sangreddy
-
ముందు సమస్యలు పరిష్కరించండి: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ‘నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. ముందు ప్రజల సమస్యలను పరిష్కరించండి’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి బుధవారం వరకు జిల్లా కలెక్టరేట్ లేదా ఐబీ వద్ద శాంతియుత ధర్నా చేపడతామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా తాగునీటి సమస్యలపై ఎంతగా పోరాడినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగూరు జలాలను తరలించడం వల్లే ఈ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. సింగూరు జలాల తరలింపును అడ్డుకోటానికి తాను ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టిచుకోలేదన్నారు. తాను ప్రజల కోసం పోరాడితే టీఆర్ఎస్ నాయకులు తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందులు సమసిపోవాలంటే గోదావరి నీళ్లను పఠాన్ చెరువు నుంచి సంగారెడ్డికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరానని జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో పీజీ చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, ఇది దృష్టిలో ఉంచుకుని తక్షణమే పీజీ కళశాల తరలింపును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
లేజీఎస్!
రాయికోడ్(అందోల్): ఈజీఎస్ (ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం) పనులు జిల్లాలోని ఆయా మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు సంబంధించి కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. నాడెం కంపోస్టు పిట్స్, పాఠశాలల కిచెన్ షెడ్స్, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, సేద్యపు నీటి గుంతలు, డంపింగ్ యార్డులు తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2016 నుంచి ఆయా రకాల పనులు మంజూరైనా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేక, బిల్లులు సకాలంలో అందుతాయనే భరోసా లేక మంజూరైన పనులు నిదానంగా నడుస్తున్నాయి. సేద్యపు నీటి గుంతలు.. జిల్లాలో 3,031 సేద్యపు నీటి గుంతలకు 777 గుంతలే వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సేద్యపు నీటి గుంతలను నిర్మింపజేసి పంటల సాగులో రైతులు ఎదుర్కొనే నీటి ఇబ్బందులను తీర్చాల్సి ఉండగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. పూర్తికాని పశువుల పాకలు.. జిల్లాలోని ఆయా మండలాల్లో 558 నిర్మించాల్సి ఉండగా 55 పశువుల పాకలు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పశువుల పాకలు లేక పోషకులు తాము పోషిస్తున్న పశువులను ఆరుబయట కట్టేస్తున్నారు. ఈ దశలో పశువులు, పోషకుల ప్రయోజనం కోసం మంజూరు చేసిన పాకలు పూర్తి చేయడంలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. 306 మాత్రమే పూర్తయిన కంపోస్ట్ పిట్స్.. 1,333 నాడెం కంపోస్టు పిట్స్ మంజూరు కాగా 306 మాత్రమే ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకుడు గుంతలు అంతంతే.. 53,138 ఇంకుడు గుంతలు మంజూరవగా ఇప్పటివరకు 22,013 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంకుడుగుంతల నిర్మాణం చురుగ్గా సాగుతున్న పరిస్థితులు లేవు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. పూర్తికాని డంపింగ్ యార్డులు.. జిల్లాకు 330 డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. ఇందులో 142 డంపింగ్ యార్డులు మాత్రమే ప్రారంభమయ్యాయి. డంపింగ్ యార్డుల నిర్మాణంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే వాదనలు వినవస్తున్నాయి. పూర్తయిన కిచెన్ షెడ్లు 128 మాత్రమే.. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 539 కిచెన్ షెడ్లు మంజూరు చేయగా 128 మాత్రమే పూర్తయినట్లు ఈజీఎస్ అధికారులు వెల్లడించారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వివిధ రకాల పనులు మంజూరవుతున్నా వాటిని పూర్తి చేయడంలోనే లోపాలు కనిపిస్తున్నాయి. కొరవడిన పర్యవేక్షణ.. ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ లేక ఆశించిన స్థాయి లో పనుల్లో పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో ఈజీఎస్ పనులపై సరైన అవగాహన కల్పిస్తే ఆశిం చిన లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో పనుల పురోగతి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా పటిష్ట ప్రణాళికలు వేసి మంజూరైన అన్నిరకాల ఈజీఎస్ పనులను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. -
భూపాలుడూ పాయే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో మొత్తంగా తుడుచుకుపెట్టుకుపోయిన జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరో గట్టిదెబ్బ తగిలింది. ఏకంగా డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కూడా బుధవారం కేసీఆర్ సమక్షంలో గులాబీదళంలో చేరడంతో ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఆయన ప్లేట్ ఫిరాయించడంతో పార్టీ శ్రేణులన్నీ ఆలోచనలో పడిపోయాయి. అంతా ఆలోచించాకే జంప్ మూడు నాలుగు రోజుల నుంచి అత్యంత రహస్యంగా టీఆర్ఎస్ నాయకులతో చర్చలు జరిపిన భూపాల్‌రెడ్డి..మంగళవారమే గుట్టుచప్పుడు కాకుండా డీసీసీ పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గం నుంచి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ను పక్కనపెట్టి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ కలిశారు. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపింది. దీంతో అప్పటి నుంచే పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భూపాల్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2009లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండవసారి ఎంపికైన భూపాల్‌రెడ్డి పదవీకాలం 2015 వరకు ఉన్నప్పటికీ, ఆయన మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తుండడం వల్లే పార్టీ మారినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నప్పటికి, అధికారం పీఠం టీఆర్ఎస్కు దక్కడంతో ఇతర పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎక్కువగా ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీన్ని ముందే అంచనా వేసినా భూపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం మళ్లీ ఆయనే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వ్యక్తులు వెళ్లినంత మాత్రన కాంగ్రెస్‌కు నష్టం లేదు కొంత మంది వ్యక్తులు, నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ లేదు. ఎవరు అవునన్నా...కాదన్న సోనియా గాంధీ పట్టుబట్టి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు అది తెలుసు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసిన పథకాలను ప్రజలు మరిచిపోలేదు. రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. -పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి