వివాదం ముదిరేనా?
సాక్షి, ముంబై: దక్షిణ కరాడ్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలనే వివాదం మరింత ముదిరే అవకాశముంది. అక్కడి నుంచి పోటీపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి కనబరుస్తుండగా, వదులుకునేందుకు సిద్ధంగా లేనని సిట్టింగ్ ఎమ్మెల్యే విలాస్కాకా పాటిల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ అధిష్టానం దక్షిణ కరాడ్ నుంచి తనకు అభ్యర్థిత్వం ఇవ్వని పక్షంలో మరో పార్టీ నుంచైనా పోటీ చేస్తానని, ఒకవేళ అదికూడా వీలుకాకపోతే స్వతంత్య్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని పాటిల్ పేర్కొన్నారు. దీంతో ఈ నియోజక వర్గంపై వివాదం మరింత రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలాఉండగా పృథ్వీరాజ్ చవాన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే అంశం ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. ఈ సమస్య ఎటూ తేలకపోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో గందగోళం నెలకొంది. వచ్చే నెల 15న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో దక్షిణ కరాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని సీఎం భావిస్తున్నారు.
ఇందులోభాగంగా అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ నియోజక వర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన విలాస్కాకా పాటిల్ ఈ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆదివారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అవసరమైతే ఢిల్లీ అధిష్టానంపై తిరుగుబాటు చేస్తానని పేర్కొన్నారు. ‘దక్షిణ కరాడ్ నియోజక వర్గం నాకు కంచుకోట. ఇప్పటికే అక్కడినుంచి రెండుసార్లు గెలిచా. ఈ ఎన్నికల్లోనూ నా గెలుపు తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని వదులుకోను’అని అన్నారు. దీంతో చవాన్ ఇరకాటంలో పడిపోయారు.