satyagraham
-
పెదపూడి స్థూపం.. స్మారక చిహ్నం
పెదపూడి (తెనాలి): తెనాలికి సమీపంలోని అమృతలూరు మండల గ్రామం పెదపూడి గ్రామ పంచాయతి ఆవరణలో గల సత్రాగ్రహ విజయ స్థూపం ఇప్పుడు జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆజాదీ కా అమృతోత్సవం’లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాచీన కట్టడాల గుర్తింపు, పరిరక్షణలో ఈ స్థూపాన్ని చేర్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని భారత సామాజిక శాస్త్రాల పరిశోధన మండలి గుర్తింపు కలిగిన దేశంలోని ఆరు సంస్థల్లో ఒకటైన తిరుపతి కేంద్రంగా గల భారత గ్రామీణ అధ్యయనం, పరిశోధన అకాడమీ (అగ్రశ్రీ) సంస్థ ఇందుకు పూనుకుంది. పెదపూడిలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో గల స్థూపానికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 25 అడుగుల ఎత్తులో పైభాగాన మూడు సింహాలతో గల స్థూపాన్ని చంద్రమౌళి సత్రాగ్రహ విజయస్థూపంగా పేర్కొంటారు. పెదపూడి నుంచి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్న 16 మంది సత్యాగ్రహుల పేర్లనూ దీనిపై లిఖించారు. నాటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, అమృతలూరు మండలం మోపర్రుకు చెందిన రాజకీయ దిగ్గజం కల్లూరి చంద్రమౌళి స్ఫూర్తితో 1952లో నాటి పెదపూడి పంచాయతీ సర్పంచ్ చదలవాడ వెంకట సుబ్బయ్య ఈ స్థూపాన్ని నిర్మించారు. రఘుపతి రాఘవ రాజారాంతో సహా బాపూజీ సూక్తులను చెక్కించారు. గ్రామ స్వరాజ్యం కోసం కల్లూరి కృషి గాందీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తొలి పునాదిగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ధీశాలి కల్లూరి చంద్రమౌళి స్వస్థలం పెదపూడికి సమీపంలోని మోపర్రు. తెనాలి, గుంటూరు, కలకత్తాలో చదివారు. ఇంగ్లండ్‌లో ఉన్నత విద్య చదివారు. అక్కడే ఉద్యోగం వచ్చింది. దేశం కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని భావించి, స్వదేశానికి వచ్చేశారు. దేశవ్యాప్తంగా పర్యటించారు. గాందీజీ ఆశ్రమంలో గడిపారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని పలుసార్లు జైలుకెళ్లారు. 1933–1962లో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో 1934లో జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని తెనాలిలో ఏర్పాటు చేశారు. జస్టిస్ పార్టీ ఆధిపత్యానికి గండికొట్టి 1937లో మద్రాస్ ప్రావిన్స్‌కు తెనాలి–రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా, 1938లో జిల్లాబోర్డు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1945లో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులై, 1946లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. 1947 మార్చిలో రామస్వామి రెడ్డియార్ మంత్రివర్గంలో స్థానిక స్వపరిపాలన, సహకారశాఖ మంత్రిగా నియమితులయ్యారు. పంచాయతీ చట్టం రాజ్యాంగ పరిషత్‌లో చట్టరూపం దాల్చలేదని భానవ కలిగిన చంద్రమౌళి, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర స్వపరిపాలన మంత్రిగా నియమితులయ్యాక, ఆ చట్టాన్ని తానే రూపొందించారు. మహాత్ముడి ప్రధాన ఆశయమైన గ్రామస్వరాజ్యం కోసం దేశంలోనే మొదటగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చారు. గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పంచాయతీలను స్వయంపాలకంగా మార్చటానికి అనేక అంశాలను చేర్చారు. పేదల ఇళ్లపై పన్నుల రాయితీ అధికారాన్ని పంచాయతీలకు కట్టబెట్టారు. సర్పంచ్‌కు చెక్‌పవర్ అప్పగించారు. అన్ని రంగాల్లోనూ గ్రామ జీవనాన్ని వారే నిర్వహించుకుంటూ, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయటం చట్టం ప్రధాన ఉద్దేశం. ఇలా గ్రామసీమల అభివృద్ధికి 1950లోనే కల్లూరి చంద్రమౌళి బీజం వేశారు. భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించాక కూడా చంద్రమౌళి తనదైన పంథాలోనే పనిచేశారు. 1955లో వేమూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ, దేవదాయ మంత్రిగా చేశారు. 1960లో దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో దేవదాయ, సహకారశాఖ మంత్రిగా పనిచేశారు. 1962లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు అవసరమైన సేవలు అందించటంలో చంద్రమౌళి వెనకాడేవారు కాదు. ప్రజాసేవకు ఏవైనా రూల్స్ అడ్డుగా ఉంటే, నిస్సంకోచంగా వాటిని తొలగించమని ఆదేశించేవారు. ‘అయామ్ ది గవర్నమెంట్’ అంటూ భరోసా ఇచ్చేవారు. తిరుగులేని ఆయన నిర్ణయాలకు ఎదురుండేది కాదు. రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చారు. 1965లో రాజకీయాల నుంచి విరమించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న వేళ పెదపూడిలోని విజయ స్థూపం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై దశాబ్ద కాలానికిపైగా కృషిచేస్తున్న అగ్రశ్రీ సంస్థ దృష్టికొచ్చింది. స్మారక చిహ్నంగా గుర్తించి, ప్రభుత్వాల సాయంతో పరిరక్షణ, సుందరీకరణకు హామీ లభించింది స్మారక చిహ్నంగా గుర్తించాం పెదపూడి స్థూపాన్ని స్మారక చిహ్నంగా గుర్తించాం. ఇటీవల అమృతలూరు మండల, పెదపూడి పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలతో జూమ్ సమావేశం నిర్వహించి, అభిప్రాయాలను తెలుసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిరక్షణకు తగిన కృషి చేస్తాం. – డాక్టర్ సుందర రామ్, సంచాలకుడు, అగ్రశ్రీ -
మీ నిరసనలతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహం చేయడానికి అనుమతినివ్వాలని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ‘ఇప్పటికే మీ ధర్నాలతో ఢిల్లీ గళం నొక్కేశారు. ఇంకా నగరం లోపలికి కూడా వస్తారా?’అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిరసన తెలిపే హక్కు ఉండొచ్చు. అదే సమయంలో పౌరులందరికీ నగరంలో స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగడానికి సమాన హక్కులుంటాయి. వాటిని కాలరాయకూడదు’అని కోర్టు హితవు పలికింది. జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్‌ల ధర్మాసనం రైతులు చేస్తున్న ధర్నాలతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదో తెలుసుకున్నారా? అని ప్రశ్నించింది. రైతుల నిరసనలతో ప్రజల ఆస్తులు ధ్వంసమవుతున్నాయని పేర్కొంది. రైతులు ఇప్పటికే సాగు చట్టాలను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటప్పుడు మళ్లీ నిరసనలెందుకు? అని ప్రశ్నించింది. కోర్టులపై రైతులు నమ్మకం ఉంచాలని హితవు పలికింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టుని ఆశ్రయించిన రైతులు , దాని సత్వర విచారణకు మళ్లీ కోర్టుకి వెళ్లొచ్చని, ఇలా సత్యాగ్రహాలు చేయడం వల్ల ఒరిగేదేమిటని పేర్కొంది. శాంతియుతంగానే రైతులు నిరసన చేస్తారని రైతు సంఘాల తరఫున హాజరైన లాయర్ ప్రశ్నించగా ఆయనపై విరుచుకుపడింది. ‘శాంతియుతంగా నిరసనలంటే ఏమిటి? మీరు జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు. రైళ్లను అడ్డుకుంటారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ శాంతియుత నిరసనలంటే ఎలా?’అని బెంచ్ ప్రశ్నించింది. -
కాంగ్రెస్ పార్టీకి అంతం లేదు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆవిర్భావ దినోత్సవ సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆరెస్సెస్‌కు ఒక న్యాయం, కాంగ్రెస్‌కు మరో న్యాయమా? అని అనుమతి ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి అంతం లేదని, కేసీఆర్ నియంత పోకడలకు త్వరలోనే స్వస్తి పలుకుతామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సత్యాగ్రహానికి అనుమతి ఇవ్వకపోడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద వైఖరిని తప్పుబట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ భవన్ ఇచ్చిందనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని అన్నారు. సత్యాగ్రహాన్ని అడ్డుకోవడం కుట్ర అని, కేసీఆర్ మాయమాటలతో ఐదేళ్లు పాలన చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కేసీఆర్ చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నపుడే అభివృద్ధి జరిగిందని, దేశ ప్రజలను చైతన్యం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పుకొచ్చారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్లు ఒక్కటే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడం కోసం ఎంఐఎం దేశంలో పలు చోట్ల పోటీ చేస్తుందని, ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
పోటాపోటీ ప్రదర్శనలు
న్యూఢిల్లీ/కోల్‌కతా/తిరువనంతపురం/ముంబై: పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. పౌర చట్టంపై కాంగ్రెస్ సత్యాగ్రహం! పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహం చేపట్టింది. ‘ఐకమత్యం కోసం సత్యాగ్రహం’పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్వేషాలను పెంచుతూ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భరత మాత గొంతు అణచివేసేందుకు, రాజ్యాంగంపై దాడికి చేస్తున్న యత్నాలను ప్రజలు కొనసాగనివ్వబోరని హెచ్చరించారు. చెన్నైలో డీఎంకే ర్యాలీ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పక్కన కాంగ్రెస్ నేత పి.చిదంబరం ‘పౌర’చట్టానికి వ్యతికేకంగా ప్లకార్డులు పట్టుకుని నడిచారు. పెళ్లిళ్లు, వేడుకల్లోనూ ‘పౌర’ నిరసనలు కేరళలో పెళ్లిళ్లు, వేడుకలు, క్రిస్మస్ సంబరాలే నిరసన వేదికలుగా మారాయి. ఈ ఒరవడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు, వధువు పెళ్లి విందు సందర్భంగా ఎన్నార్సీకి, పౌర చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ముందు నడుస్తుండగా వారి బంధువులు నినాదాలు చేసుకుంటూ వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రాజకీయ లబ్ధికే బెంగాల్ సీఎం మొగ్గు.. పౌరసత్వ సవరణ చట్టంపై సాధారణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. ‘పౌర’చట్టానికి అనుకూలంగా కోల్‌కతాలో సోమవారం బీజేపీ చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆశ్చర్యం కలిగించాయి: పవార్ దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)అమలు చేసే విషయమై పార్లమెంట్లో చర్చే జరగలేదన్న మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నార్సీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ పార్లమెంట్ సంయుక్త సమావేశం సందర్భంగా రాష్ట్రపతిæ వెల్లడించారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ లేఖ బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కలిసికట్టుగా ఉండి దేశాన్ని రక్షించుకుందామన్న బెంగాల్ సీఎం మమత.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల సీనియర్ నేతలకు లేఖలు రాశారు. అందుకే ఎన్నార్సీపై వెనక్కు! జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నార్సీపై కేబినెట్లోగానీ, పార్లమెంట్లోగానీ చర్చించలేదని ఆదివారం ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ చెప్పడం తెల్సిందే. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలపై నిరసనలు, హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో కొన్నాళ్లు ఎన్ఆర్సీని పక్కనపెట్టాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే ప్రధాని ఆ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు. అందుకే ఎన్నార్సీ, సీఏఏ వేరువేరు అని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతాయని ఊహించలేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నార్సీపై ముస్లింల ఆందోళన కూడా ఈ స్థాయిలో నిరసనలు జరగడానికి కారణమని పేర్కొన్నారు. -
రేపు రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో ఈ నెల 23న (సోమవారం) ఢిల్లీలోని గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహం కార్యక్రమం చేపట్టనున్నారు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకూ ఈ ధర్నా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆదివారమే ఈ ధర్నా చేపట్టాలని ముందుగా భావించినప్పటికీ అనుమతులు పొందే క్రమంలో ఆలస్యం వల్ల సోమవారం నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. -
3 నుంచి సత్యాగ్రహం!
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 3వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ల ముందు ‘సత్యాగ్రహం’పేర కార్యక్రమాలు నిర్వహించనున్నామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. రైతు సమన్వయ సమితులు రద్దు కావాలని, గ్రామ పంచాయతీలు బలపడాలని ఆకాంక్షించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ, సీపీఐ నేతలతో కలసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 3న నిరసనలు ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి అఖిలపక్షం ఇచ్చిన పేరు ‘సత్యాగ్రహం’అని పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను ఓడించాలని పిలుపు ఇచ్చారు. గనుల ప్రైవేటీకరణ రద్దుతోపాటు వారసత్వ ఉద్యోగాలను సాధించాలంటే అధికార పక్షానికి వ్యతిరేక ఓటు వేయాలని కోరారు. వారసత్వ ఉద్యోగాలను కోర్టు వ్యతిరేకించలేదని, మహిళలు, వికలాంగుల పట్ల వివక్షనే తప్పుబట్టిందని వివరించారు. అధికారం కోసం ఎన్నికలను టీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని, అధికార పార్టీ అనుబంధ సంఘం విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తోందని మండిపడ్డారు. ఇతర సంఘాల్లో రెండో శ్రేణి నేతలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతు సమన్వయ సమితుల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రాతినిధ్యం, సభ్యత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. జీవో 39 స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేదిగా ఉందని, ఇది అప్రజాస్వామికమైన జీవో అని మండిపడ్డారు. గ్రామాల్లో రైతు సమన్వయ సమితులు ఘర్షణ సమితులుగా మారాయన్నారు. రైతు సమన్వయ సమితుల పేరున టీఆర్ఎస్ గ్రామాల్లో చిచ్చు పెడుతోందని సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. జేఏసీ తలపెట్టిన నిరసనలు, ధర్నాలకు సీపీఐ మద్దతు పలికినట్లు తెలిపారు. ప్రభుత్వ రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. -
సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
జీఓ నెం.69ని రద్దు చేసి నీటి విడుదల ప్రాధాన్యాలను సవరించాలి – ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కర్నూలులో సత్యాగ్రహం కర్నూలు (న్యూసిటీ): రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.69ని రద్దు చేసి నీటి ప్రాధాన్యాలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర హంద్రీనీవా–హంద్రీ పరివాహక రక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు సత్యాగ్రహదీక్ష చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత రైతంగాన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయరాదన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్‌ను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని, అలాగే గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను 2019 నాటికెఇ పూర్తి చేయాలన్నారు. వేదవతిపై ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని కోరారు. విప్లవ రచయిత సంఘం రాష్ట్ర నాయకుడు పాణి మాట్లాడుతూ రాయలసీమకు ప్రత్యేక సాగునీటి కమిషన్ ఏర్పాటు చేసి చెరువులు, నదులు, కాలువలను అను సంధానం చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు సమీపంలోని చెన్నరాయుని తిప్ప రిజర్వాయయర్‌ను ఏటా నింపాలన్నారు. కర్నూలు ప్రజల దాహం తీర్చేందుకు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నిర్మించాలని, హంద్రీనీవా కాలువ నుంచి హంద్రీనదిలో నీళ్లు వదిలి, సమీప గ్రామాలకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, ఓంకార్, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు బాలసుందరం, రాయలసీమ యూనైటెడ్ ఫోరం నాయకుడు శివనాగిరెడ్డి, టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రత్నం ఏసేపు, జిల్లా అధ్యక్షుడు తిమ్మన్న, లోక్ సత్తా పార్టీ మహిళా విభాగం నాయకురాలు రాజ్యలక్ష్మి, జిల్లా నాయకుడు డేవిడ్, సిల్వర్ జూబ్లీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగరాజు, కల్లూరు మండల ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్న, రవి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటిపై చంద్రబాబువి తప్పుడు లెక్కలు
– రేపు వందకేంద్రాల్లో సాగునీటి కోసం సత్యాగ్రహాలు - బొజ్జ దశరథరామిరెడ్డి వెల్లడి నంద్యాలరూరల్: సాగునీటి విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబువి అన్ని తప్పుడు లెక్కలు అని, రాయలసీమకు ఆయన తీరని అన్యాయం చేస్తున్నారని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. శనివారం నంద్యాలలోని మాజీ ఎంపీ బొజ్జా వెంకటరెడ్డి గృహంలో సాగునీటి సత్యాగ్రహం వాల్‌పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బొజ్జదశరథరామిరెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమకు 500 టీఎంసీల నీరు అందిస్తామని బాబు చెప్పడం పచ్చి అబద్ధంగా అభివర్ణించారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీరు ఇస్తామని చెప్పి చుక్కనీరు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ పెద్దలు మభ్యపెట్టి మోసం చేయడం భావ్యం కాదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలకు వివరించి రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, అన్ని రాజకీయ పార్టీలను ఐక్యం చేసేందుకు రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేడపతున్నామన్నారు. ఈనెల 3వ తేదీ సోమవారం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని అన్ని మండల ముఖ్య కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీమ సత్యాగ్రహం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, నంది రైతు సమాఖ్య నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, కేసీ పరిరక్షణ సమితి కన్వీనర్ బాలీశ్వరరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు మహేశ్వరరెడ్డి, బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి తూముశివారెడ్డి, ప్రచార కార్యదర్శి కానాల సుధాకరరావు‡, తదితరులు పాల్గొన్నారు.