార్డింగ్ సందర్భంగా తొలిసారి నేహా, సమీర్ కలుసుకున్నారు. ఆ తర్వాత పలు ప్రాజెక్టుల్లో అతను తనకెంతో అండగా నిలిచాడని, అలా తమ మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని నేహా తెలిపింది. అమ్మాయిలతో కూడిన మ్యూజిక్ బ్యాండ్ వీవాలో భాగస్వామి అయిన నేహా ఇటీవల వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘జనతా గ్యారేజ్’లోనూ ’యాపిల్ బ్యూటీ’ పాటతో అదరగొట్టింది.