Sardhar vallabhaypatel
-
వన్ నేషన్ వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అహ్మాదాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. జాతీయ ఐక్యతా దినోత్సవంతోపాటు దీపావళి పండుగ కూడా జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ ప్రసంగించారు.‘‘దీపావళి పండగ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానం చేయడం ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం వైట్‌హౌస్‌లో 600 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లతో దీపావళిని జరుపుకున్నారు. అనేక దేశాల్లో దీపావళి జాతీయ పండుగగా జరుపుకుంటున్నారు. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’’ త్వరలో సాకారమవుతుంది. దేశంలోని అన్ని ఎన్నికలను ఒకే రోజు లేదా నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్వహించటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు త్వరలో లైన్ క్లియర్ అవుతుంది. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదన సమర్పించనున్నాం.#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says "...We are now working towards One Nation One Election, which will strengthen India's democracy, give optimum outcome of India's resources and the country will gain new momentum in achieving the dream of a… pic.twitter.com/vUku6ZCnVv— ANI (@ANI) October 31, 2024 మేం ప్రస్తుతం ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశ వనరుల సరైన ఫలితాన్ని ఇస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాధించడంలో సాయపడుతుంది. భారతదేశం.. నేషన్ వన్ సివిల్ కోడ్, సెక్యులర్ సివిల్ కోడ్ కలిగి దేవంగా అవతరించనుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేశాం. దానిని శాశ్వతంగా పాతిపెట్టాం. రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేవారే ఎక్కువగా అవమానిస్తున్నారు’’ అని అన్నారు. -
పట్టనట్లు నెహ్రూ... పంతంతో పటేల్!
కొన్ని చారిత్రక సంఘటనలు దశాబ్దాలు దాటినా కూడా చర్చనీయాంశాలుగా కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అంశమే 1948లో జరిగిన హైదరాబాద్ యాక్షన్. ‘ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్’ ద్వారా భారత ఉపఖండాన్ని భారత్, పాక్‌లుగా విభజిస్తున్నట్టు అప్పటి బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ ఆట్లీ 1948 జూన్ 3న ప్రకటించి ఉపఖండంలోని 562 రాచ రిక రాజ్యాలు ఇక నుండి ఏదో ఒక దేశంలో విలీనం అవొచ్చు లేదా, స్వతంత్రంగా ఉండొచ్చు అని తేల్చి చెప్పారు. దీనికి హైదరాబాదు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జూన్ 11న స్పందిస్తూ, హైదరాబాదు సంస్థానం స్వతంత్ర ఇస్లామిక్ దక్కన్ రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించారు. వెంటనే ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా, ‘‘నిజాం ప్రతిపాద నకు బేషరతుగా పాకిస్తాన్ మద్దతుంటుంది’’ అని తెలిపారు. దాంతో 82,688 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, 85 శాతం హిందూ, 13 శాతం ముస్లిం జనాభాతో ఉన్న హైదరాబాదు మున్ముందు ప్రజా స్వామ్య, లౌకిక, స్వతంత్ర భారతదేశానికి కొరకరాని కొయ్యగా మారుతుందని అప్పటి రాజకీయ నేతలు ఊహించారు.ఆ క్రమంలో రాచరిక రాష్ట్రాల రాజులు ‘ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్’ కూటమిగా ఏర్పాటై, 1947 ఆగస్టు తర్వాత తమ తమ ‘ఇలాఖా’లను భారతదేశంలో విలీనం చేశారు. కశ్మీరు, జునాఘఢ్, హైదరాబాదు రాష్ట్రాలు మాత్రం దీనికి ససేమిరా అన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాదును భారత్‌లో కలపడానికి వీల్లేదని ప్రకటించిన ‘మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్–ముస్లిమీన్’ నేత ఖాసీం రిజ్వీ 1948 ఫిబ్రవరి నుండి రెండు వేల మంది ముస్లిం రాడికల్ యువకులను గ్రామీణ ప్రాంతాల్లో హిందువులపై అరాచకాలకు, స్త్రీలపై అనేక అమానుష చర్యలకు పురిగొలిపాడు. ఇదేమి పట్టనట్టుగా ఉండి పోయాడు మీర్ ఉస్మాన్ అలీ. హైదరాబాదులో హిందువులపై జరుగుతున్న హత్యాచారాలను భారత ప్రభుత్వం అరికట్టాలని ఉపప్రధాని సర్దార్ పటేల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగులో గళ మెత్తారు. అయినా ప్రధాని నెహ్రూ, ఆయన విధేయులు నోరు మెదప లేదు!భారత్‌పై మిలిటరీ దాడికి 1948 జూన్ నుండే నిజాం ప్రభుత్వం ఐరోపా నుండి మెషీన్ గన్స్, గ్రెనేడ్లు, ఫైటర్ విమానాలను కరాచీ (పాకిస్తాన్)కి, అటునుండి సముద్రం ద్వారా పోర్చుగీసు ఆధీనంలోని గోవాకు తరలించి, ఆ తర్వాత హైదరాబాదుకు చేరవేయటం ఆరంభించింది. ఇక సమయం ‘బర్బాద్’ చేస్తే నష్టమే అనుకుని, తన సన్నిహి తులు వి.పి.మీనన్, హెచ్.వి. అయ్యంగార్, డిఫెన్స్ సెక్రటరీ హెచ్.ఎం. పటేల్ పర్యవేక్షణతో ‘ఆపరేషన్ పోలో’ అనే సీక్రెట్ కోడ్‌తో హైదరాబాదుపై విరుచుకుపడటం కోసం పథకం వేశారు వేశారు ‘ఉక్కు మనిషి’ పటేల్. ఆర్మీ జనరల్ జయంతో నాథ్ చౌధురీ ఇన్చార్జిగా పుణె కంటోన్మెంటులో సరిపడా యుద్ధ సామగ్రి, గోర్ఖా రైఫిల్స్, బర్మా బెటాలి యన్ ఫౌజీలను ఆగస్టు నెలలోనే సిద్ధం చేశారు. ఆపరేషన్‌కు ముందు సెప్టెంబర్ 8న కేబినెట్ మీటింగులో, ‘‘పరిస్థితి చేయి దాటక ముందే హైదరాబాదును ముట్టడించాలి. దేశం నడి బొడ్డులోని ఈ పుండును ఇలా వదిలేస్తే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం’’ అని తేల్చేసిన పటేల్‌పై చిందులు తొక్కారు నెహ్రూ! ఆయనతో వాదించదలచు కోలేదు సర్దార్. 1948 సెప్టెంబర్ 12న షోలాపూర్ దగ్గర గంగాపూర్ రైల్వే స్టేష న్లో కొందరు హిందువులను రజాకార్లు, భారత భూభాగంలో చొరబడి హత మార్చారు. ఈ వార్త ఢిల్లీ చేరటమే తడవు, ఆపరేషన్ పోలోకు గ్రీన్ సిగ్నల్ పంపారు.మరుసటి రోజు, సెప్టెంబర్ 13న ఉదయం 4 గంటల నుండి భారత బల గాలు బళ్లారి, షోలాపూర్, అహ్మద్‌నగర్, విజయవాడ మీదుగా నైజాం స్టేట్ నలు వైపులా సరిహద్దులను దాటుతూ హైదరాబాదు నగరం వైపు కదిలాయి. ఈ ఆకస్మిక ఆక్ర మణకు నీరుగారి పోయాడు నిజాం ఆర్మీ చీఫ్ మహమ్మద్ ఇద్రూస్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ సామగ్రిని వాడే శిక్షణ లేక పోవటంతో వారి తుప్పుపట్టిన తుపాకులు, జీపులు భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పోయాయి. సెప్టెంబరు 17 మధ్యాహ్నం సికింద్రాబాదు కంటోన్మెంట్‌కు 5 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది ఇండియన్ ఆర్మీ. పరిస్థితి క్షీణించటంతో ఉస్మాన్ అలీ ఖాన్, ఆర్మీ చీఫ్ ఇద్రుస్ ద్వారా కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాళ్ల బేరానికి వచ్చాడు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ రేడియో ప్రసంగం ద్వారా తన ప్రభుత్వాన్ని రద్దుచేసి, భారత సైనిక బలగాలకు లొంగిపోయినట్టు ప్రకటించారు.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత అధికారి, ముంబై(2023లో విడుదలైన జాన్ జుబ్రిచ్చికి ‘డీథ్రోన్డ్: పటేల్, మేనన్అండ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ ఇండియా’ ఆధారంగా.) -
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్(1875–1950): మహాబలుడు
సర్దార్ పటేల్ 1950లో మృతి చెందినప్పుడు.. ‘‘స్వాతంత్య్ర సమర పోరాటంలో మన బలగాలకు ఆయన గొప్ప కెప్టెన్. చంచలిత హృదయాలను తిరిగి రగిలించిన మహాబలుడు’’ అని జవహర్లాల్ నెహ్రూ ఆయన గురించి చెప్పారు. ఉక్కు మనిషిగా పటేల్‌ను అభివర్ణించడమే మనందరికీ ఎక్కువగా తెలుసు. కానీ, వాస్తవానికి పటేల్ బలమంతా అలవోకగా త్యాగం చేయడంలో ఉట్టిపడుతుంది. న్యాయవాద వృత్తిని భారత స్వాతంత్య్రోద్యమం కోసం వదులుకున్న త్యాగధనులు పటేల్ మాదిరిగా చాలామంది ఉన్నారు. కానీ, సాక్షాత్తూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలవోకగా వదులుకున్న ఖ్యాతి మాత్రం పటేల్ సొంతం. 1929లో, 1937లో, తిరిగి 1946లో నెహ్రూని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం కోసం గాంధీజీ చేసిన అభ్యర్థన కారణంగా, పటేల్ తనకు గల అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇలా అహంకారాన్ని పక్కన పెట్టి వ్యవహరించే సామర్థ్యం కారణంగా 1936 నుంచి పటేల్ తుది శ్వాస పీల్చే వరకూ.. దాదాపు పదిహేనేళ్ల పాటు భారతదేశానికి నెహ్రూ–పటేల్‌ల నాయక ద్వయం లభించింది. పటేల్ వాస్తవ దృక్పథానికి మేలిమి ఉదాహరణ దేశ స్వాతంత్య్ర సముపార్జన అనంతరం 500 సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన చొరవ. అది ఆయనలోని వజ్ర సంకల్పానికి, విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం. రాచరిక పాలనకు స్వస్తి చెప్పి, ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాలని సంస్థానాధీశులను ఆయన ఒప్పించగలిగారు. అదే సమయంలో వారి ప్రయోజనాలను ఒక సహేతుకమైన స్థాయి వరకు అంగీకరించి వారి పట్ల గౌరవ మర్యాదలను చూపించారు. విదేశీ వ్యవహారాలలో నిపుణుడైన కాంగ్రెస్ వాదిగా నెహ్రూ పేరు పొందినప్పటికీ, ఆ వ్యవహారాలలో పటేల్ అవగాహన మరింత పదునుగా, విస్పష్టంగా ఉండేది. అయినా దేశ ప్రయోజనాల కోసం, పరస్పర ప్రేమ, గౌరవాల కారణంగా ఇద్దరూ తమ విభేదాలను అధిగమించి వ్యవహరించారు. – రాజ్ మోహన్ గాంధీ, మహాత్మా గాంధీ మనుమడు, రాజకీయ ఉద్యమకారుడు -
పటేల్‌కు నివాళులు అర్పించిన ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ : ఏపీ రాజ్ భవన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాలవేసి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నివాళులు అర్పించారు. సువిశాల భారతావనికోసం వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని గవర్నర్ కొనియాడారు. మహనీయుని సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయన్నారు . -
‘సీతాదేవి అందుకు పూర్తి అర్హురాలు’
లక్నో : అఖండ భారతావనిని ఏకం చేసిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఐక్యతా విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దాదాపు 221 మీటర్ల ఎత్తు ఉండే రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యోగి తెలిపారు. రాముడి విగ్రహంతో పాటు సీతా దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ యోగికి లేఖ రాశారు యూపీ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్. ‘మీరు రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నా అభ్యర్థన ఏంటంటే రాముడి విగ్రహం ఎత్తును తగ్గించడమే కాక శ్రీరామునితో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయండి. రామున్ని పెళ్లి చేసుకున్న తర్వాత సీతా దేవి అయోధ్య వచ్చారు.. కానీ కొద్ది రోజుల్లోనే శ్రీరామునితో కలిసి వనవాసం చేయడానికి అడవులకు వెళ్లారు. 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్నారు. చివరకు రావణాసురుడు అమ్మను ఎత్తుకెళ్లాడు. ఆ రాక్షసుడి చెర నుంచి రాముడు సీతాదేవిని విడిపించాడు. కానీ అగ్ని పరీక్షలో నెగ్గినప్పటికి.. చివరకూ ఆ తల్లి మళ్లీ అడవుల పాలయ్యారు. అది గర్భవతిగా ఉన్న సమయంలో.. మొత్తంగా చాలా తక్కువ రోజులు మాత్రమే సీతాదేవి అయోధ్యలో ఉన్నారు. కానీ అయోధ్యలో ఉండటానికి ఆ తల్లికి పూర్తి అర్హత ఉంది. కనుక కేవలం రాముని విగ్రహాన్ని మాత్రమే కాక.. సీతారాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయండంటూ’ కరణ్ సింగ్ తన లేఖలో రాశారు. -
ఉల్లిపాయ–ఉక్కు మనిషి
ఉల్లిపాయకీ ఉక్కుమనిషికీ దగ్గర సంబంధం ఉన్నదని చెప్పడం తాటిచెట్టుకీ తాత పిల కకీ ముడిపెట్టడం అని చాలామందికి అనిపించవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ఉల్లిపాయని చిన్నచూపు చూడటానికి వీలు లేదని అనుభవజ్ఞులకు ఈపాటికే అర్ధమయివుంటుంది. నిజానికి ఉల్లిపాయని ‘రాజకీయ’ ఆయు ధంగా మనం గుర్తించాలి. 1998లో ఉల్లిపాయ బిజేపీ ప్రభుత్వాన్ని అల్లల్లాడించింది. ఈ సందర్భంగా రెండు జోకులు గుర్తుచేసుకోవాలి. ఆ రోజుల్లో ఢిల్లీలో ఉల్లిపాయ ధర కిలో 60 రూపాయలు కాగా, ఒక వ్యాపారి ఒక కిలో ఉల్లిపాయ కొన్నవారికి రెండు టీ–షర్టులు ఉచితమని ప్రకటించాడట! గ్రేటర్ కైలాష్‌లో దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చారు. 500 రూపాయలు దోచుకుని బొత్తిగా ఇంట్లో ఏమి విలువైన వస్తువులు ఉంచనందుకు యజమానిని హింసించబోయి–5 కిలోల ఉల్లిపాయలు చూశారట. తృప్తిపడి ఉల్లిపాయ సంచీతో వారు నిష్క్రమించారట! అలనాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ గారు తమ రాష్ట్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించడానికి నిర్ణయించారు. ప్రపంచంలోకెల్లా ఎల్తైన ఈ విగ్రహాన్ని ప్రధానిగా మొన్న ఆవిష్కరిం చారు. కేవలం 33 నెలలలో నిర్మితమైన ఈ విగ్రహం 2,989 కోట్ల ఖర్చుతో నిర్మితమైంది. ఈ స్ఫూర్తితోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మొన్న సరయు నదీతీరాన 151 మీటర్ల ఎత్తున శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మింపజేయనున్నట్టు ప్రకటించారు. ఇంతకూ ఉల్లిపాయకీ పటేల్గారికీ ఏం సంబంధం? పటేల్‌గారు ‘ఐరన్ మాన్’ మాత్రమే కాక ‘ఆనియన్ మాన్’ అని ఒకానొక పత్రికలో పేర్కొన్నారు. రెజినాల్డ్ రేనాల్డ్స్ అనే గాంధీజీ అనుయాయుడు సబర్మతి ఆశ్రమంలో తన అనుభవాల గురించి ఒక పుస్తకాన్ని (టు లివ్ ఇన్ మాన్‌కైండ్) రాశారు. ఒకసారి ఎవరో ఆశ్రమానికి కూరగాయల సంభారాన్ని బహుకరించారట. అందులో ఉల్లిపాయలున్నాయి. ఉల్లిపాయలు బ్రహ్మచారులకు నిషిద్ధం–అవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి కనుక . ఆశ్రమంలో ఉన్న మరో బ్రిటిష్ అనుయాయురాలు మిరాబెన్–అందరికన్నా చాదస్తురాలు. ఈ ఉల్లిపాయలని వెంటనే నిషేధించాలని అన్నారట. కాని పటేల్ గారు ‘‘ఉండనీయండి. నేనూ రెజినాల్డ్ ఈ ఉల్లిపాయల్ని తింటాం’’ అన్నారట. వీరిద్దరూ నరభక్షణ చేస్తున్నట్టు అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా వీరు భుజించారట. తరు వాత తరువాత గాంధీజీ ఉల్లిపాయ ఉపకారాన్ని గ్రహిం చారు. ముఖ్యంగా వెల్లుల్లిపాయ చేసే మేలుని ఆయన గుర్తించారు. కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలకు అనుగుణంగా పటేల్ తన కర్తవ్యాన్ని మలుచుకోవడానికి ఈ సందర్భం ఒక గుర్తుగా నిలుస్తుంది. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సమైక్య భారత స్థాపనకు–ఆస్థానాల విలీనానికి అప్పటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యమించిన ఉక్కుమనిషి కర్తవ్య మూలాలు ఇలాంటి సందర్భాలలో కనిపిస్తాయి. ఒకే ఒక సంస్థాన విలీనానికి నెహ్రూగారు తలదూర్చారు–కశ్మీర్. ఆ సమస్య ఇప్పటికీ రావణకాష్టంలాగా రాజుకుం టూనే ఉంది. మరొక సంస్థానంలో నెహ్రూ కలగజేసుకోబోయారు–హైదరాబాదు. అదృష్టవశాత్తూ పటేల్ ఆయన్ని దృష్టి మళ్లించి పోలీసు యాక్షన్ జరిపించారు. లేకపోతే దక్షిణాన మరో కాష్టం ఈనాటికీ రాజు కుంటూ ఉండేది. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చి–అక్కడ ఆచరించిన సత్యాగ్రహాన్ని మన దేశంలో అమలు జరపాలనుకున్నప్పుడు–1918లో ఖేడాలో–గ్రామీణులని మేల్కొల్పడానికి పటేల్ ఉల్లిపాయను గాంధీగారికి తీసుకువచ్చారట. ఆ ప్రాంతంలో ఉల్లి రైతులకు జీవనాధారం. అయితే పంటలు పండకపోయినా రైతులు శిస్తుకట్టాల్సిందేనని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుబట్టారు. అప్పటి స్థానిక కలెక్టరు ఫెడిరిక్ ప్రాట్ బ్రిటిష్ ఆదాయానికి ఆటపట్టు ఉల్లి పంటల భూముల శిస్తు అని గాంధీకి హెచ్చరించి చెప్పారట. అప్పుడే పాలకవర్గాన్ని గద్దె దించేది ‘ఉల్లిపాయ’ అని గాంధీజీ గ్రహించారు. దండి యాత్రలో కూడా గాంధీజీ ‘బ్రిటిష్ వారి జులుంకి మనం తలవొంచం. అవసరమైతే ఉల్లిపాయలు కారణంగా వెయ్యిసార్లు జైలుకి వెళ్తాం’’ అన్నారట. ఈవిధంగా పటేల్ గారి ప్రమేయంతో, స్ఫూర్తితో–సామాన్య రైతు జీవనాన్ని, తద్వారా ప్రజానీకానికంతటికీ వినియోగపడే ఉల్లిపాయ ‘జాతీయో ద్యమం’లో భాగమైనది అంటే పరోక్షంగా ‘ఉప్పు’ సత్యాగ్రహంలో ‘ఉల్లి’ సత్యాగ్రహం భాగమన్నమాట. నాకనిపిస్తుంది–ఇదంతా వింటున్నప్పుడు–కొద్దిలో తప్పిపోయింది కానీ–అది ప్రపంచ ప్రఖ్యాత ‘‘ఉప్పు–ఉల్లి సత్యాగ్రహం’’ అయ్యేదని. ఆవిధంగా 1998లో ఉల్లిపాయకీ అప్పటి ప్రభుత్వానికీ, 1918లో ఉల్లిపాయకీ బ్రిటిష్ ప్రభుత్వానికీ సంబంధించిన ‘చరిత్ర’ ఉన్నది. మొదటి చరిత్రకి మూలపురుషుడు–సామాన్య ప్రజానీకం అవసరాలను తీర్చి, ప్రతీక్షణం వారి జీవికకు ఆసరాగా నిలిచే ప్రాణ ధాతువుని పట్టుకున్న ఘనుడు–నేడు ప్రపంచంలో అందరికన్నా ఎత్తుగా నిలిచిన ఉక్కుమనిషి–సర్దార్ పటేల్. గొల్లపూడి మారుతీరావు -
గాంధీకి లేనిది.. పటేల్‌కు ఎందుకు..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ విగ్రహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత శశిథరూర్ పలు వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీకి దేశంలో ఎక్కాడా అంతపెద్ద విగ్రహం లేదని.. గాంధీకి కట్టని విగ్రహం పటేల్‌కు ఎందుకు కట్టారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. పటేల్ చాలా సాధారణమైన వ్యక్తని.. గాందేయవాదైన పటేల్‌కు గంభీరమైన రూపంగల విగ్రహాన్ని నిర్మించడం సబబేనా అన్నారు. గాంధీకి పటేల్ శిష్యుడు వంటివాడని.. శిష్యుడికి 182 మీటర్ల విగ్రహం ఎందుకని థరూర్ ప్రశ్నించారు. గాంధీ పెద్ద విగ్రహం పార్లమెంట్‌లోనే ఉందని.. గురువుని కాదని శిశ్యుడికి అతిపెద్ద విగ్రహం నిర్మించడం సరికాదని అన్నారు. పటేల్ తన జీవితకాలమంతా గాంధీ సిద్దాంతాలతో, కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ కావాలనే పటేల్‌ను వారి నాయకుడిగా వర్ణించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా సర్దార్ వల్లభ్‌భాయ్ అతిపెద్ద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. -
పటేల్ జయంతిని ఘనంగా జరపండి: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని ఈ నెల 31న ఘనంగా నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆ రోజున రాజధాని ఢిల్లీలో ఉన్న సర్దార్ పటేల్ విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం ‘ఐక్యతా పరుగు’ను ఆయన ప్రారంభిస్తారని ఓ అధికారి వెల్లడించారు. ‘సర్దార్ పటేల్ జయంతి రోజున ప్రతిజ్ఞ చేయించి, ఐక్యతా పరుగును నిర్వహించాల్సిందిగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులకు లేఖలు రాశారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు పరుగులో పాల్గొనేలా చూడాలని రాజ్‌నాథ్ లేఖలో కోరారు’ అని ఆ అధికారి చెప్పారు. ఢిల్లీలో 1.5 కి.మీ. సాగే ఈ పరుగులో పీవీ సింధు, మిథాలీరాజ్ తదితర క్రీడా ప్రముఖులు పాల్గొననున్నారు. -
సంస్థానాల విలీనం ‘ఉక్కు’ సంకల్పం
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా పటేల్ జయంతి భారీ ర్యాలీ పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కోనేరుసెంటర్(మచిలీపట్నం) : స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 554 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించడంలో ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్‌పటేల్ ప్రధాన పాత్ర పోషించారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత గట్టాలను విద్యార్థులంతా తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని శుక్రవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జి.విజయ్‌కుమార్, ఏజేసీ బిఎల్.చెన్నకేశవులు, డీఆర్వో ప్రభావతి, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక లక్ష్మీటాకీస్సెంటర్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వల్లభాయ్‌పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి రవీంద్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పటేల్ జయంతిని ప్రధాని నరేంద్రమోడి రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా పాటించాలని నిర్ణయించడం ప్రశంసనీయమన్నారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పటేల్ ఆనాటి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలో హోంమంత్రిగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన కారణంగా నేడు భారతదేశం శాంతిసామరస్యాలతో విరాజిల్లుతుందని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ మన రాష్ట్రంలో నిజాం ప్రభుత్వ ఆగడాలను అరికట్టి సైన్యాన్ని దింపి సంస్థానాలకు విలీనం చేయడంలో పటేల్ చేసిన సాహసం మాటలతో కొనియాడలేనిదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో పి.సాయిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బందరు డీఎస్పీ డాక్టర్ కెవి.శ్రీనివాసరావు, తహశీల్ధార్ బి.నారదముని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 4,000మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడలో రన్ ఫర్ యూనిటీ.... విజయవాడ : దేశ ఐక్యతా దిశగా కృషి చేసిన వ్యక్తిగా దేశ ప్రథమ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. బెంజిసర్కిల్ వద్ద ఈ పరుగును డాక్టర్ కామినేని శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించగా, మూడు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, జాయింట్ కలెక్టర్ జె.మురళి, సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ప్రముఖులు తుర్లపాటి కుటుంబరావు, ఎంసీదాస్, డీఎస్డీవో రామకృష్ణతో పాటు, నలందా, బిషప్ అజరయ్య, మాంటిస్సోరి, నిర్మలా కాన్వెంట్, గౌతమ్ డిగ్రీ కళాశాలల విద్యార్ధులు హాజరయ్యారు.