Sarkar Raj
-
మామా కోడలు మళ్లీ కలిసే?
‘కజ్రారే కజ్రారే.. ’ పాటలో కలసి స్టెప్స్ వేశారు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్. ఆ తర్వాత ‘సర్కార్ రాజ్’ చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరొక్కసారి స్క్రీన్‌పై కలసి యాక్ట్ చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం తమిళ ఫేమస్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ని సినిమాగా తీయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కథని గతంలో చాలాసార్లు సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని ప్రయత్నించారీ దర్శకుడు. కానీ కుదర్లేదు. లేటైనా లేటెస్ట్గా వస్తుంది అన్నట్లు ఈ సినిమాలో టాప్ నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ తమిళ హీరో విక్రమ్ ఓకే అయ్యారు. విజయ్, శింబు కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారని వార్త. ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రల కోసం అమితాబ్ బచ్చన్‌ను, ఐశ్వర్యా రాయ్‌ను సంప్రదించారట మణి. ఆల్రెడీ మణి దర్శకత్వంలో రూపొందిన ‘ఇద్దరు, గురు, రావణ్’ సినిమాలలో యాక్ట్ చేశారు ఐష్. అమితాబ్ బచ్చన్–మణిరత్నం కాంబినేషన్ మాత్రం ఫస్ట్ టైమ్. మరి.. మామా కోడలు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కనిపిస్తారన్న వార్త నిజమేనా? అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. -
మనసు దోచావ్ అన్నారు!
సర్కార్... ఓ బ్రాండ్. అమితాబ్ బచ్చన్ హీరోగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’ సినిమాలు సూపర్ హిట్. ఈ బ్రాండ్‌లో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన మూడో సినిమా ‘సర్కార్–3’కి కథ, స్క్రీన్‌ప్లే అందించింది పాతికేళ్ల తెలుగబ్బాయి పి. జయ కుమార్. ఊరు కడప జిల్లాలోని రైల్వే కోడూరు. సినిమాలపై పిచ్చితో ఢిల్లీ జేఎన్‌యూలో ఎం.ఎ. ఫిల్మ్స్ ఫైనల్ సెమిస్టర్ డుమ్మా కొట్టి వర్మ దగ్గర చేరిన జయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘వర్మగారి దగ్గర రెండున్నరేళ్లు గా పని చేస్తున్నా. ‘సర్కార్–3’ కోసం ఆయన కథలు పరిశీలిస్తున్నప్పుడు నేనీ కథ చెప్పగానే ‘మేం వెధవలమనుకుంటున్నావా?’ అన్నారు. ‘ఎందుకు సార్!’ అన్నా. ‘అలా ఫీలైనోడే ఇలాంటి కథ రాయగలడు’ అన్నారు. కథ ఆయనకు నచ్చడంతో ‘సర్కార్–3’ స్టార్ట్ చేశారు. ‘క్లైమాక్స్‌తో నువ్వు నా మనసు దోచావ్’ అని అమితాబ్‌గారు మెచ్చుకున్నారు. అమితాబ్–వర్మ సినిమాతో రచయితగా పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు.