Sapurnagar
-
అపార్ట్మెంట్లో కాల్పుల కలకలం
- వ్యక్తిపై రాడ్‌తో దాడి చేసిన దుండగులు - ఘటనా స్థలంలో బుల్లెట్ స్వాధీనం - హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో ఘటన హైదరాబాద్: కాల్పుల ఘటనతో హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గుర్తుతెలియని దుండగులు స్థానిక ఉషోదయ అపార్ట్మెంట్లో ఉండే రాఘవశర్మ (58) పై రాడ్డుతో దాడి చేసి గాలిలోకి కాల్పులు జరిపి పరారయ్యారు. మంగళవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాఘవ శర్మ అఫ్జల్‌గంజ్‌లోని శ్రీ వేంకటేశ్వర మెటల్ స్టోర్స్‌లో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఉద్యోగం ముగించుకుని మంగళవారం రాత్రి బస్సులో షాపూర్‌నగర్ చేరుకున్నారు. ఉషోదయ అపార్ట్మెంట్ మూడవ అంతస్తులో ఉండే తన నివాసానికి వెళ్లేందుకు లిఫ్ట్ వద్ద నిల్చున్నారు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన దుండగులు శర్మ చేతిలో ఉన్న బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో రాడ్డుతో దాడి చేసి గాయపరిచారు. గాలిలోకి కాల్పులు జరిపి బ్యాగ్‌తో ద్విచక్రవాహనంపై ఉడాయించారు. తుపాకీ శబ్దం విన్న అపార్ట్మెంట్ వాసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గాయపడ్డ శర్మను ఆస్పత్రికి తరలించారు. శర్మ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమకు విరోధులెవరూ లేరని శర్మ కుటుంబ సభ్యులు తెలిపారు. దుండగులు తీసుకెళ్లిన బ్యాగ్‌లో లంచ్ బాక్స్ తప్ప మరే వస్తువులు లేనట్లు తెలిసింది. రాత్రి లేని బుల్లెట్ పొద్దున ప్రత్యక్షం.. ఘటన స్థలంలో మంగళవారం రాత్రి పోలీసులకు తుపాకి పేల్చినట్టు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కానీ, బుధవారం ఉదయం స్థానికులు ఘటనా స్థలంలో నాటు తుపాకీ బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సిబ్బందితో ఆధారాల కోసం వెతుకుతున్నారు. -
బంధువుల నుంచి ప్రాణభయం
శ్రీకాకుళం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణభయం ఉందని నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన కోరాడ సురేష్, జ్యోతి శనివారం డీఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. వేర్వేరు కులాలకు చెందిన తాము గత కొంత కాలం ప్రేమించుకున్నామని, తమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్నారు. తమకు వేరే సంబధాలు చూస్తుండడంతో మేజర్లయిన తాము ఈనెల 17న హైదరాబాద్ వెళ్లామన్నారు. అక్కడి షాపూర్‌నగర్ సమీపంలోని హెచ్ఎంటీ కాలనీ సీతారామ ఆలయ దేవస్థానంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులైన కోరాడ సతీష్, పల్లి రమణ, చిట్టి రామకృష్ణలు తమ ను బెదిరించి తీసుకువెళ్లారన్నారు. గ్రామంలో రాజకీయ కక్షల్లో భాగంగా ఒక వర్గానికి చెందిన వారు ఈ నెల 20న కోరాడ రమణయ్య, కోరాడ సతీష్, కోరాడ నరేష్‌ల ప్రోత్సాహంతో దాడి చేశారన్నారు. దీనిపై పోలీసులకు తెలిపామన్నారు.గ్రామంలోనికి రానీయకుండా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని డిఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.