సాక్షి, సంగారెడ్డి: ‘నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. ముందు ప్రజల సమస్యలను పరిష్కరించండి’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి బుధవారం వరకు జిల్లా కలెక్టరేట్ లేదా ఐబీ వద్ద శాంతియుత ధర్నా చేపడతామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా తాగునీటి సమస్యలపై ఎంతగా పోరాడినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
సింగూరు జలాలను తరలించడం వల్లే ఈ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. సింగూరు జలాల తరలింపును అడ్డుకోటానికి తాను ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టిచుకోలేదన్నారు. తాను ప్రజల కోసం పోరాడితే టీఆర్‌ఎస్ నాయకులు తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి ఇబ్బందులు సమసిపోవాలంటే గోదావరి నీళ్లను పఠాన్ చెరువు నుంచి సంగారెడ్డికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరానని జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో పీజీ చదివే విద్యార్థుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని, ఇది దృష్టిలో ఉంచుకుని తక్షణమే పీజీ కళశాల తరలింపును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment