
సర్దార్ పటేల్ 1950లో మృతి చెందినప్పుడు.. ‘‘స్వాతంత్య్ర సమర పోరాటంలో మన బలగాలకు ఆయన గొప్ప కెప్టెన్. చంచలిత హృదయాలను తిరిగి రగిలించిన మహాబలుడు’’ అని జవహర్‌లాల్ నెహ్రూ ఆయన గురించి చెప్పారు. ఉక్కు మనిషిగా పటేల్‌ను అభివర్ణించడమే మనందరికీ ఎక్కువగా తెలుసు. కానీ, వాస్తవానికి పటేల్ బలమంతా అలవోకగా త్యాగం చేయడంలో ఉట్టిపడుతుంది. న్యాయవాద వృత్తిని భారత స్వాతంత్య్రోద్యమం కోసం వదులుకున్న త్యాగధనులు పటేల్ మాదిరిగా చాలామంది ఉన్నారు. కానీ, సాక్షాత్తూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలవోకగా వదులుకున్న ఖ్యాతి మాత్రం పటేల్ సొంతం.
1929లో, 1937లో, తిరిగి 1946లో నెహ్రూని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం కోసం గాంధీజీ చేసిన అభ్యర్థన కారణంగా, పటేల్ తనకు గల అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇలా అహంకారాన్ని పక్కన పెట్టి వ్యవహరించే సామర్థ్యం కారణంగా 1936 నుంచి పటేల్ తుది శ్వాస పీల్చే వరకూ.. దాదాపు పదిహేనేళ్ల పాటు భారతదేశానికి నెహ్రూ–పటేల్‌ల నాయక ద్వయం లభించింది. పటేల్ వాస్తవ దృక్పథానికి మేలిమి ఉదాహరణ దేశ స్వాతంత్య్ర సముపార్జన అనంతరం 500 సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన చొరవ. అది ఆయనలోని వజ్ర సంకల్పానికి, విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం.
రాచరిక పాలనకు స్వస్తి చెప్పి, ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాలని సంస్థానాధీశులను ఆయన ఒప్పించగలిగారు. అదే సమయంలో వారి ప్రయోజనాలను ఒక సహేతుకమైన స్థాయి వరకు అంగీకరించి వారి పట్ల గౌరవ మర్యాదలను చూపించారు. విదేశీ వ్యవహారాలలో నిపుణుడైన కాంగ్రెస్ వాదిగా నెహ్రూ పేరు పొందినప్పటికీ, ఆ వ్యవహారాలలో పటేల్ అవగాహన మరింత పదునుగా, విస్పష్టంగా ఉండేది. అయినా దేశ ప్రయోజనాల కోసం, పరస్పర ప్రేమ, గౌరవాల కారణంగా ఇద్దరూ తమ విభేదాలను అధిగమించి వ్యవహరించారు.
– రాజ్ మోహన్ గాంధీ, మహాత్మా గాంధీ మనుమడు, రాజకీయ ఉద్యమకారుడు