santhagudipadu
-
సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల
రొంపిచర్ల(పల్నాడు జిల్లా): మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతి మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంతగుడిపాడు గ్రామంలో గురువారం దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాడు నేడు రెండవ ఫేజ్‌లో భాగంగా కోటి ఐదు లక్షల రూపాయల నిధులతో 9 తరగతి గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతతో 320 విద్యార్థులు ఉన్న హైస్కూల్లో ఈ ఏడాది 700 మంది విద్యార్థులు చేరారన్నారు. తరగతి గదులు రానున్న వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. అలాగే ఐదు ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎంపీటీసీ ఇరుగుల మాధవి, సర్పంచ్ ఉయ్యాల సీతమ్మ, మాజీ సర్పంచ్ పల్లకి అంజనారెడ్డి, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పచ్చవ రవీంద్రబాబు, ఏలేశ్వరరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
రూ.లక్షల కోట్ల పెట్టుబడులన్నీ తుస్!
ఎంవోయూలపై సంతకాలు చేయడానికి ముందుకు రాని పెద్ద కంపెనీలు చిన్నా చితక కంపెనీలు, వ్యక్తులను తీసుకురమ్మని పురమాయించిన సర్కారు ఆ బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగింత నర్సరావుపేటకు చెందిన దొడ్డాల సుధీర్ ఇలా∙వచ్చిన బాపతే.. సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఈ ఇల్లు చూశారా.. ఈ ఇంటికి, విశాఖ భాగస్వామ్య సదస్సులో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వంతో ఎంవోయూ కూదుర్చుకున్న వ్యక్తికి లింక్ పెట్టాలంటే ఏమని చెప్పాలి? రూ.లక్షల కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త తన బాల్యం జ్ఞాపకాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెబితే సరిపోతుందా? ప్రభుత్వమైతే ఇలానే చెబుతామంటోంది. రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చిన ఆ సదస్సులో సాక్షాత్తూ సీఎం చంద్రబాబుతో ఫొటో దిగిన దొడ్డాల సుధీర్ నివాసం ఇది. ఆయన పారిశ్రామికవేత్త కాదు కదా.. కనీసం ఓ చిన్న కంపెనీకి షేర్ హోల్డర్ కూడా కాదు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన దొడ్డాల చిట్టిబాబు, కోటేశ్వరమ్మ ఏకైక కుమారుడు దొడ్డాల సుధీర్. పాత పెంకుటిల్లుతోపాటు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఆయనకున్న ఆస్తి. భార్య అంగన్వాడీ టీచర్. లక్షల కోట్లు వచ్చాయని నమ్మించాలని.. ఈవీఎం కాలేజీలో సుధీర్ పీఆర్వోగా పనిచేస్తూ ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్ విద్యార్థులను కాలేజీలో చేర్చించి కమీషన్లు తీసుకుంటుండేవారు. రెండేళ్ల క్రితం నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలో విరించి టౌన్‌షిప్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వాళ్లు ప్లాట్లు వేసి అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ కంపెనీలో సుధీర్ ప్లాట్లు విక్రయించేందుకు ఏజెం ట్‌గా చేరారు. కమీషన్లే ఆధారం. కానీ రూ.కోట్లు పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ప్రభుత్వంతో కుదిరిన అవగాహనా ఒప్పందం మీద సంతకం చేశారు. రూ.కోట్లాది సొమ్ము ఎలా తెస్తారో అని స్థాని కులు చర్చించుకుంటున్నారు. ఇంతకూ అసలు సంగతేంటంటే భారీ సంఖ్యలో ఎంవోయూలపై సంతకాలు చేయడానికి కంపెనీలను తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు మొదట అధికారులకు పురమాయించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంవోయూల మీద సంతకాలు చేయడానికి మనుషులను సమకూర్చే బాధ్యతను ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. వారు సమకూర్చిన వారిలో సుధీర్ ఒకరు. ఇలాంటి వారు, ఊరూపేరు లేని కంపెనీలు ఉన్నాయి. -
కారు, బైక్ ఢీ : వ్యక్తి మృతి
సంతగుడిపాడు (గుంటూరు) : వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా సంతగుడిపాడులో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సుబ్బారావు(45) బైక్ పై వెళ్తున్న సమయంలో అద్దంకి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న సుబ్బారావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.