సంక్షేమం.. పారదర్శకతే లక్ష్యం  | Guntur Collector Samuel Anand Special Interview | Sakshi
Sakshi News home page

సంక్షేమం.. పారదర్శకతే లక్ష్యం 

Published Wed, Sep 25 2019 9:55 AM | Last Updated on Wed, Sep 25 2019 9:55 AM

Guntur Collector Samuel Anand Special Interview - Sakshi

‘ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుతం రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే కొనసాగుతోంది. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చేస్తున్నాం. భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. ఇసుక కొరతను అధిగమించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం’ అని కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్‌ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మంగళవారం ప్రత్యేకంగా మాట్లాడారు.   
 
సాక్షి : ఇసుక కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? 
కలెక్టర్‌: జిల్లాలో ఎన్జీటీ తీర్పుతోపాటు కృష్ణానదికి వరద రావడంతో కొంత మేర ఇసుక కొరత తలెత్తింది. దీన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో మరో తొమ్మిది కొత్త రీచ్‌లకు కూడా ప్రతిపాదనలు పంపాం. ఐదు స్టాక్‌ యార్డులను సిద్ధం చేస్తున్నాం. మున్నంగిలో వే బ్రిడ్జితో అన్ని ఏర్పాట్లు చేశాం. కృష్ణా నదిలో ప్రవాహం తగ్గగానే స్టాక్‌ యార్డులకు ఇసుక తరలించి, అవసరమైన వారికి సరఫరా చేస్తాం. ప్రజలకు కోరినంత ఇసుకను 
పారదర్శకంగా అందిస్తాం. 

సాక్షి : రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక సర్వే ఎలా సాగుతోంది?
కలెక్టర్‌:  జిల్లాలో రైతు భరోసా పథకం లబ్ధిదారుల గుర్తింపునకు సంబంధించి గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాల ద్వారా సర్వే చేస్తున్నాం. ప్రధాన మంత్రి కిసాన్‌ యోజనకు ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తాం. అనర్హులను తొలగిస్తాం. అర్హులై ఉండి పీఎం కిసాన్‌ జాబితాలో చోటు చేసుకోని వారికి చోటు కల్పిస్తాం. రైతు భరోసా ద్వారా భూమి లేని కౌలు రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. దీని ద్వారా జిల్లాలో నాలుగు లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతాయి. రైతు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.12,500 అందించనున్నాం. 

సాక్షి : సచివాలయాల ఏర్పాటు వివరాలు ఏమిటి?
కలెక్టర్‌:  అక్టోబర్‌ 2వ తేదీన జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అందుబాటులోకి రానుంది. జిల్లాలో 57 మండలాల్లో మండలానికి ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలను ప్రారంభించేం దుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నగర, పట్టణాల్లో ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో మోడల్‌ గ్రామ పంచాయతీగా బొల్లాపల్లి మండలంలోని మూగచింతల గ్రామాన్ని ఎంపిక చేశాం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పేర్ని వెంకట్రామయ్య, జిల్లా మంత్రులతో అక్కడ లాంఛనంగా మోడల్‌ సచివాలయాన్ని ప్రారంభిస్తాం. సచివాలయాలకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్‌లను అందుబాటులో ఉంచాం. గ్రామ, నగర, పట్టణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలను గుర్తించాం. నవంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తాం. 

సాక్షి : ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందా?
కలెక్టర్‌:  పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక ముమ్మరంగా జరుగుతోంది. గ్రామ వలంటీర్లు, రెవెన్యూ సిబ్బంది ద్వారా నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు, ఇంటి స్థలాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. ప్రజా సాధికారిక సర్వే ప్రకారం ఆరు స్థాయిల్లో జాబితాను పరిశీలిస్తున్నాం. 2.12 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, పక్కాఇళ్లు అందించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ శాఖ పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. 

సాక్షి : ఆర్థిక సాయం కోసం ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు? 
కలెక్టర్‌:  జిల్లాలో ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈనెల 25వ తేదీ వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందిన దరఖాస్తులను ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు పరిశీలిస్తాం. అక్టోబర్‌ నాల్గో తేదీ నుంచి సహాయం అందిస్తాం. జిల్లాలో ఇప్పటి వరకు 9,200 దరఖాస్తులు వచ్చాయి. 

సాక్షి : జిల్లాలో పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది?
కలెక్టర్‌: జిల్లాలో పశ్చి డెల్టా, నాగార్జున సాగర్‌ కుడికాలువ ద్వారా ఆయకట్టుకు సాగు నీరు పుష్కలంగా అందిస్తున్నాం. ఎన్‌ఎస్పీ పరిధిలో అన్ని చెరువులనూ పూర్తిగా నింపాం. ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, పురుగు మందులు అందిస్తున్నాం. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే వ్యాపారులకు, వ్యవసాయ అధికారులను హెచ్చరించాం. కృష్ణానది వరదతో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.13.5 కోట్ల పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదిక పంపాం. 

సాక్షి : స్పందనలో వచ్చిన దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నారు?
కలెక్టర్‌:  స్పందనలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. స్పందన కార్యక్రమంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పందనలో ఫిర్యాదుచేస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందనే భరోసాను ప్రజలకు కల్పించగలిగాం. 

సాక్షి : భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు?
కలెక్టర్‌:  జిల్లాలో ఎక్కువ శాతం భూ సమస్యలే ఉన్నాయి. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను ఆధునికీకరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో సర్వే చేసి రికార్డులను ప్రక్షాళన చేయనున్నాం. దీని ద్వారా ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో కొత్తగా వచ్చే సర్వే అసిస్టెంట్‌ల ద్వారా అసిస్టెంట్‌లకు శిక్షణ ఇచ్చి ఇందులో వారిని భాగస్వాములను చేస్తాం.

సాక్షి : పారిశుద్ధ్యం, సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
కలెక్టర్‌ : జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వారికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement