screening system
-
మీ ఫోన్.. మీపైనే నిఘా..!
న్యూయార్క్: మీ స్మార్ట్ఫోన్ ఏయే పనులు చేస్తుందో తెలుసా..? కాల్స్, మెసేజ్లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా కనెక్టింగ్ ఇలా అన్ని పనులు చేస్తుందం టారా..? అయితే ఇవన్నీ మీకు తెలిసి.. మీరు చేస్తే జరుగుతున్న పనులు. మరీ మీకు తెలియకుండా మీ స్మార్ట్ఫోన్ చేస్తున్న దొంగపనుల సంగతేంటీ..! అని శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలియకుండా స్మార్ట్ఫోన్లోని అనేక ప్రముఖ యాప్లు మీరు చేసే ప్రతీ పనిని గమనిస్తున్నాయి. కాదు.. కాదు.. మీ మీద నిరంతరం నిఘా పెడుతున్నాయి. అలాగే మీ విషయాలను స్క్రీన్షాట్లు, వీడియోలు కూడా తీసుకుని.. థర్డ్పార్టీలకు చేరవేస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తోంది. ఈ వీడియోలు, స్క్రీన్షాట్లలో యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారంతోపాటు మీకు సంబంధించిన ప్రతీ వ్యక్తిగత సమాచారం కూడా అవతలి వ్యక్తులు లేదా సంస్థలకు చేరిపోతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఫోన్లో మనం చేసే ప్రతీ యాక్టివిటీనీ రికార్డు చేసే సామర్థ్యం ప్రతీ యాప్కు ఉందని తాము కనుగొన్నట్లు బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ చోఫిన్స్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా వాడే 17 వేలకు పైగా యాప్లను పరిశోధకులు పరీక్షించారు. వీటిలో 9 వేల యాప్లకు స్క్రీన్షాట్లు తీయగల సామర్థ్యం ఉందని.. వీటిలో ఏ యాప్ కూడా స్క్రీన్షాట్లు తీస్తున్నట్లు మనకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా పంపకపోవడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. ఈ అధ్యయనాన్ని కేవలం ఆండ్రాయిడ్ ఆపరే టింగ్ సిస్టమ్ ఆధారిత యాప్ల మీద చేసినప్పటికీ.. ఇతర ఆపరేటింగ్ సిస్టమ్లు ఏమంత సురక్షితమైనవి కావని వెల్లడించారు. మెడికల్ యాప్లు సమాచారాన్ని ఇతరులతో పంచుకుం టున్నాయని తెలిపారు. ఈ అధ్యయన ఫలి తాలను బార్సిలోనాలో జరగనున్న ప్రైవసీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీ సింపోజియమ్ సమావేశంలో సమర్పించనున్నారు. -
నిలువుతో సులువు!
నిన్న.. చాన్నాళ్ల క్రితం సుదూర ప్రయాణం అంటే రోజుల తరబడి సాగేది. రకరకాల ప్రయాణ సాధనాలను దాటి.. రైలు వచ్చినా.. ఒక దేశం నుంచి మరొక దేశం పోవాలంటే.. వారాలు పట్టాల్సిందే.. నేడు.. విమానం వచ్చాక ఈ ప్రపంచం చాలా చిన్నదైపోయింది.. గంటల వ్యవధిలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లిపోతున్నాం.. విమానం వచ్చి.. ఈ భూప్రపంచాన్ని చిన్నదిగా చేస్తే.. విమానాశ్రయాలు వచ్చి అదే భూప్రపంచంలోని చాలా భూమిని తమ వసతుల కోసం వినియోగించుకుంటున్నాయి. టెర్మినళ్లు, రన్వేలు, టాక్సీవేలు ఇలా ఎయిర్పోర్టు అంటే.. వేల ఎకరాల స్థలం సమర్పించాల్సిందే. మరి రేపు.. వీటన్నిటికీ పరిష్కారం ఈ నిట్టనిలువు ఎయిర్పోర్టు అట.. ఇలాంటిది మనమెప్పుడైనా చూశామా.. తక్కువ భూమి వినియోగంతో అన్ని సదుపాయాలున్న విమానాశ్రయం.. దీని వల్ల మిగిలి ఉన్న భూమిని వ్యవసాయ, వాణిజ్య, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు వినియోగించుకోవచ్చు. నిట్టనిలువుగా అన్నది ఎయిర్పోర్టులకే కాదు.. విమానాలకూ వర్తిస్తుంది.. ఇప్పటికే ఆ టైపువి కొన్ని వచ్చాయి కూడా.. అంటే.. నిట్టనిలువుగా ల్యాండింగ్.. టేకాఫ్ అన్నమాట. దీని వల్ల భారీ రన్వేలు అవసరముండదు. ప్రస్తుతం ఎయిర్పోర్టులను చూస్తే.. అంతా వాణిజ్య సముదాయాలే కనిపిస్తాయి. అయితే.. ఈ ఎయిర్పోర్టులో విభిన్నమైన అంశాలకు, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇక్కడే కొన్ని అంతస్తుల్లో పంటలు పండిస్తారు.. వాటిని అమ్మేందుకు కూడా మార్కెట్లు ఇక్కడే ఉంటాయి. మాల్స్, అగ్రికల్చర్ కాలేజీలు, చేపల పెంపకం, నిర్లవణీకరణ ప్లాంట్లు వంటివి కూడా ఏర్పాటు చేస్తారు. అంతేనా.. ముందున చెరువులా కనిపిస్తుంది చూశారు.. చుట్టుపక్కల ఉండే నీటి వనరులు అంటే కాలువలు కావచ్చు లేదా చెరువుల ద్వారా కావచ్చు.. వాటి నుంచి నీటిని ఇక్కడికి తరలిస్తారు.. ఈ నీటిని చేపల పెంపకంతోపాటు పంటల కోసం వినియోగిస్తారు.. దీంతోపాటు ఈ నీటిని శుద్ధి చేసి.. చుట్టుపక్కల ఉండే నివాస ప్రాంతాలకు తాగు నీటిని సరఫరా చేస్తారు. ఇక నగరంలోని రైలు వ్యవస్థను విమానాశ్రయానికి అనుసంధానం చేస్తారు. ప్రయాణికులు రైళ్ల ద్వారా ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. వాళ్ల లగేజీ వంటివి ఆటోమేటిక్గా వారు ప్రయాణిస్తున్న విమానాల్లోకి వెళ్లే వ్యవస్థ ఉంటుంది. టికెట్లు కొనుగోలు చేయడానికి చిన్నపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. తనిఖీల సమయాన్ని తగ్గించేందుకు ఆటోమేటిక్ స్క్రీనింగ్ వ్యవస్థ ఉంటుంది. విమానాలు ఇప్పటికంటే కాస్త చిన్నవిగా.. పర్యావరణ అనుకూల పునర్వినియోగ ఇంధనాన్ని వినియోగించేవిగా ఉంటాయి. ఈ ఎయిర్పోర్టులతో స్థల సమస్య తీరుతుందని.. పర్యావరణ అనుకూలమైనది కూడా కావడం వల్ల కాలుష్య ఉద్గారాలు తక్కువగా ఉంటాయని ఈ వర్టికల్ ఎయిర్పోర్టు డిజైనర్ జొనాథన్(అమెరికా) చెబుతున్నారు. కొత్త ఆలోచనలను, విప్లవాత్మకమైన, వినూత్నమైన డిజైన్లను ప్రోత్సహిస్తూ ‘ఇవాలో’ ఆర్కిటెక్చర్ మేగజైన్ ఏటా ఆకాశహర్మ్యాల పోటీని నిర్వహిస్తోంది. 2018కి సంబంధించిన పోటీలో ఈ డిజైన్ జ్యూరీ దృష్టిని ఆకర్షించింది. దీనికి జ్యూరీ ప్రత్యేక ప్రశంసా పురస్కారం దక్కింది. ..: సాక్షి, తెలంగాణ డెస్క్ -
పార్లమెంట్ గేట్ వద్ద తనిఖీ వ్యవస్థకు ఎంపీల డిమాండ్
పార్లమెంట్ గేట్ వద్ద సభ్యులందర్ని తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పార్టీలకతీతంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. లోకసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన తోపులాట, స్పీకర్ మైక్ విరిచివేత, పెప్పర్ స్పే ఘటనల నేపథ్యంలో తనఖీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యులు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక చర్యలకు తావులేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది మంచిది కాదు అని జేఎంఎం ఎంపీ కామేశ్వర్ బైతా అన్నారు. సభలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉభయ సభల్లోకి ప్రవేశించే సభ్యులను పూర్తిగా తనిఖీ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేవాలయం లాంటి సభకు ఇలాంటి సంఘటనలు అగౌరవాన్ని తీసుకువస్తాయన్నారు. ఉగ్రవాదుల చర్యలను తలపించేలా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా సంఘటనలున్నాయని పలువురు ఎంపీలు అన్నారు. ఈ సంఘటన తర్వాత పక్కాగా సభ్యులను తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని పలు పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.