ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు
బతుకుదెరువు కోసం ఏదో మాట్లాడుతుండు
ఓ రోజు బీజేపీ అంటడు, ఇంకోసారి కాంగ్రెస్ అంటడు
పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడను.. నేనే పార్టీలు మారినోన్ని
మీడియాతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రశాంత్‌కిషోర్ (పీకే) మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బతుకు దెరువు కోసం సర్వే సంస్థ పేరుతో రోజుకో మాట మాట్లాడుతాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. గాం«దీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పీకే సర్వేల పేరిట చెపుతున్న జోస్యాలను కొట్టిపారేశారు. పీకే మాటలకు విలువ లేదని తేల్చి చెప్పారు. దేశంలో గెలిచేది బీజేపీ అని ఓసారి, ఇంకోసారి కాంగ్రెస్ అని అంటాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పాడని, కానీ కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. పీకే సర్వేలకు, మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పారీ్టకి 12 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ పాలనకు వంద మార్కులు
రేవంత్ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే బాగుంటుందనే రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో కింగ్, కింగ్ మేకర్ రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కరువు కాంగ్రెస్‌తో వచి్చందని మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులకు వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా అని విమర్శించారు. కేసీఆర్ ఇంకా ఓటమి ఫ్ర్రస్టేషన్‌లోనే ఉన్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఏ విషయంపైనా కనీస అవగాహన ఉండదని విమర్శించారు.
బీజేపీ బౌండరీలో మంద కృష్ణ రాజకీయాలు
బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాదిగ రాజకీయాలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. న్యూట్రల్‌గా ఉంటే ఆయన ఏం అడిగినా సమాధానం చెప్పేవాళ్లమన్నారు. బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని గానీ కేంద్ర మంత్రిని చేయాలని గానీ మంద కృష్ణ అడిగారా అని ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్‌ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించలేదని గుర్తు చేశారు.పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, ఎందుకంటే తానే పార్టీలు మారి వచ్చానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment