హైటెక్ కాపీయింగ్, విద్యార్థి అరెస్ట్
హైదరాబాద్: టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంటర్ విద్యార్థులు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా బుధవారం ఎస్సార్ నగర్‌లోని ఓ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఒక విద్యార్థి హైటెక్ స్టయిల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయాడు. అతనికి సహకరించిన సమీయుల్లా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నగరానికి చెందిన ఓ విద్యార్థి ఎన్నారై కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన ఇతడు ఈసారి ఎలాగైనా పాస్ కావాలని పట్టుదలతో పథకం వేశాడు. ఇందుకోసం అతడు ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారిని ఆశ్రయించాడు. షాప్‌క్లూస్ సైట్ నుంచి బ్లూటూత్ పరికరం, మైక్రోఫోన్ ఉన్న బనియన్‌ను రూ.13,200 వెచ్చించి కొనుగోలు చేశాడు.
దానిని తొడుక్కుని సివిక్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను దిగ్విజయంగా రాసేశాడు. అతడికి బయటి నుంచి సమాధానాలు ఇస్తూ సమీయుల్లా అనే వ్యక్తి సాయం చేస్తున్నాడు. అదే ఉత్సాహంతో బుధవారం ఎకనామిక్స్ పరీక్ష రాసేందుకు వచ్చాడు. పరీక్షల సూపరింటెండెంట్ తనిఖీల్లో భాగంగా కళాశాలలో విద్యార్థులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు ఓ విద్యార్థిపై అనుమానం వచ్చింది. పోలీసులను పిలిపించి సోదా జరిపించగా హైటెక్ నాటకం బట్టబయలైంది. పోలీసులు విద్యార్థితోపాటు అతనికి సాయం చేసిన వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించి, అరెస్టు చేశారు.