Sandeep Deekshit
-
గెలుపుపై ఎవరి ధీమా వారిదే!
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాన్స్ యమునా ప్రాంతం రూపురేఖలు కామన్వెల్త్ క్రీడల తరువాత మారిపోతే ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో మారిపోయాయి. కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, ముఖ్యమంత్రి తనయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం వల్ల గడచిన పదేళ్లలో ఈ నియోజకవర్గం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధినే సిట్టింగ్ ఎంపీ సందీప్ దీక్షిత్ తన ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశంగా చేసుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ ప్రచారం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడవలసిందే. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు ఓటర్లు కాంగ్రెస్ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ విషయం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనే తేటతెల్లమయింది. మురికివాడలు, పునరావాస కాలనీల ఓటర్లు కాంగ్రెస్‌ను వదిలి ఆప్‌కు ఓటు వేయడం వల్లనే ఆప్ ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిలో గెలిచింది. ఇప్పుడా పార్టీ ముస్లిం, దళిత ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడింది. ఇక్కడున్న రెండు రిజర్వుడ్ సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కే దక్కాయి. 49 రోజుల పాలన తరువాత ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల భ్రమలు తొలగిపోయాయని, ఈసారి కూడా గెలుపు కాంగ్రెస్ దేనని సందీప్ దీక్షిత్ అంటున్నారు. వాస్తవానికి మాత్రం పరిస్థితి భిన్నంగా కనబడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నుంచి గాంధీజీ మనవడు రాజ్‌మోహన్ గాంధీని బరిలోకి దింపింది. మిగతా రెండు పార్టీల కన్నా ముందుగా ఆప్ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో ప్రచారంలో ఆయనే ముందున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఐదు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆప్ కార్యకర్తలు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో అనుబంధం ఉన్న మహేశ్‌గిరి తూర్పుఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. అట్టడుగు స్థాయిలో తాను మూడేళ్లుగా పనిచేస్తున్నానని, విజయం తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభావంపైనే మహేశ్‌గిరి గెలుపు ఆధారపడి ఉందన్నది వాస్తవం. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు జరిగిన 12 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు సార్లు గెలిచినప్పటికీ తూర్పు ఢిల్లీని ప్రధానంగా బీజేపీ నియోజకవర్గంగా పేర్కొంటారు. బీజేపీ కంచుకోటగా చెప్పుకునే ఈ నియోజకవర్గం ఈసారి కమల నాథుల వశమతుందో లేదో చూడాలి. -
మా వైఖరిలో మార్పు లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయంలో మార్పు లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ సోవువారం స్పష్టం చేశారు. తెలంగాణపై పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించుకొంటే,... ఆ అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకొంటుందన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో వూట్లాడారు. విభ జనతో తలెత్తే కీలకాంశాలపై సంప్రదింపుల ద్వారా కనుగొనే పరిష్కారాలను ఆంటోనీ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుందని, తెలంగాణ ముసాయిదా బిల్లు రూపకల్పనలో, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొంటుందని సందీప్ దీక్షిత్ చెప్పారు. నేరచరితుల రక్షణకు రూపొందించిన ఆర్డినెన్స్ అర్థరహితమైనదని, దాన్ని చించివేసి, విసిరేయూలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరినట్లుగా, తెలంగాణ తీర్మానాన్ని కూడా చించి, విసిరేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయుడాన్ని విలేకరులు ప్రస్తావించగా, తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే కాంగ్రెస్ వైఖరి అని దీక్షిత్ స్పష్టంచేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం అమలులో ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడాన్ని ప్రశ్నించినపుడు,... విభజన అంశాలపై ఆంటోనీ కమిటీ చర్చలు జరుపుతోందని, అరుుతే, చర్చల ప్రక్రియ వివరాలు తనకు తెలియువని చెప్పారు. ముసాయిదా బిల్లు తయారీపై కేంద్ర హోమ్‌శాఖ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందన్నారు. ఆంటోనీ కమిటీ పనిపూర్తయ్యేంత వరకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని చెప్పడంలేదని మరో ప్రశ్నకు సమాధానంగా దీక్షిత్ చెప్పారు. విభజనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలేవీ ఇంకా ఆమోదం పొందలేదని, అవి లోక్‌సభ స్పీకర్ పరిశీలనలో ఉన్నాయో లేక వారు, ఉపసంహరించుకొన్నారో కూడా తనకు తెలియదని విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా దీక్షిత్ చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి రాజీనామా ఆమోదంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
'తప్పని పరిస్థితుల్లోనే ఎంపీల సస్పెన్షన్'
ఢిల్లీ: తప్పనిసరి పరిస్థితుల్లోనే సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ చెప్పారు. అన్ని పార్టీలతో సంప్రదించాకే ఎంపీలపై సస్పెన్షన్ వేటువేసినట్లు తెలిపారు. 15 రోజులుగా 10 మంది ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపచేయడం భావ్యం కాదన్నారు. ఎంపీల ఆందోళన కారణంగా సభా కార్యక్రమాలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. సస్పెన్షన్‌పై చర్చించేందుకే స్పీకర్ రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం కాంగ్రెస్ ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదన్నారు. రాజధాని, జలవనరులు, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణకు ఇది సరైన సమయం కాదన్న బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు సరికావన్నారు.