sarvey satyanarayana
-
ఉత్తమ్ పోటీచేస్తే వ్యతిరేకంగా ప్రచారం చేస్తా: సర్వే
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, కీలకనేతలంతా పార్టీని వీడుతుంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎంపీ టికెట్ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ ప్రక్షాళన జరగకపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, నాయకత్వం మార్పు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీ ప్రక్షాళన జరిగిననాడే తిరిగి గాంధీ భవన్లో ఆడుగుపెడతానని స్పష్టంచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడేదిలేదని, ఉత్తమ్ ఎంపీగా పోటీచేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని సర్వే తెలిపారు. రేవంత్‌కు సీపీఐ మద్దతు కాగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 22న ఆయన ఎంపీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్వే సత్యనారాయణతో భేటీ అయ్యి మద్దతు కోరారు. మాల్కాజ్‌గిరి అంటే సర్వే సొంత ఇల్లు లాంటిదని.. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా రేవంత్ కోరారు. కాగా ఎంపీగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ప్రకటించాల్సిందిగా నిన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కూడా రేవంత్ భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో ‘సర్వే’ దుమారం -
‘నా పేరు సత్యనారాయణ అల్లుడు కాదు’
సాక్షి, హైదరాబాద్: తన మామ సర్వే సత్యనారాయణపై రెబల్‌గా పోటీ చేస్తానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ప్రకటించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్ రాకుండా తన మామ అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడుసార్లు ఓడిపోయిన తన మామకు టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘నా పేరు క్రిశాంక్ మాత్రమే. నా పేరు సర్వే సత్యనారాయణ అల్లుడు కాదు. నాకు టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో నేను 6 నెలలుగా బస్తీ నిద్ర చేసి ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నాను. మా జేబులు ఖాళీ అయ్యాయి. నేను 2 పైసల పనిచేయలేదని, ఓడిపోతానని సర్వే సత్యనారాయణ ప్రచారం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంట్లో పది మంది ముందు నన్ను దారుణంగా అవమానించారు. డబ్బులు ఉంటేనే టికెట్ వస్తుందని, 10 కోట్లు ఖర్చుపెట్టాలి నువ్వు ఎక్కడి నుంచి తెస్తావని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆశయాలను నరనరాల్లో జీర్ణించుకున్నాం. కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల నాకు టికెట్ దక్కలేదు. ఇంకా వేచిచూసే ఓపిక మాకు లేదు. మళ్లీ ఎవరో ఒక పారాచూట్ నాయకుడు వస్తాడు. తొలి జాబితాలో ఒక్క ఓయూ విద్యార్ధికి కూడా టికెట్ దక్కకపోవడం అత్యంత బాధాకరం. అందుకే నేను రెబల్‌గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నా’నని క్రిశాంక్ తెలిపారు. న్యాయంగా నాకే దక్కాలి సర్వే సత్యనారాయణ లోక్‌సభకు పోటీ చేస్తారని, ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇస్తారన్న ఉద్దేశంతో క్రిశాంక్ కొంతకాలంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. సొంత మామ తన టిక్కెట్‌ను ఎగరేసుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. న్యాయంగా కంటోన్మెంట్ టికెట్ తనకే దక్కాలని ఆయన అంటున్నారు. సర్వే సత్యనారాయణ లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేయకుండా, ఇక్కడ ఎందుకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారో అర్థం కావడం లేదని క్రిశాంక్ వాపోయారు. 2014 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా క్రిశాంక్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరి క్షణాల్లో టికెట్ దక్కలేదు. -
టీఆర్ఎస్ మునిగిపోయే నావ: సర్వే
రామాయంపేట (మెదక్): టీఆర్ఎస్ మునిగిపోతున్న నావలాంటిదని, ఆ పార్టీ రాష్ట్రంలో నాలుగైదు స్థానాలకు మించి గెలువలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డిలో రాహుల్ గాంధీ సభకు వెళ్తూ మార్గమధ్యంలో రామాయంపేట వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గంప మహేందర్, శ్రావణ్‌కుమార్, సేవాదళ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు అమరసేనారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 101 స్థానాలను కైవసం చేసుకుంటుం దని, కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంద న్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుం దని, కేసీఆర్ కుటుంబం కమీషన్లు దండుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. -
ఓడింది కాంగ్రెస్ కాదు...సర్వే సత్యనారాయణ
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే అతడిని ప్రజలు ఓడించారన్నారు. గత ఏడాది మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు డిపాజిట్ కూడా దక్కలేదని శంకర్రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్‌కు 1,56,311 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు లక్షకుపైగా ఓట్లు తగ్గాయి. దీనిపై టీపీసీసీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన ఫలితాలను ఊహించలేకపోయామని, ఇది తమను షాక్‌కు గురి చేసిందని టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో సుమారు 2.7% టీఆర్ఎస్ వైపు మళ్లినట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
'నేను పోటీ చేయను, సర్వేకి ఇవ్వండి'
హైదరాబాద్ : వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ సేకరిస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్ ...ఈసారి పోటీ చేసేందుకు సముఖంగా లేనట్లు లేదు. ఆయనను పోటీకి ఒప్పించడానికే కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నించినా వివేక్ వైఖరిలో మార్పు లేదు. తాను పోటీ చేయనని, సర్వే సత్యనారాయణకు టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మరోవైపు ఓరుగల్లు నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సర్వే సత్యనారాయణ ...దిగ్విజయ్‌కు తన అభిప్రాయం తెలిపారు. కాగా పీసీసీ నుంచి జాబితా అందుకున్నా అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను అధిష్టానానికి నివేదించనున్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. -
'సర్వే'కు ఛాన్స్ దక్కేనా?
మెదక్ ఉప పోరుకు రోజుకో అభ్యర్థి పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా మెదక్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేరు తెరమీదకు వచ్చింది. ఉపఎన్నిక బరిలోకి దిగేందుకు ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ అధినాయకులు బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మెదక్ జిల్లా ముఖ్యనేతలతో సుమారు మూడు గంటల పాటు మంతనాలు జరిపారు. అనంతరం సర్వేను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టికెట్ రేసులో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరిగినా చివరకు సర్వే వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. జగ్గారెడ్డి విషయంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రికమెండ్ చేసినా ఫలితం లేకపోయింది. జగ్గారెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే తాము పార్టీ వీడతామని జిల్లా నేతల హెచ్చరించడంతో సీటు రేసులో ఆయన వెనకబడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి వ్యవహార శైలి, తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉండటంతో పాటు, బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఆయనకు మైనస్ గా మారాయి. ఇక సునీతా లక్ష్మారెడ్డి విషయానికి వస్తే ఆమె అభ్యర్థిత్వానికి కూడా జిల్లా నేతలు సుముఖత చూపలేదట. కాగా మెదక్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కనుందనే దానితో పాటు... సర్వే భవిష్యత్ శనివారం తేలనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్.. మెదక్ అభ్యర్ధిని ఖరారు చేస్తారని సమాచారం. రేసులో ఉంటూనే టికెట్ ఎవరికి వచ్చినా తామంతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పటం కొసమెరుపు. -
'కాంగ్రెస్ ఓడిందంటే తెలంగాణ నేతలదే తప్పు'
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నాయకత్వ లోపమే కారణమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఎన్నికల్లో ఓడిందంటే అందుకు ఆప్రాంత కాంగ్రెస్ నేతలదే తప్పు అని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని నేతలందరూ వ్యవహరించిన వైఖరి వల్లే కాంగ్రెస్ ఓటమి చెందిందని సర్వే సత్యనారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ క్యాడర్ మొత్తాన్ని బలోపేతం చేయాలని సోనియాగాంధీని కోరినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలిచేలా కృషి చేస్తామని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మంగళవారం ఉదయం సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్థన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలు వివరించినట్లు పాల్వాయి తెలిపారు. తెలంగాణా ఇచ్చినా ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయామని సోనియాకు చెప్పామన్నారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామన్నారు.