Samuel Anand Kumar
-
సీఎం జగన్ చేతికి బోయ, వాల్మీకి కులాల సమస్యల అధ్యయన నివేదిక
సాక్షి, గుంటూరు: బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్‌కుమార్ చేసిన అధ్యయనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి చేరింది. నివేదిక (పార్ట్ 1)ను సీఎం జగన్‌కు స్వయంగా అందజేశారు శామ్యూల్. సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌ను కలిసి అందజేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే కూడా ఉన్నారు. -
ఆ వార్తలు అవాస్తవం: కలెక్టర్ శామ్యూల్
సాక్షి, గుంటూరు: జిల్లాలో జనవరి 7 నాటికి 2.80 లక్షల ఇళ్ల స్థలాలు, 30 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజుల్లో 20 వేల ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ‘‘స్థలాలను జియో టాగింగ్ చేస్తున్నాం. ప్రత్తిపాడు పాతమల్లాయపాలెంలో ఇరవై ఏడు దరఖాస్తులు వచ్చాయి. అందులో నలుగురు మాత్రమే అర్హులయ్యారు. మిగిలిన వారి పేర్లపై ఇళ్ల స్థలాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఇరవై దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. నలభై మంది లబ్ధిదారులు ఉంటే నలుగురికి మాత్రమే ఇచ్చారని వచ్చిన వార్తలు.. వాస్తవం కాదని’’ ఆయన వివరణ ఇచ్చారు. ఇళ్ళ నిర్మాణానికి అనుమతి వచ్చిన వాటికి శంకుస్థాపన కార్యక్రమాలను చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: కొత్త చట్టాలపై అపోహలొద్దు: జీవీఎల్) జిల్లాలో యూకే నుంచి వచ్చిన వారిని 267 మందిని ట్రేస్ చేశామని, అందరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. యూకే నుండి వచ్చిన వారు.. 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని, ఫ్రాన్స్ నుండి వచ్చిన మహిళకు, ఆమె బంధువులు మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని కలెక్టర్ వెల్లడించారు. (చదవండి: అంతర్వేది: నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి) -
డిశ్చార్జ్ కానున్న 32 మంది కరోనా బాధితులు..
సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా వైరస్ బారినపడిన మరో 32 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారని.. వారిని డిశ్చార్జ్ చేయబోతున్నామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్డౌన్ మరికొన్ని రోజులు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను తొలగించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమన్నారు. జిల్లా మొత్తం కంటైన్మెంట్ జోన్లో ఉందని తెలిపారు. కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని.. నివారణా చర్యలను ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్ వెల్లడించారు. తప్పుడు పోస్టులు పెడితే కఠినచర్యలు: రూరల్ ఎస్పీ విజయరావు నరసరావుపేటలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. జిల్లావాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కరోనాపై సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకంటామని ఎస్పీ హెచ్చరించారు. కఠినంగా లాక్డౌన్: అర్బన్ ఎస్పీ రామకృష్ణ గుంటూరు అర్బన్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు.పోలీసులు ఇచ్చిన పాస్‌లను దుర్వినియోగం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా మొత్తం రెడ్‌జోన్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు. -
లాక్డౌన్: బయటకొస్తే అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి!
సాక్షి, గుంటూరు: జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడా జనసంచారం లేకపోవడంతో బోసిపోయాయి. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతండటంతో అధికారులు కఠిన ఆంక్షల దిశగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జిల్లా వ్యాప్తంగా విధించిన సంపూర్ణ లాక్డౌన్ విజయవంతమైంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు మంగళగిరి ఎన్నారైలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రిని కరోనా ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్, కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, జేసీ దినేష్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. అంతకుమందు జిల్లాలోని లాక్డౌన్ పరిస్థితిని గుంటూరు కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. బయటకొస్తే అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరి! గుంటూరు నగరంతోపాటు, జిల్లా ప్రధాన ప్రాంతాలను పోలీసుల దిగ్బంధించారు. కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు బయటకు వచ్చేవారు సైతం అడ్రస్ ప్రూఫ్ తప్పకుండా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. ఇంటి నుంచి ఒక్క కిలోమీటరు దూరం వరకే అనుమతిస్తున్నారు. హద్దు దాటితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలను వీలైనంత ఎక్కువగా ఇంటిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. అర్బన్ ఎస్పీ రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరంలో నగర కమిషనర్ చల్లా అనురాధ పరిశుద్ధ్య పనులను ముమ్మరం చేయించారు. కరోనా మృతుడికి అంత్యక్రియలు దాచేపల్లి మండలానికి చెందిన వ్యక్తి కరోనా బారిన పడి మృతి చెందాడు. అధికారులు కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇచ్చినా.. ఎవరూ మృతుడిని చూసేందుకు రాలేదు. కుటుంబ సభ్యుల్లో చాలా మంది క్వారంటైన్లో ఉండటంతో అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం శ్మశానవాటికలో దహన సంస్కారం చేశారు. కొరిటెపాడులో ఖననం చేసేందుకు అక్కడి ప్రజలు అభ్యంతరం చెప్పడంతో స్థంభాలగరువులో కార్యక్రమం నిర్వహించారు. కరోనాను జయించి.. గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, అతని భార్యకు తొలుత కరోనా వ్యాధి సోకింది. వారు విజయవాడలోని కోవిడ్–19 ప్రత్యేక విభాగంలో వైద్య చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. వారికి రెండు సార్లు పరీక్ష చేస్తే నెగిటివ్ రావడంతో వైద్యులు ఆదివారం డిశ్చార్జి చేశారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి, అతని భార్యకు తొలుత కరోనా వ్యాధి సోకింది. వారు విజయవాడలోని కోవిడ్–19 ప్రత్యేక విభాగంలో వైద్య చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్నారు. వారికి రెండు సార్లు పరీక్ష చేస్తే నెగిటివ్ రావడంతో వైద్యులు ఆదివారం డిశ్చార్జి చేశారు. వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ఏడు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 82కు చేరింది. నమోదైన ఏడు కొత్త కేసుల్లో ఆరు కేసులు గుంటూరు నగరంలో ఉండటం, కేసుల సంఖ్య 63కు చేరడం కలవరపెడుతోంది. ఆనందపేటలో నాలుగు, పొన్నూరు 60 అడుగులరోడ్డు ప్రాంతంలో ఒకటి, కొరిటెపాడులో ఒక కేసు, మరో కేసు పొన్నూరులో నమోదైంది. ఈ నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేయనున్నారు. జిల్లాలో రోజుకు 800 మందికి కరోనా అనుమానితులకు టెస్టులు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం 20 ప్రత్యేక బృందాలను నియమించారు. వీరు క్వారంటైన్ సెంటర్లు, కంటైన్మెంట్ జోన్లో శాపిళ్లు తీసి పరీక్షలు చేయనున్నారు. ఒక్కో కంటైన్మెంట్ జోన్లో ర్యాపిడ్‌గా వెయ్యి మందికి కరోనా పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. -
గుంటూరు జిల్లాలో రెండో కరోనా మరణం
సాక్షి, గుంటూరు: జిల్లాలో రెండో కరోనా మృతి నమోదయ్యింది. దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలో శనివారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 71కు చేరుకుంది. గుంటూరు నగరంలోనే 53 మందికి పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నగరంలో ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్ సోకింది. (కరోనా మృతదేహాలు: మహారాష్ట్ర కీలక నిర్ణయం!) నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు.. లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ హెచ్చరించారు. రేపు(ఆదివారం) జిల్లాను పూర్తిగా లాక్డౌన్ చేస్తున్నామని.. ఏ షాపులు తెరవడానికి వీలులేదన్నారు. వైద్య సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, గుంటూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ఐదు రకాల కార్డులు, ఏడు కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, వార్డు వలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. పారదర్శకంగా సర్వే, సామాజిక తనిఖీ, గ్రామ సభల ద్వారా వంద శాతం సంతృప్తి స్థాయిలో అర్హుల గుర్తింపుతో వైఎస్సార్ నవశకానికి నాంది పలకనుంది. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాం. ఇప్పటికే వలంటీర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాం. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పనిని పూర్తి చేస్తాం’ అంటూ కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన వైఎస్సార్ నవశకంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఇంటింటి సర్వే ఎలా సాగనుంది? కలెక్టర్ : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు సమగ్ర సర్వే నిర్వహిస్తాం. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ల ద్వారా 16 వేల మంది గ్రామ వలంటీర్లకు, 9 వేల మంది వార్డు వలంటీర్లకు శిక్షణ ఇప్పించాం. బుధవారం సాయంత్రం నుంచి సర్వే ప్రారంభమయ్యింది. సాక్షి : కొత్తగా ఎన్ని రకాల కార్డులు ఇస్తున్నారు? వాటి ఎంపికలు ఎలా జరుగుతాయి? కలెక్టర్ : జిల్లాలో కొత్తగా బియ్యం కార్డు, పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులకు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టాం. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుమానాలు వ్యక్తమైతే సంబంధిత డిపార్టుమెంట్ అధికారులను పంపి, వివరాలను పరిశీలించి చేసి అర్హత ఉందో లేదో మరోసారి నిర్ధారిస్తాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. సాక్షి : ప్రభుత్వం కొత్తగా ఏయే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది? కలెక్టర్ : ప్రభుత్వం ప్రధానంగా జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ మత్య్సకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్ కాపు నేస్తం, టైలర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులకు సంక్షేమ పథకాలు, ఇమామ్, మౌజన్, పాస్టర్, అర్చకులకు గౌరవ వేతనాలు వర్తింపజేసేందుకు అర్హుల జాబితాలను సిద్ధం చేయనున్నాం. సాక్షి : అమ్మఒడికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలు, చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు? కలెక్టర్ : జిల్లాలో అమ్మఒడికి పథకానికిసంబంధించి ఇప్పటికే 6.82 లక్షల మంది విద్యార్థులు ఉండగా, చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాని వారు చాలా తక్కువ సంఖ్యలో (దాదాపు పది వేలలోపు) మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎంలు అమ్మఒడి విరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తాం. సాక్షి : సర్వే ప్రక్రియను ఎలా నిర్వహిస్తున్నారు? కలెక్టర్ : వైఎస్సార్ నవశకంలో భాగంగా నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి అర్హుల జాబితాను ప్రచురిస్తాం. జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సూచనలను డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు స్వీకరిస్తాం. డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా పార్టీలకతీతంగా వంద శాతం సంతృప్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడతాం. ఎంపికైన వారి జాబితాను శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో ప్రదర్శిస్తాం. అర్హులైన వారందరికీ జనవరి 1వ తేదీ నాటికి కొత్త కార్డులను జారీ చేస్తాం. సాక్షి : సర్వే ఏర్పాట్లు ఎలా చేశారు? కలెక్టర్ : జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించేందుకు వీలుగా ఆయా శాఖల అధికారులు, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశాం. వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సాక్షి :గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయా? కలెక్టర్ : ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాగా, మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను సైతం భర్తీ చేసి పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకనుగుణంగా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
సంక్షేమం.. పారదర్శకతే లక్ష్యం
‘ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుతం రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే కొనసాగుతోంది. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చేస్తున్నాం. భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. ఇసుక కొరతను అధిగమించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఇసుక కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కలెక్టర్: జిల్లాలో ఎన్జీటీ తీర్పుతోపాటు కృష్ణానదికి వరద రావడంతో కొంత మేర ఇసుక కొరత తలెత్తింది. దీన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మరో తొమ్మిది కొత్త రీచ్‌లకు కూడా ప్రతిపాదనలు పంపాం. ఐదు స్టాక్ యార్డులను సిద్ధం చేస్తున్నాం. మున్నంగిలో వే బ్రిడ్జితో అన్ని ఏర్పాట్లు చేశాం. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గగానే స్టాక్ యార్డులకు ఇసుక తరలించి, అవసరమైన వారికి సరఫరా చేస్తాం. ప్రజలకు కోరినంత ఇసుకను పారదర్శకంగా అందిస్తాం. సాక్షి : రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే ఎలా సాగుతోంది? కలెక్టర్: జిల్లాలో రైతు భరోసా పథకం లబ్ధిదారుల గుర్తింపునకు సంబంధించి గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేస్తున్నాం. ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తాం. అనర్హులను తొలగిస్తాం. అర్హులై ఉండి పీఎం కిసాన్ జాబితాలో చోటు చేసుకోని వారికి చోటు కల్పిస్తాం. రైతు భరోసా ద్వారా భూమి లేని కౌలు రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. దీని ద్వారా జిల్లాలో నాలుగు లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయి. రైతు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.12,500 అందించనున్నాం. సాక్షి : సచివాలయాల ఏర్పాటు వివరాలు ఏమిటి? కలెక్టర్: అక్టోబర్ 2వ తేదీన జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జిల్లాలో 57 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను ప్రారంభించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నగర, పట్టణాల్లో ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీగా బొల్లాపల్లి మండలంలోని మూగచింతల గ్రామాన్ని ఎంపిక చేశాం. జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య, జిల్లా మంత్రులతో అక్కడ లాంఛనంగా మోడల్ సచివాలయాన్ని ప్రారంభిస్తాం. సచివాలయాలకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లను అందుబాటులో ఉంచాం. గ్రామ, నగర, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను గుర్తించాం. నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. సాక్షి : ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందా? కలెక్టర్: పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక ముమ్మరంగా జరుగుతోంది. గ్రామ వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, ఇంటి స్థలాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. ప్రజా సాధికారిక సర్వే ప్రకారం ఆరు స్థాయిల్లో జాబితాను పరిశీలిస్తున్నాం. 2.12 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, పక్కాఇళ్లు అందించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. సాక్షి : ఆర్థిక సాయం కోసం ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? కలెక్టర్: జిల్లాలో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈనెల 25వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందిన దరఖాస్తులను ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తాం. అక్టోబర్ నాల్గో తేదీ నుంచి సహాయం అందిస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు 9,200 దరఖాస్తులు వచ్చాయి. సాక్షి : జిల్లాలో పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది? కలెక్టర్: జిల్లాలో పశ్చి డెల్టా, నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా ఆయకట్టుకు సాగు నీరు పుష్కలంగా అందిస్తున్నాం. ఎన్ఎస్పీ పరిధిలో అన్ని చెరువులనూ పూర్తిగా నింపాం. ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, పురుగు మందులు అందిస్తున్నాం. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వ్యాపారులకు, వ్యవసాయ అధికారులను హెచ్చరించాం. కృష్ణానది వరదతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.13.5 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపాం. సాక్షి : స్పందనలో వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారు? కలెక్టర్: స్పందనలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. స్పందన కార్యక్రమంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పందనలో ఫిర్యాదుచేస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందనే భరోసాను ప్రజలకు కల్పించగలిగాం. సాక్షి : భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? కలెక్టర్: జిల్లాలో ఎక్కువ శాతం భూ సమస్యలే ఉన్నాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను ఆధునికీకరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో సర్వే చేసి రికార్డులను ప్రక్షాళన చేయనున్నాం. దీని ద్వారా ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో కొత్తగా వచ్చే సర్వే అసిస్టెంట్ల ద్వారా అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి ఇందులో వారిని భాగస్వాములను చేస్తాం. సాక్షి : పారిశుద్ధ్యం, సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? కలెక్టర్ : జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. -
ఔటర్’కు వీడిన గ్రహణం
శామీర్‌పేట-కీసర మార్గానికి రీ టెండర్ రూ.190కోట్ల వ్యయంతో తాజా అంచనాలు జూలై మొదటి వారంలో బిడ్స్‌కు ఆహ్వానం సాక్షి, సిటీబ్యూరో : అతుకుల బొంతగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 2015 డిసెంబర్ నాటికి మొత్తం ఔటర్ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శామీర్‌పేట-కీసర (10.3కి.మీ) మార్గంలో మిగిలిపోయిన నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.190 కోట్ల వ్యయ అంచనాతో కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేశారు. శామీర్‌పేట-కీసర మార్గంలో ఏడేళ్లుగా నిలిచిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు జూలై మొదటి వారంలో రీ టెండర్‌ను పిలవనున్నట్లు ఓఆర్ఆర్ ప్రాజెక్టు డెరైక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. ఇది గ్లోబల్ టెండర్ కనుక బిడ్స్ దాఖలుకు నిర్దిష్ట సమయం ఇచ్చి, వచ్చే సెప్టెంబర్‌లో కాంట్రాక్టు సంస్థను ఖరారు చే యాలని అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ఏజెన్సీ ఖరారైన వెంటనే జాప్యానికి తావివ్వకుండా అగ్రిమెంట్ చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు నిర్మాణ గడువును పొడిగించిన అధికారులు ఈసారి 2015 డిసెంబర్ నాటికి ఔటర్తో పాటు సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించారు. శామీర్‌పేట-కీసర మార్గంలో భూసేకరణ, విద్యుత్లైన్ల షిప్టింగ్ వంటి అడ్డంకులేవీ లేనందున అగ్రిమెంట్ చేసుకొన్న 15 నెలల్లోగా మొత్తం 10.3 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఈ మార్గంలో ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయినందున మిగతా పనులు చకచకా జరిగిపోతాయని అధికారులతో పాటు సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఆదిలోనే అశ్రద్ధ... శామీర్‌పేట్-కీసర రీచ్‌ను మొదట్లో దక్కించుకున్న యూజీసీ సంస్థతో సకాలంలో పనులు చేయించుకోవడంలో హెచ్‌జీసీఎల్ సంస్థ ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానమే ఇప్పుడు రూ.100 కోట్లు అదనపు భారం హెచ్ఎండీఏపై పడింది. నిజానికి 2009లో శామీర్‌పేట్-కీసర రీచ్‌ను 17 శాతం లెస్తో కోట్ చేసిన యూజీసీ సంస్థ రూ.195 కోట్లతో టెండర్‌ను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2012 నవంబర్ నాటికి ఈ రీచ్ నిర్మాణం పూర్తికావాలి. అయితే మెటీరియల్ కాస్ట్ అనూహ్యంగా పెరగడం, అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాల వల్ల నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసి నిర్మాణ గడువును 2014 మార్చి వరకు పొడిగించారు. అయినా పనుల్లో ప్రగతి కనిపించకపోవడంతో 2014 ఏప్రిల్ 2న యూజీసీ కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన (టెర్మినేట్) పలికారు. ఇప్పుడు ఆ మార్గంలో మిగిలిపోయిన పనులు పూర్తిచేసేందుకు హెచ్‌జీసీఎల్ తాజాగా రీ టెండర్లు పిలిచింది. పాత టెండర్ ప్రకారం 10.3 కిలోమీటర్ల మార్గంలో మిగిలిపోయిన పనులకు రూ.100 కోట్లు ఖర్చవుతుం డగా, కొత్త ఎస్టిమేట్స్ ప్రకారం ఆ పను లుపూర్తి చేయడానికి రూ.190 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈ భారమంతా పరోక్షంగా నగరవాసులపై పడినట్లే. 15నెలల గడువు: పీడీ శామీర్‌పేట-కీసర మార్గంలో మిగిలిపోయిన పనులను పూర్తిచేసేందుకు వారం రోజుల్లో రీ టెండర్ పిలుస్తున్నామని ఓఆర్ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో ముగించి అర్హత గల సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని 15 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశిస్తామన్నారు. ఈసారి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2015 డిసెంబర్ నాటికి మొత్తం 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డును, సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ఇప్పటికే 50శాతం పనులు పూర్తయినందున మిగతావి నిర్ణీత సమయంలో అయిపోతాయని తెలిపారు.