'సర్వే'కు ఛాన్స్ దక్కేనా?
మెదక్ ఉప పోరుకు రోజుకో అభ్యర్థి పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా మెదక్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పేరు తెరమీదకు వచ్చింది. ఉపఎన్నిక బరిలోకి దిగేందుకు ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. అభ్యర్థి ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ అధినాయకులు బుధవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో మెదక్ జిల్లా ముఖ్యనేతలతో సుమారు మూడు గంటల పాటు మంతనాలు జరిపారు. అనంతరం సర్వేను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. టికెట్ రేసులో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరిగినా చివరకు సర్వే వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.
జగ్గారెడ్డి విషయంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రికమెండ్ చేసినా ఫలితం లేకపోయింది. జగ్గారెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే తాము పార్టీ వీడతామని జిల్లా నేతల హెచ్చరించడంతో సీటు రేసులో ఆయన వెనకబడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి వ్యవహార శైలి, తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉండటంతో పాటు, బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఆయనకు మైనస్ గా మారాయి.
ఇక సునీతా లక్ష్మారెడ్డి విషయానికి వస్తే ఆమె అభ్యర్థిత్వానికి కూడా జిల్లా నేతలు సుముఖత చూపలేదట. కాగా మెదక్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కనుందనే దానితో పాటు... సర్వే భవిష్యత్ శనివారం తేలనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్.. మెదక్ అభ్యర్ధిని ఖరారు చేస్తారని సమాచారం. రేసులో ఉంటూనే టికెట్ ఎవరికి వచ్చినా తామంతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పటం కొసమెరుపు.