ఔటర్’కు వీడిన గ్రహణం
- శామీర్‌పేట-కీసర మార్గానికి రీ టెండర్
- రూ.190కోట్ల వ్యయంతో తాజా అంచనాలు
- జూలై మొదటి వారంలో బిడ్స్‌కు ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో : అతుకుల బొంతగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. 2015 డిసెంబర్ నాటికి మొత్తం ఔటర్ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శామీర్‌పేట-కీసర (10.3కి.మీ) మార్గంలో మిగిలిపోయిన నిర్మాణాన్ని పునఃప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.190 కోట్ల వ్యయ అంచనాతో కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
శామీర్‌పేట-కీసర మార్గంలో ఏడేళ్లుగా నిలిచిపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు జూలై మొదటి వారంలో రీ టెండర్‌ను పిలవనున్నట్లు ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు డెరైక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. ఇది గ్లోబల్ టెండర్ కనుక బిడ్స్ దాఖలుకు నిర్దిష్ట సమయం ఇచ్చి, వచ్చే సెప్టెంబర్‌లో కాంట్రాక్టు సంస్థను ఖరారు చే యాలని అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ఏజెన్సీ ఖరారైన వెంటనే జాప్యానికి తావివ్వకుండా అగ్రిమెంట్ చేసుకొని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే రెండుసార్లు నిర్మాణ గడువును పొడిగించిన అధికారులు ఈసారి 2015 డిసెంబర్ నాటికి ఔటర్‌తో పాటు సర్వీసు రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించారు. శామీర్‌పేట-కీసర మార్గంలో భూసేకరణ, విద్యుత్‌లైన్ల షిప్టింగ్ వంటి అడ్డంకులేవీ లేనందున అగ్రిమెంట్ చేసుకొన్న 15 నెలల్లోగా మొత్తం 10.3 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఈ మార్గంలో ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయినందున మిగతా పనులు చకచకా జరిగిపోతాయని అధికారులతో పాటు సిబ్బంది అంచనా వేస్తున్నారు.
ఆదిలోనే అశ్రద్ధ...
శామీర్‌పేట్-కీసర రీచ్‌ను మొదట్లో దక్కించుకున్న యూజీసీ సంస్థతో సకాలంలో పనులు చేయించుకోవడంలో హెచ్‌జీసీఎల్ సంస్థ ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానమే ఇప్పుడు రూ.100 కోట్లు అదనపు భారం హెచ్‌ఎండీఏపై పడింది. నిజానికి 2009లో శామీర్‌పేట్-కీసర రీచ్‌ను 17 శాతం లెస్‌తో కోట్ చేసిన యూజీసీ సంస్థ రూ.195 కోట్లతో టెండర్‌ను దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2012 నవంబర్ నాటికి ఈ రీచ్ నిర్మాణం పూర్తికావాలి. అయితే మెటీరియల్ కాస్ట్ అనూహ్యంగా పెరగడం, అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాల వల్ల నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సుమారు రూ.100 కోట్ల విలువైన పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత చేతులెత్తేశారు.
దీంతో అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసి నిర్మాణ గడువును 2014 మార్చి వరకు పొడిగించారు. అయినా పనుల్లో ప్రగతి కనిపించకపోవడంతో 2014 ఏప్రిల్ 2న యూజీసీ కాంట్రాక్టు సంస్థకు ఉద్వాసన (టెర్మినేట్) పలికారు. ఇప్పుడు ఆ మార్గంలో మిగిలిపోయిన పనులు పూర్తిచేసేందుకు హెచ్‌జీసీఎల్ తాజాగా రీ టెండర్లు పిలిచింది. పాత టెండర్ ప్రకారం 10.3 కిలోమీటర్ల మార్గంలో మిగిలిపోయిన పనులకు రూ.100 కోట్లు ఖర్చవుతుం డగా, కొత్త ఎస్టిమేట్స్ ప్రకారం ఆ పను లుపూర్తి చేయడానికి రూ.190 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈ భారమంతా పరోక్షంగా నగరవాసులపై పడినట్లే.
15నెలల గడువు: పీడీ
శామీర్‌పేట-కీసర మార్గంలో మిగిలిపోయిన పనులను పూర్తిచేసేందుకు వారం రోజుల్లో రీ టెండర్ పిలుస్తున్నామని ఓఆర్‌ఆర్ పీడీ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో ముగించి అర్హత గల సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని 15 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశిస్తామన్నారు. ఈసారి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 2015 డిసెంబర్ నాటికి మొత్తం 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డును, సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ఇప్పటికే 50శాతం పనులు పూర్తయినందున మిగతావి నిర్ణీత సమయంలో అయిపోతాయని తెలిపారు.