సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం
Published Mon, Apr 3 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
జీఓ నెం.69ని రద్దు చేసి నీటి విడుదల ప్రాధాన్యాలను సవరించాలి
– ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కర్నూలులో సత్యాగ్రహం
కర్నూలు (న్యూసిటీ): రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.69ని రద్దు చేసి నీటి ప్రాధాన్యాలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం దగ్గర హంద్రీనీవా–హంద్రీ పరివాహక రక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు సత్యాగ్రహదీక్ష చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత రైతంగాన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయరాదన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్‌ను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని, అలాగే గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను 2019 నాటికెఇ పూర్తి చేయాలన్నారు. వేదవతిపై ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని కోరారు. విప్లవ రచయిత సంఘం రాష్ట్ర నాయకుడు పాణి మాట్లాడుతూ రాయలసీమకు ప్రత్యేక సాగునీటి కమిషన్ ఏర్పాటు చేసి చెరువులు, నదులు, కాలువలను అను సంధానం చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు సమీపంలోని చెన్నరాయుని తిప్ప రిజర్వాయయర్‌ను ఏటా నింపాలన్నారు. కర్నూలు ప్రజల దాహం తీర్చేందుకు సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నిర్మించాలని, హంద్రీనీవా కాలువ నుంచి హంద్రీనదిలో నీళ్లు వదిలి, సమీప గ్రామాలకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రామసుబ్బారెడ్డి, ఓంకార్, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు బాలసుందరం, రాయలసీమ యూనైటెడ్ ఫోరం నాయకుడు శివనాగిరెడ్డి, టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రత్నం ఏసేపు, జిల్లా అధ్యక్షుడు తిమ్మన్న, లోక్ సత్తా పార్టీ మహిళా విభాగం నాయకురాలు రాజ్యలక్ష్మి, జిల్లా నాయకుడు డేవిడ్, సిల్వర్ జూబ్లీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగరాజు, కల్లూరు మండల ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్న, రవి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement