సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలో మంచి ఫలితం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకుంటోంది. మొదటి నుంచీ పట్టున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో కేడర్‌ను కాపాడుకోవడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టవచ్చని, టీఆర్‌ఎస్–బీజేపీల బంధాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చనే వ్యూహంతో ముందుకెళుతోంది.
గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమకు 30 శాతానికి తగ్గకుండా ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో ఈసారి కూడా ఆ ఓట్లను నిలబెట్టుకోవాలని, టీఆర్‌ఎస్–బీజేపీల మధ్య ఓట్ల చీలికను ఆసరాగా చేసుకొని గెలుపు తీరం చేరుకోవాలని ఆశిస్తోంది.
మూడంచెల వ్యూహం...
ఉపఎన్నికను మూడంచెల వ్యూహంతో ఎదు ర్కోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణలో మండలాలు, గ్రామాలవారీగా పని విభజన చేసుకొని ముందుకెళ్లేలా వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ స్థాయి పర్యవేక్షణను స్వయంగా చేపడుతూ మండలాలవారీగా ఇన్‌చార్జీలను, చీఫ్ కో–ఆర్డినేటర్లను నియమించారు. ఇందులో కమలాపూర్‌కు ఎమ్మెల్యే సీతక్క, జమ్మికుంటకు శ్రీధర్‌బాబు, హుజూరాబాద్ పట్టణ, మండలానికి జగ్గారెడ్డి, ఇల్లంతుకుంట మండలానికి వేం నరేందర్‌రెడ్డి, వీణవంక మండలానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలను నియమించారు.
వారికి అనుబంధంగా మరో ఐదారుగురు నేతలను మండలాలవారీగా నియమించారు. వారి సమన్వయంతో ఆయా మండలాల్లోని గ్రామాల్లో పని విభజన చేయనున్నారు. ప్రతి గ్రామానికి టీపీసీసీ స్థాయి నాయకుడిని ఇన్‌చార్జిగా నియమించాలని, నియోజకవర్గవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పార్టీ అనుబంధ సంఘాలను రంగంలోకి దింపాలని ఆయన ఇప్పటికే ఆదేశించారు.
గాంధీభవన్‌లో కీలక నేతల భేటీ
హుజూరాబాద్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు శనివారం గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అజ్మతుల్లా హుస్సేన్‌లు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా రానున్న 20 రోజులపాటు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు.
స్టార్ క్యాంపెయినర్లు వీరే..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ పక్షాన ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి. వేణుగోపాల్ ఈ పేర్లతో కూడిన లేఖను ఎన్ని కల సంఘానికి పంపినట్టు టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
మొత్తం 20 మందితో కూడిన ఈ జాబితాలో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి, శ్రీనివాస కృష్ణన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, పొన్నాల, అజహరుద్దీన్, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయిని రాజేందర్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment