భూపాలుడూ పాయే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో మొత్తంగా తుడుచుకుపెట్టుకుపోయిన జిల్లా కాంగ్రెస్ పార్టీకి మరో గట్టిదెబ్బ తగిలింది. ఏకంగా డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కూడా బుధవారం కేసీఆర్ సమక్షంలో గులాబీదళంలో చేరడంతో ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఆయన ప్లేట్ ఫిరాయించడంతో పార్టీ శ్రేణులన్నీ ఆలోచనలో పడిపోయాయి.
అంతా ఆలోచించాకే జంప్
మూడు నాలుగు రోజుల నుంచి అత్యంత రహస్యంగా టీఆర్‌ఎస్ నాయకులతో చర్చలు జరిపిన భూపాల్‌రెడ్డి..మంగళవారమే గుట్టుచప్పుడు కాకుండా డీసీసీ పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ను పక్కనపెట్టి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ కలిశారు. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపింది. దీంతో అప్పటి నుంచే పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భూపాల్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా, టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2009లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండవసారి ఎంపికైన భూపాల్‌రెడ్డి పదవీకాలం 2015 వరకు ఉన్నప్పటికీ, ఆయన మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తుండడం వల్లే పార్టీ మారినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నప్పటికి, అధికారం పీఠం టీఆర్‌ఎస్‌కు దక్కడంతో ఇతర పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎక్కువగా ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. దీన్ని ముందే అంచనా వేసినా భూపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం మళ్లీ ఆయనే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
వ్యక్తులు వెళ్లినంత మాత్రన కాంగ్రెస్‌కు నష్టం లేదు
కొంత మంది వ్యక్తులు, నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ లేదు. ఎవరు అవునన్నా...కాదన్న సోనియా గాంధీ పట్టుబట్టి తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు అది తెలుసు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అమలు చేసిన పథకాలను ప్రజలు మరిచిపోలేదు. రానున్న రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
-పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి