19న ఆర్బీఐ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఇండియాకు (ఆర్బీఐ) ఉన్న స్వయంప్రతిపత్తి హోదాను తీసివేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ‘సేవ్ ఆర్బీఐ’ పేరుతో నాలుగు ఉద్యోగ సంఘాలు కలిపి కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. నవంబర్ 19న దేశవ్యాప్తంగా ఉన్న 17,000 మంది ఉద్యోగులు సామూహిక సెలవులతో కేంద్రానికి తమ నిరసన తెలుపుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దీంతో దేశవ్యాప్తంగా రూ. 3 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు ఆగిపోతాయని అంచనా వేస్తున్నట్లు ఆర్బీఐ ఆల్ ఇండియా ఆర్బీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జి.క్రాంతి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డీరేట్ల సవరణపై ఆర్బీఐ గవర్నర్‌కి ఉన్న వీటో హక్కును తీసేయాలనుకోవడాన్ని, ఆర్బీఐ వద్ద ఉన్న అత్యవసర నిధి రూ. 2.43 లక్షల కోట్లలో లక్ష కోట్లు వాడుకోవాలని చూడటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఆర్బీఐ లాభాలను ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, అత్యవసర నిధిని వాడుకోవాలన్న ప్రయత్నం గర్హనీయమని అన్నారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని హరించే ప్రక్రియను తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కు అమలు చేస్తున్నట్లుగానే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్బీఐ పెన్షనర్లకు పెన్షన్ అప్డేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే అందరి సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.